సాక్షి, గన్నవరం (కృష్ణా జిల్లా): ‘పిల్లల చిన్నతనంలోనే వారి తండ్రి మరణించాడు.. ఇద్దరు కొడుకులను కష్టపడి చదివించా.. పెద్దకొడుకు ప్రయోజకుడై చేతి పని నేర్చుకొని కుటుంబాన్ని ఆదుకుంటున్న సమయంలో గోదావరి నా కొడుకును మింగేసింది’ అంటూ బోరున విలపిస్తుంది బోటు ప్రమాదంలో గల్లంతైన అబ్దుల్ సలీమ్ తల్లి గౌసియా బేగం. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరుకు చెందిన అబ్దుల్ సలీమ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఇంతవరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ సందర్భంగా సలీమ్ తల్లి గౌసియా మాట్లాడుతూ.. ‘నా కొడుకు ఇప్పటికే ఎన్నో పర్యాటక ప్రదేశాలు తిరిగాడు. పాపి కొండలు చూడాలనే కోరికతో తన స్నేహితులతో కలిసి బయలు దేరాడు. హనుమాన్ జంక్షన్ నుంచి ఐదుగురు స్నేహితులతో కలిసి పాపికొండలు చూడ్డానికి వెళ్లిన అబ్దుల్ సలీమ్ నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో గల్లంతైనాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సలీమ్ మేనమామ, పెద్దనాన్న సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇంతవరకు నా బిడ్డ ఆచూకీ తెలయలేదు’ అంటూ సలీమ్ తల్లి గౌసియా కన్నీరుమున్నీరుగా విలపించింది.
‘మా అన్నకు చిన్నప్పటి నుంచి ప్రకృతి అందాలు చూడాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే స్నేహితులతో కలిసి ఎన్నో ప్రదేశాల్లో తిరిగాడు. ఇప్పుడు పాపి కొండలు చూడ్డానికి వెళ్లి గల్లంతైనాడు. గోదావరి పర్యటన అంటే మా అమ్మ ఒప్పుకోదని.. రాజమండ్రిలో స్నేహితుడి పెళ్లి అని చెప్పి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు’ అంటూ సలీమ్ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడు
Comments
Please login to add a commentAdd a comment