సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ పథకాల అమలుపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు హౌసింగ్ లేఅవుట్ వద్ద జరుగుతున్న పీఎంఏవై–అర్బన్ గృహ నిర్మాణాలను కేంద్ర అధికారుల బృందం శనివారం పరిశీలించింది. పీఎంఏవై–అర్బన్ హౌసింగ్ డైరెక్టర్ ఆర్కే గౌతమ్, ఇంజినీర్లు సునీల్ పరేఖ్, మనీష్‌తో కూడిన బృందం సభ్యులు స్థానిక లబ్ధిదారులతో మాట్లాడారు. వారి గత, ప్రస్తుత జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఇళ్లతో పాటు నిర్మాణంలో వినియోగిస్తున్న ఇటుకలు, సిమెంట్ తదితర సామగ్రిని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు కేంద్ర బృందం విజయవాడలోని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమాలపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 5 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించిందని, మిగిలిన ఇళ్లను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తోందని రాష్ట్ర అధికారులు వివరించారు.
అలాగే కేంద్ర బృందం మంగళగిరిలోని టిడ్కో ఇళ్లను పరిశీలించి అక్కడి లబ్ధిదారులతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కేంద్ర బృందం వెంట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ జేఎండీ కె.శివప్రసాద్, చీఫ్ ఇంజినీర్ జి.వి.ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్లు వెంకట్‌రెడ్డి, ఎస్‌ఈలు జయరామాచారి, నాగభూషణం తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment