‘సాక్షి’ ప్రతినిధి బృందం, రాజమహేంద్రవరం/ఐ.పోలవరం(రంపచోడవరం): గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటులో టూరిస్టులు లైఫ్ జాకెట్లు తీసేయడం వల్లే భారీగా ప్రాణ నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరగడానికి ముందు బోటులో ఉన్న వారంతా లైఫ్‌జాకెట్లు వేసుకున్న ఫొటోను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 15న బోటు పోశమ్మగండి వద్ద బయలుదేరి దేవీపట్నం పోలీసు స్టేషన్ దాటి ముందుకు వెళ్లిపోయింది. బోటు వెళ్లిపోతున్న విషయాన్ని గుర్తించి అక్కడి ఎస్‌ఐ నాగదుర్గాప్రసాద్ వెనక్కు తీసుకొచ్చి తనిఖీ చేశారు.
ఆ సమయంలో బోటులో ఉన్న ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా లైఫ్‌జాకెట్లు ధరించే ఉన్నారు. బోటుకు అనుమతి ఉందని బోటు పర్యవేక్షకుడు ఉత్తర్వులు చూపించడంతో మిగిలిన వారు లైఫ్ జాకెట్లు వేసుకోవాలని చెప్పి ఎస్‌ఐ స్టేషన్‌కు వచ్చేశారు. తనిఖీ పూర్తయిన అరగంటలోనే బోటు కచ్చులూరు మందం వద్దకు వెళ్లేసరికి సుడిగుండంలో మునిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. తనిఖీ అనంతరం టూరిస్టుల్లో సగం మందికి పైగానే లైఫ్‌జాకెట్లు తీసేశారని ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ఆరోజే చెప్పారు. బోటులో డ్యాన్స్ ప్రోగ్రాంను ఆస్వాదించేందుకు లైఫ్ జాకెట్లు తీసేసినట్లు తెలుస్తోంది.
మిగిలిన 15 మంది ఆచూకీ కోసం గాలింపు
బోటు ప్రమాదం జరిగిన కచ్చులూరు మందం సమీపంలో ఆదివారం మరో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ బోటులో మొత్తం 77 మంది ప్రయాణించినట్టు అధికారులు నిర్ధారించారు. వీరిలో 26 మంది బయటపడగా, గత వారం రోజుల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా మరో 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
పోలవరం మండలం ఎదుర్లంక వద్ద ఆదివారం గోదావరిలో లభ్యమైన మరో పురుషుని మృతదేహాన్ని పోలీసులు బోటు ప్రమాదానికి సంబంధించినదై ఉంటుందనే అనుమానంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మృతదేహంపై వెంట్రుకలన్నీ పూర్తిగా ఊడిపోయాయి. శరీరంపై డ్రాయర్ మాత్రమే ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో గుర్తించలేని 2 మృతదేహాలున్నాయి. బోటు వెలికితీత ప్రక్రియ నిలిచిపోయిందంటూ పలు పత్రికల్లో (సాక్షి కాదు) వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
హర్షకుమార్‌కు నోటీసు
మాజీ ఎంపీ హర్షకుమార్‌కు రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ శనివారం నోటీసు జారీ చేశారు. బోటు ప్రమాదానికి సంబంధించి మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే వాటితో రంపచోడవరం వచ్చి అందజేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment