
హజ్రత్ షర్ఫుద్దీన్ ధార్మిక భావాలు గల యువకుడు. తల్లిదండ్రుల సేవ చేయడంలో అతనికి అతనే సాటి. ఒకసారి అతని తల్లి జబ్బున పడింది. మూలుగుతూ తనయుణ్ణి పిలిచి ‘‘నాయనా దాహమేస్తోంది కాసిన్ని మంచినీళ్లివ్వు’’ అని అడిగింది. తల్లి దాహం తీర్చేందుకు కడవ దగ్గరికి హుటాహుటిన నీళ్లకోసం పరిగెత్తాడు షర్ఫుద్దీన్. ఆ వెంటనే పాత్రలో నీళ్లతో తల్లిముందు ప్రత్యక్షమయ్యాడు. ఈలోగా ఆయన తల్లి నిద్రలోకి జారుకుంది. ‘అమ్మను నిద్రనుంచి మేల్కొలిపితే నిద్రాభంగమవుతుంది. దాహం తీర్చకపోతే అమ్మ పట్ల అవిధేయత చూపినవాడను అవుతాను’ అని మనస్సులోనే అనుకోసాగాడు. అలా నీళ్ల పాత్రను చేతిలో పట్టుకొని తల్లి తలాపు వైపున నిల్చుండిపోయాడు.
తన తల్లి ఏ క్షణంలో మేల్కొని నీళ్లు అడుగుతుందోనని పడిగాపులు కాసాడు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ఇలానే నిల్చుండిపోయాడు. చాలా పొద్దుపోయాక తల్లి నిద్ర నుండి మేల్కొన్నది. కళ్లు తెరిచి చూసేసరికి నీటి పాత్రతో షర్ఫుద్దీన్ నిలబడి ఉన్నాడు. ‘‘అప్పటి నుండి నీవు ఇలా నిల్చునే ఉన్నావా నాయనా’’ అని ఆప్యాయతతో అడిగింది తల్లి. ‘‘అవునమ్మా నీవు నిద్రనుంచి లేవగానే నీళ్లు ఇద్దామని ఇక్కడే నిల్చుండిపోయానమ్మా’’ అని సమాధానమిచ్చాడు. షర్ఫుద్దీన్. తన ముద్దుల కుమారుడి సేవకు ఆ తల్లి ఎంతగానో ఆనందించింది. కొడుక్కి ఆశీర్వచనాలు అందించింది.
– సుహైబ్