సాక్షి, అమరావతి: భద్రాచలం నుంచి పాపికొండలకు వచ్చే పర్యాటకులకు వీలుగా పోచవరంలో ఈ నెల 14 నుంచి బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. పర్యాటకులకు రాత్రి బస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 20వ తేదీలోగా పోలవరం నుంచి పాపికొండలకు కొత్త బోటింగ్ పాయింట్‌ను ప్రారంభించాలని, వారంలోగా నాగార్జునసాగర్‌లో బోట్ సర్వీసు నడపాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే హరిత రెస్టారెంట్ల్ల ఆదాయం మెరుగుపడుతోందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 69.57 కోట్లు వచ్చిందని తెలిపారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు పర్యాటకానికి మంచి సీజన్ అని, రెస్టారెంట్లలో పూర్తిస్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ, నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఆక్యుపెన్సీని పెంచాలని అధికారులను ఆదేశించారు. గండికోటలో రూ.4.50 కోట్లతో రోప్ వే, బొర్రా గుహల్లో రూ. 2.70 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, మారేడుమిల్లిలో రూ.1.15 కోట్లతో కాటేజీలు, అడ్వంచర్ స్పోర్ట్స్ పనులు వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు.
లంబసింగికి వచ్చే పర్యాటకుల కోసం తాత్కాలికంగా చేపట్టిన రెస్టారెంట్, టాయిలెట్స్ పనులు వారంలోగా పూర్తి చేస్తామన్నారు. పాండ్రంగిలో అల్లూరి మ్యూజియం, కృష్ణ్ణదేవిపేటలో ఆయన సమాధి అభివృద్ధి పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు, ఉత్తమ క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పూర్తయిందని, ఈ నెల 11, 12 తేదీల్లో విజయనగరంలో కొనసాగుతుందన్నారు. మార్చిలో రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహించి సీఎం చేతులమీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు.
మంచి సౌకర్యాలతో మెరుగైన ఆదాయం
Published Sat, Dec 11 2021 4:10 AM | Last Updated on Sat, Dec 11 2021 4:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment