అడుగంటిన తాగునీటి చెరువులు
వర్షాలు కురిసినా ఉపయోగం లేదు
కాలువలకు నీటి విడుదల ఎప్పుడో.!
మచిలీపట్నం : పాలకుల నిర్లక్ష్యం జిల్లా ప్రజల పాలిట శాపంగా మారింది. వర్షాకాలంలోనూ తీర ప్రాంతంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. జూలై వచ్చినా కాలువలకు తాగునీరు విడుదల చేయలేదు. ఎప్పటికి విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాలు సమృద్ధిగానే కురిసినా, ఆ వాన నీటిని చెరువులకు మళ్లించే చర్యలు చేపట్టలేదు. దీంతో తీర ప్రాంతంలోని తాగునీటి చెరువులు అడుగంటి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గుక్కెడు నీరు ఇవ్వండి మహాప్రభో అని ప్రజలు గొంతెత్తి అరుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కాలువలకు తాగునీటి ఎప్పటికి విడుదల చేస్తారో, ఎప్పటికి చెరువులను నింపుతారనేది తెలియని పరిస్థితి నెలకొంది.
అడుగంటిన చెరువులు
సముద్రతీరం వెంబడి ఉన్న నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు, పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దున ఉన్న కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లోని తాగునీటి చెరువులు పూర్తిగా అడుగంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొద్దిపాటి నీరు చెరువుల్లోకి చేరినా అవి పంపింగ్‌కు సరిపడా లేని పరిస్థితి నెలకొంది. మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాలతో పాటు బందరు, గూడూరు మండలాలకు తాగునీటిని సరఫరా చేసే తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు పూర్తిస్థాయిలో అడుగంటింది. 5.9 మీటర్ల నీటి సామర్ధ్యం ఉన్న ఈ ట్యాంకులో ప్రస్తుతం 1.20 మీటర్ల నీరు మాత్రమే ఉంది. రెండున్నర మీటర్లకు ఈ ట్యాంకరులో నీటి మట్టం చేరితే డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు. ప్రస్తుతం 1.20 మీటర్ల మేర ఉన్న నీరు పచ్చగా మారి తాగడానికి పనికిరాని పరిస్థితి నెలకొంది. పంపింగ్, లేదా ఆవిరి అవడం ద్వారా రోజుకు నాలుగు పాయింట్లు చొప్పున చెరువులోని నీరు ఖర్చవుతుందని సిబ్బంది చెబుతున్నారు. 20 ఏళ్లలో ఇంతగా చెరువులో నీటిమట్టం పడిపోయినా దాఖలాలు ఈ ఏడాదే చూశామని సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్యాంకులో ఉన్న నీరు పది, పదిహేను రోజులకు మించి రాదని అది కూడా మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తేనే ఈ లెక్క సరిపోతుందని మునిసిపల్ అధికారులు తెలిపారు. నాగాయలంక మండలం ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే చెరువు పూర్తిస్థాయిలో అడుగంటింది. నాగాయలంక, కోడూరు మండలాల్లోని పది పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేసే కమ్మనమోలు మంచినీటి పథకం చెరువులో నీరు లేకపోవటంతో పడకేసింది.
ట్యాంకర్ల ద్వారా అరకొరగా ..
తీర ప్రాంతంలో వేసవి నుంచి తాగునీటి ఎద్దడి వెంటాడుతూనే ఉంది. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అరకొరగానే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కృత్తివెన్ను మండలంలోని మాట్లం, పల్లెపాలెం, గరిసపూడి, లక్ష్మీపురం పంచాయతీలకు రోజు విడిచి రోజు ట్యాంకరును పంపుతున్నారు. కుటుంబానికి రెండు బిందెలు చొప్పున మాత్రమే తాగునీటిని ఇస్తున్నారు. నాగాయలంక మండలం గుల్లలమోద, పెదకమ్మవారిపాలెం, దీనదయాళపురం గ్రామాలకు రోజు విడిచి రోజు ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి అవసరాలకు ఒకటి, రెండు బిందెలను వాడుకుని వంటకు స్థానికంగా లభించే ఉప్పునీటినే ఉపయోగించాల్సిన పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది. కోడూరు మండలం దింటిమెరక, పాలకాయతిప్ప, రామకృష్ణాపురం, ఇరాలి గ్రామాల్లోనూ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ఒక్క తాగునీటి పథకం పనిచేయటం లేదు. తాగునీటి చెరువులు ఎండిపోవటంతో ట్యాంకర్ల ద్వారా కుటుంబానికి ఇచ్చే రెండు, మూడు బిందెల నీటితోనే అక్కడి ప్రజలు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. కైకలూరులోనూ రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నా అవి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా పాలకులు తాగునీటి అవసరాల కోసం నీటిని కాలువలకు విడుదల చేయకపోవటం గమనార్హం.