ఏది వెలుగు?
జెన్ పథం
శిష్యులంతా కూడబలుక్కుని అసలైన సమాధానం ఏదో మీరే చెప్పండని గురువుగారిని అడిగారు.
ఒక గురువు శిష్యులకు పాఠం చెప్తున్నారు.
‘‘పుట్టుకకు సంబంధించి అన్ని ప్రాణులూ సమానమే. ఆకలి, దాహం, నిద్ర, మృత్యువు భయం వంటివి అన్ని ప్రాణులకూ సంబంధించినవే. దిగులు అనేది కూడా అందరికీ చెందినదే. ఇందులో ధనికులూ, పేదలూ అనే తేడా ఉండదు. రాత్రీ పగలూ ఆనందం, ఆవేదన, సుఖమూ, దుఃఖమూ అనేవి కూడా ఒక దాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఏవీ స్థిరంగా ఉండిపోవు. అలాగే జననం, మరణం కూడా. రాత్రి వస్తుంది. అది కొన్ని గంటలు ఉండి నెమ్మది నెమ్మదిగా చెదరిపోయి పగలు వస్తుంది. అయితే ఇంతకూ మనకు ఏ క్షణాన ఉదయం వచ్చిందో మీలో ఎవరైనా చెప్పగలరా?’’ అని గురువుగారు ప్రశ్నించారు.
ఒక శిష్యుడు లేచి నిల్చుని ‘‘గురువుగారూ, ఒక మృగం అల్లంత దూరాన ఉన్నప్పుడే అది గాడిదో, గుర్రమోనని గుర్తు పట్టినప్పుడు వెలుతురుతోపాటే ఉదయం వచ్చినట్టు అనుకోవాలి’’ అని ఎంతో వినయంగా చెప్పాడు.
కానీ గురువు గారు అతను చెప్పిన మాటలన్నీ విని అది సరైన సమాధానం కాదని అన్నారు.
ఇంతలో మరో శిష్యుడు లేచి నిల్చుని ‘‘గురువుగారూ, అల్లంత దూరంలో ఉన్న ఒక చెట్టుని అది మర్రిచెట్టో, చింతచెట్టో చెప్పగలిగినప్పుడు వెలుతురు వచ్చినట్టే అనుకోవాలి’’ అన్నాడు.
అది కూడా సరైన జవాబు కాదన్నారు గురువుగారు.
అప్పుడు మిగిలిన శిష్యులు ఒక్కటై తాము ఏది చెప్పినా సరికాదంటున్న గురువుగారినే సరైన సమాధానమేదో చెప్పమంటే సరిపోతుంది కదా అని కూడబలుక్కుని ఆ మాటనే గురువుగారితో అన్నారు.
గురువుగారు సరేనని ఇలా చెప్పారు-
‘‘ఏ పురుషుడు కనిపించినా అతను నా సోదరుడే అని, ఏ స్త్రీ కనిపించినా ఆమె నా సోదరి అని ఎప్పుడైతే మీరు భావిస్తారో అప్పుడే మీరు నిజమైన వెలుగును చూసినట్లు అనుకోవాలి. అప్పటిదాకా మిట్టమధ్యాహ్నపు ఎండ వెలుగైనా సరే నిశిరాత్రి చీకటే’’.
రాత్రీ పగలూ అనే వి కేవలం కాలంలో వచ్చే మార్పులే. వెలుగు అనేది అంతరంగంలో రావాలన్నది ఇక్కడి గురువుగారి భావం.
- యామిజాల జగదీశ్