బెంగళూరు: కర్ణాటకలోని గడక్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చితకబాది.. పాఠశాల భవనం మొదటి అంతస్తులోని బాల్కనీలోంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలైన ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హగ్లీ గ్రామంలోని ఆదర్శ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది.
కుటుంబ గొడవలే కారణం..
ఆదర్శ్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు భరత్ అనే విద్యార్థి. అదే పాఠశాలలో పని చేస్తున్న ముత్తప్ప అనే ఉపాధ్యాయుడు.. భరత్‌ను చితకబాది బాల్కనీలోంచి బయటకు తోసేశాడని గడక్ జిల్లా సీనియర్ పోలీసు అధికారి శివప్రకాశ్ దేవరాజ్ తెలిపారు. ఈ దారుణం వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. బాధితుడు భరత్ తల్లి, అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న గీతా బార్కర్‌ను సైతం ముత్తప్ప తీవ్రంగా కొట్టినట్లు చెప్పారు. ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా చేస్తున్న నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: పాతబస్తీలో దారుణం.. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడి హత్య
Comments
Please login to add a commentAdd a comment