సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: పెరుగుతున్న పులి గాండ్రిపులతో అడవి పులకిస్తోంది. జీవ వైవిధ్యం పరిమళిస్తోంది. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వెరసి పెద్ద పులులు ఊపిరి తీసుకుంటూ సంతానాన్ని పెంచుకుంటున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ వాటి కదలికలు మెరుగుపడ్డాయి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా.. మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. వాటి సంఖ్య మన రాష్ట్రంలో క్రమంగా పెరుగుతుండటం విశేషం.
నల్లమలలో రెట్టింపైన వ్యాఘ్రాలు
మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశంలోనే అతి పెద్దది. ప్రస్తుతం ఇక్కడ 63 పులులను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య 80 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా.. ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకు పులులు విస్తరించాయి. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు భద్రాచలం వరకు విస్తరించి ఉన్న పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతంలో నాలుగు పులులు, ఐదు చిరుత పులులను అధికారులు గుర్తించారు.
రక్షణ చర్యలు పెరగడంతో..
కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరుతో వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. ఫలితంగానే దేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న పులులకు మన రాష్ట్రంలోని పాపికొండల అభయారణ్యం ఆవాసంగా మారింది. అభయారణ్యం పరిధిలోని ఉభయ గోదావరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో 1,012.86 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 1,01,200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని అభయారణ్యంగా 2008లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మరోవైపు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలోని గోగులపూడి, పోలవరం మండలం టేకూరు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. అభయారణ్యం సంరక్షణ, జంతువుల జాడ కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అవగాహన పెంచుకోవాలి
పులుల సంరక్షణ అందరి బాధ్యత. పర్యావరణానికి అవి ఎంతో మేలు చేస్తాయి. వాటిపై అవగాహన పెంచుకుని పరిరక్షణకు నడుం బిగించాలి. మన రాష్ట్రంలో పులుల సంఖ్య బాగా పెరుగుతోంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వాటికి బాగా అనుకూలంగా ఉంది. అందుకే పులుల ఆవాసాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి.
– రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్)
పులులను రక్షించాలి
పర్యావరణ పిరమిడ్‌లో అగ్రసూచిగా ఉండేది పెద్ద పులి. ఆ తర్వాత చిరుత పులులు వంటి టాప్ కార్నివోర్స్ జీవ వైవిధ్యాన్ని కాపాడే గురుతర బాధ్యతతో ఉంటాయి. వాటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం. వన్య ప్రాణులు కనిపిస్తే అటవీ శాఖ దృష్టికి తీసుకు రావాలి. పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– సి.సెల్వమ్, వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, రాజమండ్రి
ట్రాప్ కెమెరాల్లో పులుల జాడ
పాపికొండల అభయారణ్యంలో పులుల సంచారం బాగుంది. మేం గ్రామాల్లో పర్యటించిన సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు పులుల గాండ్రింపులు విన్నట్టు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. గత నెల, ఈ నెలలో చిరుత పులులు, ఇతర జంతువుల జాడ కెమెరాకు చిక్కింది.
– ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, పాపికొండలు వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment