ఛతర్‌పూర్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి(17)ని దండించడమే ఆ హెడ్ మాస్టర్ పాలిట శాపమైంది. పగబట్టిన విద్యార్థి బాత్‌రూంలోకి వెళ్తున్న హెడ్ మాస్టర్‌ను వెంబడించి వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపాడు. హెడ్ మాస్టర్ ద్విచక్ర వాహనంపై పరారైన అతడిని పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ధమోరా ప్రభుత్వ హయ్యార్ సెకండరీ స్కూల్‌లో చోటుచేసుకుంది.
ధిలాపూర్ గ్రామంలోని ధమోరా స్కూల్‌లో చదువుకునే ఓ విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు వస్తుంటాడు. శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా(55) నిందితుడిని, మరో విద్యార్థిని కొట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని బాత్ రూంకి వెళ్తుండగా సక్సేనాను నిందితుడు అనుసరించాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని సక్సేనా తలకు గురిపెట్టి కాల్చాడు.
అనంతరం ప్రధానోపాధ్యాయుడు సక్సేనాకు చెందిన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. తుపాకీ శబ్దం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కి పడ్డారు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా సక్సేనా రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యూపీ సరిహద్దులకు సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు వాడిన తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు తరచూ స్కూలుకు ఆలస్యంగా వస్తుంటాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయుల మాటలను లక్ష్య పెట్టే వాడు కాదని దర్యాప్తులో తేలింది. ‘అతనొక్కడే కాల్పులు జరిపాడు. అతడొక్కడే నిందితుడనేది స్పష్టమైంది. మరో విద్యార్థి అఘాయిత్యాన్ని ఆపేందుకు మాత్రమే బాత్రూం వద్దకు వచ్చాడు. అనంతరం అతడు ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అతడు భయంతో ఎటో వెళ్లిపోయాడు. నిందితుడిచ్చిన సమాచారం మేరకు తుపాకీ సమకూర్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం’అని ఎస్‌పీ ఆగమ్ జైన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment