సాక్షి, విశాఖపట్నం : గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన మరో కుటుంబం గల్లంతయినట్టు వెల్లడైంది. లాంచీ నిర్వాహకుల వద్ద లభించిన జాబితాలో ‘మహేశ్వరరెడ్డి (త్రీ ప్లస్ జీరో), హైదరాబాద్’ అనే ఉండేసరికి అంతా తెలంగాణకు చెందిన కుటుంబంగా భావించారు. అయితే.. విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సోమవారం సాయంత్రం రాజేశ్వరమ్మ అనే మహిళ ఫోన్ చేయడంతో బోటు ప్రమాదంలో విశాఖకు చెందిన మరో కుటుంబం గల్లంతు అయ్యిందన్న విషయం వెలుగులోకి వచ్చింది.
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి (35) విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలోనున్న లూఫిన్ ఫార్మాలో పనిచేస్తున్నారు. స్వస్థలానికి వెళ్లేందుకు మహేశ్వరరెడ్డి, ఆయన భార్య స్వాతి (30), పిల్లలు విఖ్యాత్‌రెడ్డి (6), హన్సిక (4)ను వెళ్లారు. వారి కారులోనే విశాఖలోని బుచిరాజుపాలేనికి చెందిన ఎంవీ సీతారామరాజు (52) కూడా ఉన్నారు. వారంతా రాజమహేంద్రవరంలో ఆగి పాపికొండలకు వెళ్లడానికి లాంచీ ఎక్కారు. గోదావరిలో బోటు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని ఆందోళన చెందిన మహేశ్వరరెడ్డి సోదరి రాజేశ్వరమ్మ సోమవారం విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment