పశువులకూ పైసల నీళ్లు
♦ బోరు అద్దెకు తీసుకున్న రైతులు
♦ నిత్యం తాగు నీటిని అందిస్తున్న వైనం
♦ మల్కాపూర్ గిరిజనుల వినూత్న ఆలోచన
ఈ వింతను ఏనాడైన చూశారా?, నీటిని కొనుగోలు చేసి పశువుల దాహం తీర్చే రోజులొస్తాయని ఎవరైనా ఊహించారా?, ఇక్కడ అలాంటి పరిస్థితే నెలకొంది. పశువుల దాహార్తి తీర్చేందుకు గిరిపుత్రులు నీళ్లను కొంటున్నారు. ఇంటింటికీ డబ్బులు పోగుచేసుకుని ఓ బోరు అద్దెకు తీసుకున్నారు. నిత్యం మూగ జీవాలకు నీటిని అందిస్తూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
మెదక్: మెదక్ మండలం రాయిన్‌పల్లి పంచాయతీ పరిధి మల్కాపూర్ గిరిజన తండాలో ఇరవైకిపైగా గిరిజన కుటుంబాలున్నాయి. వీరందరికీ వ్యవసాయమే ఆధారం. పాడి పశువులతో వీరికి యేళ్లతరబడి బంధం పెనవేసుకుంది. ఒక్కో ఇంటికి 20 నుంచి 50 వరకు పశువులు ఉండగా, గొర్రెలు, మేకలు సైతం భారీగానే ఉన్నాయి. రెండేళ్లుగా కరువు నెలకొనడంతో గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటాయి. బోరుబావులన్నీ
మూలనపడ్డాయి. మనుషులతోపాటు మూగ జీవాలకు సైతం తాగునీటి కష్టం ఏర్పడింది. మనుషులకు దాహమేస్తే ఎలాగోలా తిప్పలు పడి ఏదో ఒకటి తాగుతాడు. మరీ మూగజీవాల పరిస్థితి?. దాహమేసినా... ఆకలేసినా.. అమాయక చూపులు... ఆవేదనతో చూడటం తప్ప మరేం చేయగలవు. దీంతో తండాలోని గిరిజనులంతా ఓ ఆలోచన చేశారు. ఇంటింటికి డబ్బులు వేసుకుని తండా సమీపంలోని ఓ రైతు బోరును రూ.10 వేలకు అద్దెకు తీసుకున్నారు. వర్షాలు పడేంత వరకు తమ పశువులకు తాగునీరివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. జేసీబీ గుంతలో బోరునీటిని నిల్వ చేసుకుని మూగజీవాల దప్పిక తీరుస్తున్నారు.