ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు చేస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు (ఏరియల్ వ్యూ), హెలీకాఫ్టర్‌తో గాలింపు
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్‌లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగి 36 గంటలు కావస్తున్నా మొదట దొరికిన ఎనిమిది మినహా ఒక్క మృతదేహం కూడా బయట పడలేదు.
మృతదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్‌లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విశాఖ, మంగళగిరి ప్రాంతాల నుంచి 60 మంది, విశాఖ, కాకినాడ నుంచి 80 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ఓఎన్‌జీసీ హెలికాప్టర్, 8 రకాల బోట్లు, 12 ఆస్కా లైట్లు, ఆ ప్రాంతాలకు చెందిన ఈతగాళ్లు గాలించినా ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. ప్రమాదానికి గురైన బోటు జాడను గుర్తించేందుకు గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు నీటి ప్రవాహంలోనే వెతుకుతున్నారు. వారు కూడా కేవలం 60 అడుగులు లోతు వరకే వెళ్లగలుగుతారు. ఈ పరిస్థితుల్లో 315 అడుగుల లోతులో బోటు ఎక్కడ ఉందనేది గుర్తించడం కష్టమేనంటున్నారు.
బోటును గుర్తించేందుకు ‘సైడ్ స్కాన్ సోనార్’: నేవీకి చెందిన డీప్ డైవర్స్‌తో కూడిన బృందం తోపాటు ఉత్తరాఖండ్‌కు చెందిన నిపుణుల బృందం కూడా చేరుకుంది. వీరి వద్ద ఉన్న ‘సైడ్ స్కాన్ సోనార్’ ద్వారా బోటు కచ్చితంగా ఎక్కడ ఉందనేది గుర్తిస్తారు. తర్వాత బోటును బయటకు తీసే అవకాశాల్ని పరిశీలిస్తారు.
ధవళేశ్వరం వద్ద 175 గేట్లు మూసివేత
ఉభయ గోదావరి జిల్లాల్లోని సరిహద్దుల వెంబడి గాలింపు చర్యలు రాత్రి వేళ కూడా కొనసాగుతున్నాయి. మృతదేహాలు ఎగువ నుంచి నదిలో కొట్టుకు రావచ్చన్న సమాచారంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను పూర్తిగా కిందకు దించేసి బలమైన నైలాన్ వలలను ఏర్పాటు చేశారు. అక్కడ లైటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment