‘డబుల్’ ట్రబుల్
భారంగా మారిన ‘డబుల్ బెడ్‌రూం’ పథకం
♦ తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించే పరిజ్ఞానంపై ప్రభుత్వం ఆరా
♦ నేడు 25 దేశవిదేశీ నిర్మాణ సంస్థలతో సమాలోచన
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారమవుతోంది. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. 125 చదరపు గజాల స్థలంలో విశాలమైన ఇంటి నిర్మాణానికి భారీ వ్యయం అవుతోంది. అయినా అది సరిపోవటం లేదంటూ నిర్మాణ సంస్థలు ముందుకురావటం లేదు. యూనిట్ ధర పెంచాలంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మంజూరు చేసిన 65 వేలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన 2 లక్షల ఇళ్లకు హైదరాబాద్‌లో యూనిట్‌కు రూ.7 లక్షల పైన, జిల్లాల్లో రూ.5 లక్షల పైన.. మొత్తం కలిపి దాదాపు రూ.15,500 కోట్లు అవసరమవుతున్నాయి.
ఈ నిధులు సిద్ధం చేసినా కాంట్రాక్టర్లు ముందుకొచ్చేలా లేరు. ఇది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. దీంతో అతి తక్కువ వ్యయంతో ఈ తరహా ఇళ్ల నిర్మాణానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిజ్ఞానం కోసం తాజాగా అన్వేషణ ప్రారంభించింది. అలాగే ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న యూనిట్ కాస్ట్‌కే కాంట్రాక్టర్లు ముందుకు రావాలంటే వారికి ఎలాంటి తాయిలాలు ఇస్తే బాగుంటుందనే కోణంలో దృష్టి సారించింది. ఇందుకోసం నిర్మాణ రంగంలో నైపుణ్యం, విశేష అనుభవం ఉన్న దేశవిదేశీ సంస్థలతో సమాలోచనలకు సిద్ధమైంది.
ఇలాంటి సంస్థలను ఆహ్వానిస్తూ గత నెలలో ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేయగా 25 సంస్థలు స్పందించాయి. ఇందులో అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్‌కు చెందిన సంస్థలూ ఉన్నాయి. వీటితోపాటు స్థానిక, దేశీయ సంస్థలు, కొందరు ఇంజనీర్లు కూడా ఆసక్తి ప్రదర్శించారు. ఈ సంస్థల ప్రతినిధులతో గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి అశోక్‌కుమార్, నిర్మాణంలో భాగస్వామ్యమైన జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇతర ప్రధాన విభాగాల ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్లు బుధవారం భేటీ అవుతున్నారు.
కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి
సంప్రదాయ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నది కావటంతో దాన్ని వీలైనంతగా తగ్గించే సాంకేతిక పరిజ్ఞానంపై ఇందులో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతోపాటు విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న కొత్త పద్ధతులపై చర్చించనున్నారు. దీంతోపాటు ఖర్చు పెంచే నిర్మాణ సామగ్రికి ప్రత్యామ్నాయం వస్తువులపై, తక్కువ వడ్డీకి రుణం అందించే అంతర్జాతీయ సంస్థల గురించీ చర్చించనున్నారు. వీటన్నింటిపై ఓ నివేదిక రూపొందించి వారం రోజుల్లో ముఖ్యమంత్రికి సమర్పిస్తారు. నిపుణులు చేసిన సూచనలతో కూడా ఖర్చు తగ్గే పరిస్థితి లేని పక్షంలో యూనిట్ కాస్ట్‌ను కొంత పెంచాలనే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గ్రామాల్లోనూ కాలనీలుగానే...
గ్రామాల్లో వ్యక్తిగత ఇళ్లు, అవి కూడా తమకు యోగ్యమైన చోట కట్టివ్వాలనే డిమాండ్ లబ్ధిదారుల నుంచి ఎక్కువగా ఉంది. ఇది ఖర్చు మరింత పెంచే అంశమయినందున.. అది సరికాదని గృహనిర్మాణ శాఖ తాజాగా జిల్లా కలెక్టర్లకు సూచించింది. గ్రామంలో కనీసం 20 ఇళ్లకు తగ్గకుండా ఓ కాలనీగానే నిర్మించాలని పేర్కొంది.