సాక్షి నెట్‌వర్క్: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపాన గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదం మన రాష్ట్రంలోని పలు కుటుంబాల్లో విషాదం నింపింది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు విహారయాత్రకు వెళ్లి ఈ ప్రమాదం బారిన పడ్డారు. గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికంగా ఉన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు హైదరాబాద్‌కు చెందిన 21 మంది గల్లంతు కాగా, తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 9 మంది గల్లంతైనట్టు సమాచారం. కడిపికొండ గ్రామానికి చెందిన 14 మంది విహారయాత్రకు వెళ్లగా.. వీరిలో ఐదుగురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ బోడుప్పల్ శ్రీనివాసకాలనీ రైల్వే మాజీ ఉద్యోగి జానకిరామారావు భార్య జ్యోతి నీటమునిగి కన్నుమూయడంతో ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. అలాగే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు రమ్య (23), లక్ష్మణ్ (26) గల్లంతైనట్టు సమాచారం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రేపాకుల విష్ణుకుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆచూకీ లభ్యం కాలేదు.
తాలీబ్ పటేల్
డబ్బుల్లేక.... బతికిపోయా!
మాదంతా వాకింగ్ టీమ్. వాకింగ్ చేసే క్రమంలోనే ఆహ్లాదంగా గడిపేందుకు పాపికొండలు వెళ్లాలని టూర్ వేశాం. అయితే, అందరూ వెళ్లే సమయానికి నాకు డబ్బులు అందలేదు. దీంతో నేను మా స్నేహితులతో కలసి వెళ్లలేకపోయాను. అయితే, అక్కడి ప్రమాదం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. –బస్కే శంకర్, కడిపికొండ చూస్తుండగానే మునిగిపోయింది.. పాపికొండలు చూసేందుకు కడిపికొండ నుంచి ఆనందంగా బయలుదేరాం. ఆదివారం ఉదయం బోట్ ఎక్కగానే లైఫ్ జాకెట్లు ఇచ్చారు. చూస్తుండగానే గోదావరి నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. బోటు ఒక్కసారిగా ఒకవైపు ఒరిగి మునిగిపోయింది. లైఫ్ జాకెట్స్ ఉండటంతో బయటపడ్డాం. మా స్నేహితులు మాత్రం కళ్లెదుటే మునిగిపోయారు. –ఆరెపల్లి యాదగిరి, ప్రమాదం నుంచి బయపడిన వ్యక్తి
పవన్‌కుమార్, వసుంధర - రామారావు,శివ జ్యోతి దంపతులు
అంకుల్.. మా డాడీ రేపు వస్తాడా..
అంకుల్ మా డాడీ రేపు వస్తాడా అంటూ బస్కే రాజేంద్ర ప్రసాద్ కుమారుడు కృపాకర్ అందరినీ అడుగుతుండటం కంటతడి పెట్టించింది. అరుణోదయ కంప్యూటర్ సెంటర్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్‌కు భార్య, కుమార్తె, కుమారుడున్నారు. గ్రామానికి వెళ్లిన పలువురితో కృపాకర్ మాట్లాడుతూ.. ‘మా నాన్న ఆదివారం ఉదయం కాల్ చేశాడు. పాపికొండలకు వెళ్తున్నా అక్కడ సిగ్నల్స్ ఉండవు.. మళ్లీ ఫోన్ చేస్తా అన్నాడు.. ఇప్పుడు అందరూ ఇంటికి వస్తున్నారు.. ఏమైంది?’ అంటూ ఆ బాలుడు అమాయకంగా అడుగుతుండటం అందరినీ కన్నీళ్లు పెట్టించింది. –కృపాకర్, గొర్రె రాజేంద్రప్రసాద్ కుమారుడు
భరణి కుమార్, సుశీల్ కుమార్
మాతో మాట్లాడందే ఉండలేడు..
’విహారయాత్ర చాలా బాగా సాగుతోంది.. రేపు ఇంటికి వస్తాను.’ అని మా ఆయన శనివారం రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. నాతో పాటు బిడ్డా, కొడుకుతో రోజూ మాట్లాడనిదే ఉండలేడు. పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా భర్తకు ఏమీ కావొద్దని దేవుడిని వేడుకుంటున్నా. –రేణుక, బస్కే ధర్మరాజు భార్య
Comments
Please login to add a commentAdd a comment