ఆలమూరులో ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్, ఎంపీ మాధవ్, ఎమ్మెల్యేలు ప్రకాష్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి
రాప్తాడు రూరల్ (అనంతపురం): ‘జగనన్న లేఅవుట్‌లో నిర్మిస్తున్న ఇళ్లు చాలా బాగున్నాయి. ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ వచ్చాం. సొంతింటి కల నెరవేర్చిన జగనన్న మేలును ఎప్పటికీ మరువలేం’ అని అనంతపురం మండలం ఆలమూరు సమీపంలోని జగనన్న హౌసింగ్ లే–అవుట్‌లో లబ్ధిదారులు తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఆలమూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్‌ను మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా గంగాదేవి అనే లబ్ధిదారు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకు రూ.3 వేల చొప్పున ఇంటి అద్దె చెల్లిస్తున్నామని తెలిపింది. తమకు సొంతిల్లు నిర్మిస్తుండటంతో త్వరలో అద్దె సమస్య తీరుపోతుందని పేర్కొంది. ఇల్లు బాగా కడుతున్నారని, తనకెంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. వరలక్ష్మి అనే మరో లబ్ధిదారు మాట్లాడుతూ ఆలమూరులో నెలకు రూ.2 వేలు చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపింది.
ఇక్కడ జగనన్న ఇల్లు కట్టిస్తుండటంతో తమ సొంతింటి కల నెరవేరుతోందని చెప్పింది. అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇచ్చి.. 21 లక్షల ఇళ్లను యజ్ఞంలా నిర్మిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించడం సిగ్గు చేటన్నారు.
Comments
Please login to add a commentAdd a comment