లాహిరి లాహిరికి.. బ్రేక్
నిలిచిన పాపికొండల విహారం
నిబంధనల ప్రకారం లేని బోట్లు
రోజుకు రూ.3 లక్షల నష్టం
సాక్షి, రాజమహేంద్రవరం : నిబంధనల ప్రకారం లేవని పాపికొండల పర్యాటక బోట్లను అధికారులు కొద్ది రోజులుగా నిలిపివేశారు. దీంతో పాపికొండలు పర్యాటక ప్రాంతానికి వెళ్లేవారి ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టయింది. పక్షం రోజుల క్రితం దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద ఓ లగ్జరీ బోటుకు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో బోటుకు కన్నం పడి అందులోకి నీరు చేరింది. నది ఒడ్డుకు చేరువలోనే ఈ ప్రమాదం జరగడంతో పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనతో గోదావరిలో పాపికొండల పర్యటనకు వెళ్లే లగ్జరీ ఏసీ బోట్లు, లాంచీలను అధికారులు నిలిపివేశారు. నిబంధనల ప్రకారం బోటులో పర్యాటకుల రక్షణకు సంబంధించి అన్ని ప్రమాణాలూ ఉంటేనే అనుమతివ్వాలని నిర్ణయించారు. ప్రతి బోటులో రెండు ఇంజన్లు, లైఫ్ జాకెట్లు, బోటు, పర్యాటకులకు బీమా, నది లోతును కొలిచే యంత్రం, మత్స్యశాఖ ఇచ్చే సర్టిఫికెట్ ఉన్న డ్రైవర్ ఉండి తీరాలని అధికారులు నిబంధనలు విధించారు. ఈ నేపథ్యంలో పర్యాటక బోట్లకు బ్రేక్ పడింది.
ఆర్థిక స్తోమతనుబట్టి బోట్ల నిర్మాణం
పాపికొండల పర్యాటకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ నిర్దిష్టమైన నిబంధనలేవీ లేకుండానే పలువురు తమ ఆర్థిక స్తోమతనుబట్టి లగ్జరీ బోట్లను నిర్మించుకున్నారు. ప్రస్తుతం గోదావరిలో 53 బోట్లు పాపికొండల పర్యాటకానికి వెళుతున్నాయి. ఇందులో మూడు మాత్రమే రెండు ఇంజన్లు ఉన్న బోట్లు ఉన్నాయి. మిగతా వాటికి రెండో ఇంజన్ ఏర్పాటు చేసుకోవడం, ఇతర అనుమతులు లభించాలంటే మరో 20 రోజులు సమయం పట్టనుంది.
పర్యాటకంపై ప్రభావం..
పర్యాటకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిబంధనలు విధించడం హర్షించదగ్గ పరిణామమే అయినా.. అన్ని బోట్లనూ నిలిపివేయడంతో పర్యాటకం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో ప్రతి రోజూ సుమారు 500 మంది పర్యాటకులు పాపికొండల పర్యాటకానికి వెళుతున్నారు. బోట్లను నిలిపివేయడంతో తమకు ప్రతి రోజూ రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లుతోందని బోట్ల యజమానులు వాపోతున్నారు. ఇదే సీజన్‌లో అయితే నాలుగు రెట్లు ఉంటుందని అంటున్నారు. బోట్లు నిలిచిపోవడంతో వాటిల్లో పని చేస్తున్న సిబ్బందికి, పర్యాటకులను రాజమహేంద్రవరం నుంచి పట్టిసీమ, పోలవరం, పురుషోత్తపట్నం తరలించే వాహనదారుల ఉపాధికి కూడా గండిపడింది. పాపికొండల విహారానికి వచ్చే పర్యాటకులు బోట్లు అందుబాటులో లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. బోట్లను రద్దు చేసిన అధికారులు ప్రత్యామ్నాయంగా ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్న పెద్ద బోటును ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు.
డైలమాలో లాంచీల యజమానులు
పాపికొండల పర్యటనకు వెళ్లే లాంచీలకు, బోట్లకు ఒకే విధానం ప్రకటించడంతో లాంచీల యజమానులు డైలమాలో పడిపోయారు. అసలే చిన్న లాంచీలు కావడం వాటిలో రెండో ఇంజను ఏర్పాటు చేయడంలో సాధ్యసాధ్యాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. నిబంధనల ప్రకారం బోటును సిద్ధం చేయాలంటే ఒక్కోదానికి రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు.
పర్యాటకుల భద్రత కోసమే..
ఉభయ గోదావరి జిల్లాల్లో పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లు 53 ఉన్నాయి. ఇందులో మూడు బోట్లు మాత్రమే నిబంధనల ప్రకారం ఉన్నాయి. రెండో ఇంజన్ బోటు బయటవైపు ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. పర్యాటకుల భద్రత కోసమే ఈ నిబంధనలు పెట్టాం. ప్రధాన ఇంజన్ మరమ్మతులకు గురై నది మధ్యలో బోటు ఆగిపోతే రెండో ఇంజన్ ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో నిర్మించే బోట్లకు రెండు ఇంజన్లు ఉంటేనే అనుమతిస్తాం. ఎస్కార్ట్ పెట్టుకుంటామని బోట్ల యజమానాలు విన్నవిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
– జి.భీమశంకరరావు, ప్రత్యేక అధికారి, అఖండ గోదావరి ప్రాజెక్టు
===
08ఆర్‌జేసీ1001 : పర్యాటక బోటు