సాక్షి, రాజమండ్రి : గోదావరిలో పడవ బోల్తా సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. తూరు గోదావరి జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా జిల్లాకు చెందిన మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు సహాయక చర్యల నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్‌ను రాజమండ్రి నుంచి తరలించారు. అలాగే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా అధికారులతో మాట్లాడారు.
చదవండి: బ్రేకింగ్ : గోదావరిలో పడవ మునక
అలాగే గోదావరి బోటు ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం విశాఖ, మంగళగిరి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగాయి. అలాగే జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ కూడా సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి బయల్దేరారు. కాగా బోటు ప్రమాదంలో దాదాపు ఇరవైమంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటన జరిగిన ప్రదేశం వద్ద సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో సమాచారం అందడంలో జాప్యం జరుగుతోందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. దేవీపట్నం మండలం కచ్చనూరు సమీపంలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటులో 61మంది ఉన్నారు.
ప్రమాద ఘటన దురదృష్టకరం: మంత్రి కన్నబాబు
గోదావరిలో బోటు ప్రమాదం దురదృష్టకరమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రాయల్ వశిష్ట లాంచీ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఉందని, ఘటనా స్థలానికి విశాఖ, మంగళగిరి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపినట్లు తెలిపారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారని, ప్రభుత్వ పరంగా అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
విశాఖ నుంచి రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
గోదావరిలో గల్లంత అయిన వారి ఆచూకీ కోసం విశాఖ నుంచి 60మందితో కూడిన రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. సమాచారం అందిన వెంటనే విపత్తలు నిర్వహణ శాఖ కమిషనర్...బృందాలను సంఘటనా స్థలానికి పంపారు. ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందంలో 30మంది, మరో బృందంలో 40మంది సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment