thirst
-
అడవిలో అమృతధార
బుట్టాయగూడెం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్య ప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన, వాహనాల కింద పడి మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రెండేళ్లుగా వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో అటవీ శాఖ ఈ ఏడాది కూడా వేసవి ప్రణాళిక రూపొందించారు. పాపికొండల్లో 60 నీటికుంటలు పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేవిధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చెలమల్ని తవ్వి వన్య ప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. అవికాకుండా 25 చెక్‌డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తొట్టెల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాటి పక్కన ఉప్పు ముద్దలను పెడుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుని ఉప్పు ముద్ద నాకుతాయని, తద్వారా వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కృషి పాపికొండలు అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటితొట్టెల్ని వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.50 లక్షలు వెచ్చిస్తోంది. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
సేవ కోసం నిరీక్షణ
హజ్రత్ షర్ఫుద్దీన్ ధార్మిక భావాలు గల యువకుడు. తల్లిదండ్రుల సేవ చేయడంలో అతనికి అతనే సాటి. ఒకసారి అతని తల్లి జబ్బున పడింది. మూలుగుతూ తనయుణ్ణి పిలిచి ‘‘నాయనా దాహమేస్తోంది కాసిన్ని మంచినీళ్లివ్వు’’ అని అడిగింది. తల్లి దాహం తీర్చేందుకు కడవ దగ్గరికి హుటాహుటిన నీళ్లకోసం పరిగెత్తాడు షర్ఫుద్దీన్. ఆ వెంటనే పాత్రలో నీళ్లతో తల్లిముందు ప్రత్యక్షమయ్యాడు. ఈలోగా ఆయన తల్లి నిద్రలోకి జారుకుంది. ‘అమ్మను నిద్రనుంచి మేల్కొలిపితే నిద్రాభంగమవుతుంది. దాహం తీర్చకపోతే అమ్మ పట్ల అవిధేయత చూపినవాడను అవుతాను’ అని మనస్సులోనే అనుకోసాగాడు. అలా నీళ్ల పాత్రను చేతిలో పట్టుకొని తల్లి తలాపు వైపున నిల్చుండిపోయాడు. తన తల్లి ఏ క్షణంలో మేల్కొని నీళ్లు అడుగుతుందోనని పడిగాపులు కాసాడు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ఇలానే నిల్చుండిపోయాడు. చాలా పొద్దుపోయాక తల్లి నిద్ర నుండి మేల్కొన్నది. కళ్లు తెరిచి చూసేసరికి నీటి పాత్రతో షర్ఫుద్దీన్ నిలబడి ఉన్నాడు. ‘‘అప్పటి నుండి నీవు ఇలా నిల్చునే ఉన్నావా నాయనా’’ అని ఆప్యాయతతో అడిగింది తల్లి. ‘‘అవునమ్మా నీవు నిద్రనుంచి లేవగానే నీళ్లు ఇద్దామని ఇక్కడే నిల్చుండిపోయానమ్మా’’ అని సమాధానమిచ్చాడు. షర్ఫుద్దీన్. తన ముద్దుల కుమారుడి సేవకు ఆ తల్లి ఎంతగానో ఆనందించింది. కొడుక్కి ఆశీర్వచనాలు అందించింది. – సుహైబ్ -
దప్పిక తీరే దారేది..!
బజార్హత్నూర్(బోథ్): ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లాలో భూగర్భ జలమట్టం అడుగంటిపోతోంది. గుక్కెడు నీటి కోసం జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. పశువులు, మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాగులు, కుంటలు ఎండిపోవడంతో దాహార్తి తీరక అల్లాడిపోవాల్సి వస్తోంది. పశువుల దప్పిక తీర్చేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నీటితొట్టిల నిర్మాణానికి గతంలో నిధులు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పగించింది. గుత్తేదారులు, సదరు నేతలు ఇష్టానుసారంగా నీటితొట్టిలు నిర్మించి వదిలేశారు. ఉపాధి హామీ అధికారుల పర్యవేక్షణ లోపించడం, సరైన ప్రణాళికలు లేక నీటి సౌకర్యం లేని చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో అవి మూగజీవాల దాహార్తి తీర్చడం లేదు. 576 నీటితొట్టిల నిర్మాణానికి నిర్ణయం.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 576 నీటితొట్టిలు నిర్మించాలని నిర్ణయించారు. గతంలో ఒక్కో నీటితొట్టి నిర్మాణానికి రూ.18వేల చొప్పున ప్రభుత్వం రూ.1.36 కోట్లు మంజూరు చేసింది. నాసిరకంగా నిర్మించడం, నీటి సదుపాయం కల్పించకపోవడంతో చాలా గ్రామాల్లో వృథాగా మారాయి. జిల్లా మొత్తంలో ఇప్పటివరకు దాదాపు 320 నీటితొట్టిలు మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. మరో 56 నిర్మాణంలో ఉండగా, మిగతా 200 నీటితొట్టిల నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. పశుసంవర్థక శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొత్తం 5.45లక్షల వరకు ఉన్నాయి. వీటికి వేసవిలో నీటి సదుపాయం కల్పించాలంటే గ్రామాల్లోని నీటితొట్టిలను వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అవసరం లేని చోట నిర్మించడం, నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో నిర్మించినవి నిరుపయోగంగా మారడం వల్ల పశువుల దాహార్తి తీరడం లేదని జిల్లా రైతులు వాపోతున్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల నుంచి తొట్టిలకు నీరు సరఫరా చేయాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మేతకు వెళ్లిన పశువులు దాహార్తి తీర్చుకోవడానికి తొట్టి వద్దకు వచ్చిన నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. వేసవి దృష్ట్యా అవసరం ఉన్న చోట మూగజీవాలకు నూతనంగా నీటితొట్టెల నిర్మాణం చేపట్టేలా దృష్టి సారించాలని గత నెల 11న కలెక్టర్ డి.దివ్యదేవరాజన్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆదేశింంచారు. ఉపాధి మామీ పథకం ద్వారా గతంలో 576 నీటితొట్టిలకు నిధులు మంజూరైనా అందులో నిర్మించకుండా ఉన్న 200 నీటితొట్టిల నిర్మాణానికి ప్రస్తుతం ఒక్కో నీటితొట్టికి రూ.24 వేలు పెంచి మళ్లీ నిధులు మంజూరు చేశారు. అయినా ఉపాధి హామీ అధికారులు వాటి నిర్మాణాలపై దృష్టి సారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మూగజీవాలపై నిర్లక్ష్యం.. వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను వినియోగంలోకి తేవాలి. పశుసంవర్థకశాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఎవరికి వారు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నీటితొట్టికి బోరు ఏర్పాటుతోపాటు విద్యుత్తు కనెక్షన్ కల్పించడంలో దృష్టి సారించడం లేదు. నోరులేని మూగజీవాలపై గ్రామ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రజలు బెంబేలెత్తుతుంటే రానున్న రెండు నెలల్లో ఈ తీవ్రత మరింత పెరిగి మూగజీవాలకు ముప్పు తిప్పలు తప్పవని వాపోతున్నారు. ఉపయోగంలోకి తేవాలి వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వాగులు, చెలిమెలు, కుంటలు ఎండిపోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులకు దాహార్తి తీర్చడం కష్టంగా మారింది. అక్కడక్కడ బురుద నీళ్లు తాగుతున్నాయి. గ్రామాల్లో నిర్మించిన నీటితొట్టిలు మరమ్మతు చేసి ఉపయోగంలోకి తేవాలి. వేసవిలో నీళ్లు దొరకక పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్ వేదిక జిల్లా అధ్యక్షుడు దాహార్తి తీర్చడంపై దృష్టి సారించాం జిల్లాలో 18 మండలాల్లో గతంలో నిర్మించిన నీటితొట్టిలను వినియోగంలోకి తెస్తాం. నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను మరమ్మతులు చేయించడమే కాకుండా అవసరం ఉన్న గ్రామాల్లో నూతనంగా నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తాం. ఇప్పటికే పంచాయతీల వారీగా నీటితొట్టిల వివరాలను సేకరిస్తున్నాం. వేసవిలో మూగజీవాలకు తాగునీటి సమస్య కలగకుండా ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపడతాం. – రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీఏ పీడీ -
ఇటు సేదతీరి.. అటు యుద్ధం!
ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఐసిస్ టెర్రరిస్టులతో యుద్ధం చేస్తున్న సైనికులకు, అక్కడ అంతర్యుద్ధానికి భయపడి వస్తున్న పౌరులకు హమ్మమ్ అల్ హలీల్ ప్రాంతం ఒయాసిస్సులా మారింది. తాగే మంచినీటి నుంచి స్నానానికి వాడే మురికినీరు వరకు దొరకడం కనాకష్టమైన మోసుల్ నగరం నుంచి వస్తున్న సైనికులు, పౌరులు హలీల్ ప్రాంతంలో సేద తీరుతున్నారు. అంతర్యుద్ధం కారణంగా ఎంతో కాలంగా మూతపడిన చారిత్రక ‘స్పా’ను కూడా మొన్ననే తెరిచారు. గంధకం ఎక్కువగా ఉండే ఇక్కడి నీటి బావుల్లో స్నానం చేస్తే జబ్బులు నయం అవుతాయన్న నమ్మకంతో ఒక్క ఇరాక్ నుంచే కాకుండా ఇరుగు, పొరుగు దేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చేవారు. ఐసిస్ టెర్రరిస్టుల దాడుల కారణంగా ఇరుగు, పొరుగు దేశాల నుంచి ప్రజల రాక నిలిచిపోయినా ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. ఐసిస్ టెర్రరిస్టులతో చేస్తున్న యుద్ధం కాస్త తెరిపి ఇవ్వడంతో విడతల వారీగా సైనికులు ఇక్కడికి వచ్చి పోతున్నారు. ఇక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్లీ టెర్రరిస్టులపై యుద్ధానికి వెళుతున్నామని సహద్ మొహమ్మద్ జాబర్ అనే 32 ఏళ్ల సైనికుడు తెలిపారు. ఇక ప్రజల రాక మొదలైంది కనుక తమకు చేతినిండా పని దొరికి, జీతాలిచ్చే అవకాశం కూడా ఉందని స్పాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తెలిపారు. హమ్మమ్ అలీ అలీల్ అంటే అరబిక్ భాషలో రోగులు స్నానం చేసే చోటు అనే అర్థం ఉంది. ఇక్కడ నీళ్లలో గంధకం ఎక్కువ ఉండడం వల్ల జబ్బులు నయం అవుతున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. -
వర్షాకాలంలోనూ దాహం కేకలు!
అడుగంటిన తాగునీటి చెరువులు వర్షాలు కురిసినా ఉపయోగం లేదు కాలువలకు నీటి విడుదల ఎప్పుడో.! మచిలీపట్నం : పాలకుల నిర్లక్ష్యం జిల్లా ప్రజల పాలిట శాపంగా మారింది. వర్షాకాలంలోనూ తీర ప్రాంతంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. జూలై వచ్చినా కాలువలకు తాగునీరు విడుదల చేయలేదు. ఎప్పటికి విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాలు సమృద్ధిగానే కురిసినా, ఆ వాన నీటిని చెరువులకు మళ్లించే చర్యలు చేపట్టలేదు. దీంతో తీర ప్రాంతంలోని తాగునీటి చెరువులు అడుగంటి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గుక్కెడు నీరు ఇవ్వండి మహాప్రభో అని ప్రజలు గొంతెత్తి అరుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కాలువలకు తాగునీటి ఎప్పటికి విడుదల చేస్తారో, ఎప్పటికి చెరువులను నింపుతారనేది తెలియని పరిస్థితి నెలకొంది. అడుగంటిన చెరువులు సముద్రతీరం వెంబడి ఉన్న నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు, పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దున ఉన్న కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లోని తాగునీటి చెరువులు పూర్తిగా అడుగంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొద్దిపాటి నీరు చెరువుల్లోకి చేరినా అవి పంపింగ్‌కు సరిపడా లేని పరిస్థితి నెలకొంది. మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాలతో పాటు బందరు, గూడూరు మండలాలకు తాగునీటిని సరఫరా చేసే తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు పూర్తిస్థాయిలో అడుగంటింది. 5.9 మీటర్ల నీటి సామర్ధ్యం ఉన్న ఈ ట్యాంకులో ప్రస్తుతం 1.20 మీటర్ల నీరు మాత్రమే ఉంది. రెండున్నర మీటర్లకు ఈ ట్యాంకరులో నీటి మట్టం చేరితే డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు. ప్రస్తుతం 1.20 మీటర్ల మేర ఉన్న నీరు పచ్చగా మారి తాగడానికి పనికిరాని పరిస్థితి నెలకొంది. పంపింగ్, లేదా ఆవిరి అవడం ద్వారా రోజుకు నాలుగు పాయింట్లు చొప్పున చెరువులోని నీరు ఖర్చవుతుందని సిబ్బంది చెబుతున్నారు. 20 ఏళ్లలో ఇంతగా చెరువులో నీటిమట్టం పడిపోయినా దాఖలాలు ఈ ఏడాదే చూశామని సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్యాంకులో ఉన్న నీరు పది, పదిహేను రోజులకు మించి రాదని అది కూడా మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తేనే ఈ లెక్క సరిపోతుందని మునిసిపల్ అధికారులు తెలిపారు. నాగాయలంక మండలం ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే చెరువు పూర్తిస్థాయిలో అడుగంటింది. నాగాయలంక, కోడూరు మండలాల్లోని పది పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేసే కమ్మనమోలు మంచినీటి పథకం చెరువులో నీరు లేకపోవటంతో పడకేసింది. ట్యాంకర్ల ద్వారా అరకొరగా .. తీర ప్రాంతంలో వేసవి నుంచి తాగునీటి ఎద్దడి వెంటాడుతూనే ఉంది. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అరకొరగానే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కృత్తివెన్ను మండలంలోని మాట్లం, పల్లెపాలెం, గరిసపూడి, లక్ష్మీపురం పంచాయతీలకు రోజు విడిచి రోజు ట్యాంకరును పంపుతున్నారు. కుటుంబానికి రెండు బిందెలు చొప్పున మాత్రమే తాగునీటిని ఇస్తున్నారు. నాగాయలంక మండలం గుల్లలమోద, పెదకమ్మవారిపాలెం, దీనదయాళపురం గ్రామాలకు రోజు విడిచి రోజు ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి అవసరాలకు ఒకటి, రెండు బిందెలను వాడుకుని వంటకు స్థానికంగా లభించే ఉప్పునీటినే ఉపయోగించాల్సిన పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది. కోడూరు మండలం దింటిమెరక, పాలకాయతిప్ప, రామకృష్ణాపురం, ఇరాలి గ్రామాల్లోనూ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ఒక్క తాగునీటి పథకం పనిచేయటం లేదు. తాగునీటి చెరువులు ఎండిపోవటంతో ట్యాంకర్ల ద్వారా కుటుంబానికి ఇచ్చే రెండు, మూడు బిందెల నీటితోనే అక్కడి ప్రజలు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. కైకలూరులోనూ రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నా అవి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా పాలకులు తాగునీటి అవసరాల కోసం నీటిని కాలువలకు విడుదల చేయకపోవటం గమనార్హం. -
పశువులకూ పైసల నీళ్లు
♦ బోరు అద్దెకు తీసుకున్న రైతులు ♦ నిత్యం తాగు నీటిని అందిస్తున్న వైనం ♦ మల్కాపూర్ గిరిజనుల వినూత్న ఆలోచన ఈ వింతను ఏనాడైన చూశారా?, నీటిని కొనుగోలు చేసి పశువుల దాహం తీర్చే రోజులొస్తాయని ఎవరైనా ఊహించారా?, ఇక్కడ అలాంటి పరిస్థితే నెలకొంది. పశువుల దాహార్తి తీర్చేందుకు గిరిపుత్రులు నీళ్లను కొంటున్నారు. ఇంటింటికీ డబ్బులు పోగుచేసుకుని ఓ బోరు అద్దెకు తీసుకున్నారు. నిత్యం మూగ జీవాలకు నీటిని అందిస్తూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మెదక్: మెదక్ మండలం రాయిన్‌పల్లి పంచాయతీ పరిధి మల్కాపూర్ గిరిజన తండాలో ఇరవైకిపైగా గిరిజన కుటుంబాలున్నాయి. వీరందరికీ వ్యవసాయమే ఆధారం. పాడి పశువులతో వీరికి యేళ్లతరబడి బంధం పెనవేసుకుంది. ఒక్కో ఇంటికి 20 నుంచి 50 వరకు పశువులు ఉండగా, గొర్రెలు, మేకలు సైతం భారీగానే ఉన్నాయి. రెండేళ్లుగా కరువు నెలకొనడంతో గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటాయి. బోరుబావులన్నీ మూలనపడ్డాయి. మనుషులతోపాటు మూగ జీవాలకు సైతం తాగునీటి కష్టం ఏర్పడింది. మనుషులకు దాహమేస్తే ఎలాగోలా తిప్పలు పడి ఏదో ఒకటి తాగుతాడు. మరీ మూగజీవాల పరిస్థితి?. దాహమేసినా... ఆకలేసినా.. అమాయక చూపులు... ఆవేదనతో చూడటం తప్ప మరేం చేయగలవు. దీంతో తండాలోని గిరిజనులంతా ఓ ఆలోచన చేశారు. ఇంటింటికి డబ్బులు వేసుకుని తండా సమీపంలోని ఓ రైతు బోరును రూ.10 వేలకు అద్దెకు తీసుకున్నారు. వర్షాలు పడేంత వరకు తమ పశువులకు తాగునీరివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. జేసీబీ గుంతలో బోరునీటిని నిల్వ చేసుకుని మూగజీవాల దప్పిక తీరుస్తున్నారు. -
ఏది వెలుగు?
జెన్ పథం శిష్యులంతా కూడబలుక్కుని అసలైన సమాధానం ఏదో మీరే చెప్పండని గురువుగారిని అడిగారు. ఒక గురువు శిష్యులకు పాఠం చెప్తున్నారు. ‘‘పుట్టుకకు సంబంధించి అన్ని ప్రాణులూ సమానమే. ఆకలి, దాహం, నిద్ర, మృత్యువు భయం వంటివి అన్ని ప్రాణులకూ సంబంధించినవే. దిగులు అనేది కూడా అందరికీ చెందినదే. ఇందులో ధనికులూ, పేదలూ అనే తేడా ఉండదు. రాత్రీ పగలూ ఆనందం, ఆవేదన, సుఖమూ, దుఃఖమూ అనేవి కూడా ఒక దాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఏవీ స్థిరంగా ఉండిపోవు. అలాగే జననం, మరణం కూడా. రాత్రి వస్తుంది. అది కొన్ని గంటలు ఉండి నెమ్మది నెమ్మదిగా చెదరిపోయి పగలు వస్తుంది. అయితే ఇంతకూ మనకు ఏ క్షణాన ఉదయం వచ్చిందో మీలో ఎవరైనా చెప్పగలరా?’’ అని గురువుగారు ప్రశ్నించారు. ఒక శిష్యుడు లేచి నిల్చుని ‘‘గురువుగారూ, ఒక మృగం అల్లంత దూరాన ఉన్నప్పుడే అది గాడిదో, గుర్రమోనని గుర్తు పట్టినప్పుడు వెలుతురుతోపాటే ఉదయం వచ్చినట్టు అనుకోవాలి’’ అని ఎంతో వినయంగా చెప్పాడు. కానీ గురువు గారు అతను చెప్పిన మాటలన్నీ విని అది సరైన సమాధానం కాదని అన్నారు. ఇంతలో మరో శిష్యుడు లేచి నిల్చుని ‘‘గురువుగారూ, అల్లంత దూరంలో ఉన్న ఒక చెట్టుని అది మర్రిచెట్టో, చింతచెట్టో చెప్పగలిగినప్పుడు వెలుతురు వచ్చినట్టే అనుకోవాలి’’ అన్నాడు. అది కూడా సరైన జవాబు కాదన్నారు గురువుగారు. అప్పుడు మిగిలిన శిష్యులు ఒక్కటై తాము ఏది చెప్పినా సరికాదంటున్న గురువుగారినే సరైన సమాధానమేదో చెప్పమంటే సరిపోతుంది కదా అని కూడబలుక్కుని ఆ మాటనే గురువుగారితో అన్నారు. గురువుగారు సరేనని ఇలా చెప్పారు- ‘‘ఏ పురుషుడు కనిపించినా అతను నా సోదరుడే అని, ఏ స్త్రీ కనిపించినా ఆమె నా సోదరి అని ఎప్పుడైతే మీరు భావిస్తారో అప్పుడే మీరు నిజమైన వెలుగును చూసినట్లు అనుకోవాలి. అప్పటిదాకా మిట్టమధ్యాహ్నపు ఎండ వెలుగైనా సరే నిశిరాత్రి చీకటే’’. రాత్రీ పగలూ అనే వి కేవలం కాలంలో వచ్చే మార్పులే. వెలుగు అనేది అంతరంగంలో రావాలన్నది ఇక్కడి గురువుగారి భావం. - యామిజాల జగదీశ్