వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ చర్యలు
పాపికొండలు అభయారణ్యంలో 60 నీటి తొట్టెల ఏర్పాటు
20 చెలమలతో పాటు చెక్‌డ్యామ్‌లు
బుట్టాయగూడెం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్య ప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన, వాహనాల కింద పడి మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రెండేళ్లుగా వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో అటవీ శాఖ ఈ ఏడాది కూడా వేసవి ప్రణాళిక రూపొందించారు.
పాపికొండల్లో 60 నీటికుంటలు
పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేవిధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చెలమల్ని తవ్వి వన్య ప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. అవికాకుండా 25 చెక్‌డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తొట్టెల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాటి పక్కన ఉప్పు ముద్దలను పెడుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుని ఉప్పు ముద్ద నాకుతాయని, తద్వారా వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కృషి
పాపికొండలు అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటితొట్టెల్ని వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.50 లక్షలు వెచ్చిస్తోంది. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం
Comments
Please login to add a commentAdd a comment