Yamijala jagadish
-
వర్తమానమే... నిజం!
అరణ్యంలో ఉన్న ఓ జ్ఞాని దగ్గరకు వెళ్లిన ఒక యువకుడు తనకు నిజమంటే ఏమిటో చెప్పాలని కోరాడు. వెంటనే జ్ఞాని ‘నిజం సంగతి ఇప్పటికి పక్కనపెట్టు. నేనడిగిన దానికి జవాబు చెప్పు. మీ ఊళ్ళో బియ్యం ధర ఎంతో చెప్పు’ అన్నాడు. అందుకు యువకుడు వినమ్రంగా ‘స్వామీ! నన్ను మన్నించండి. మర్యాద మరచి మాట్లాడుతున్నానని అనుకోకండి. ఇటువంటి ప్రశ్నలు ఇక మీదట నన్ను అడక్కండి. ఎందుకంటే నేను గతకాలపు దారులు మరచిపోయాను. గతానికి సంబంధించినంత వరకు నేను ఇప్పుడు మరణించాను. ఇదిగో ఇప్పుడు నడిచొ చ్చిన మార్గాన్ని కూడా నేను మరచిపోయాను’ అన్నాడు. ‘నువ్వు గత కాలపు భారాన్ని ఇంకా మోస్తున్నావా... లేదా అనేది తెలుసుకోవడానికే బియ్యం ధర ఎంతని అడిగాను. నువ్వు దానికి జవాబు చెప్పి ఉంటే వెంటనే నిన్ను ఇక్కడినుంచి పంపించేసేవాడిని. నిజం గురించి మాట్లాడటానికి తిరస్కరించే వాడిని’ అన్నాడు. ‘అయితే ఇపుడు చెప్పండి నిజమంటే ఏమిటో’ అని అడిగాడు యువకుడు.‘వర్తమానంలో బతకడం తెలీని మనిషిని ఓ తోటలోకి తీసుకు వెళ్ళి ఓ గులాబీ పువ్వుని అతనికి చూపించు. ఈ గులాబీ ఎంత అందమైనదో అని అతనితో అను. వెంటనే అతను దీని వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. సాయంత్రంలోపు వాడి రాలిపోతుంది అంటాడు. యవ్వనం ఎంతటి సుఖమైనదో చెప్పమని అడిగితే అది నిజమే కావచ్చు కానీ ముసలితనం త్వరగా వచ్చేస్తుందిగా అంటాడు. సంతోషం గురించి మాట్లాడితే అదంతా వట్టి మాయ అంటాడు. కానీ వర్తమానంలో బతకడం తెలిసిన వ్యక్తిని ఓ ఉద్యానంలోకి తీసుకు వెళ్తే అక్కడి రంగు రంగుల పువ్వులను చూపిస్తే వాటిని చూసి అతనెంతగా ఆనందిస్తాడో తెలుసా... ఎన్ని కబుర్లు చెప్తాడో తెలుసా! ఇవి చూడటానికి వచ్చిన దారులను గురించి ఆలోచించవలసిన అవసరమేముందంటాడు.రాలిపోయే పువ్వులైనా సరే ఇప్పుడు ఎంత ఆందంగా ఉన్నాయో అంటాడు. వికసించే పువ్వులు అందమైనవా... రాలిపోయే పువ్వులు అందమైనవా అని అడిగితే గతించిన కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానంలోని నిజాన్ని గ్రహించలేమంటాడు. అది నిజం. ఏది నిజమో అది ఈ క్షణంలో ఉంది. నిజమనేది గతించిన, రానున్న కాలాలకు సంబంధించినది కాదు. వర్తమానమే నిజమైన కాలం’ అని చెప్పాడు జ్ఞాని. యువకుడికి విషయం అర్థమైంది. ఆనందంగా వెనుతిరిగాడు. – యామిజాల జగదీశ్ -
అంతా.. అర్థం చేసుకోవడంలోనే..!
శ్రీ రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్పారు. అది ఇలా సాగుతుంది:‘‘ఊరి పొలి మేరలో ఓ ఆశ్రమంలో గురువు ఉండేవారు. ఆయనకు శిష్యులనేకమంది. ఒకరోజు వారందరినీ కూర్చో పెట్టి... ‘ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడి రూపాలే. దానిని మీరు అర్థం చేసుకుని నమస్కరించాలి’ అన్నారు. శిష్యులందరూ సరేనన్నారు.ఓరోజు ఓ శిష్యుడు గురువుగారు చెప్పిన పని మీద అడవిలోకి బయలు దేరాడు. ఇంతలో ‘ఎవరెక్కడున్నా సరే పారిపోండి... మదమెక్కిన ఏనుగొకటి వస్తోంది. దాని కంట పడకండి’ అని హెచ్చరిస్తూ ఒక వ్యక్తి పారిపోతున్నాడు. ఈ హెచ్చరికతో అక్కడక్కడా ఉన్నవారు పారిపోయారు. కొందరు చెట్టెక్కి కూర్చున్నారు. కానీ ఈ గురువుగారి శిష్యుడున్నాడు చూశారూ, అతను తన ధోరణిలోనే నడుస్తున్నాడు. పైగా ‘నేనెందుకు పరుగెత్తాలి... నేనూ దేవుడు, ఆ ఏనుగూ దేవుడే! ఇద్దరం ఒక్కటే... ఏనుగు నన్నేం చేస్తుంద’నుకుని దారి మధ్యలో నిల్చుండిపోయాడు. ఏనుగు సమీపిస్తోంది.కానీ అతను ఉన్న చోటనే నిల్చున్నాడు. చేతులు రెండూ పైకెత్తి నమస్కరించాడు. పైగా దైవప్రార్థన చేశాడు. ఇంతలో ఏనుగుమీదున్న మావటివాడు కూడా అతనిని పక్కకు తప్పుకోమని హెచ్చరించాడు. కానీ శిష్యుడు ఆ హెచ్చరికను ఖాతరు చేయలేదు. అతను కావాలంటే ఏనుగుని దేవుడిగా భావించవచ్చు. కానీ ప్రతిగా ఏనుగు అలా అనుకోదుగా! అతను చేతులు రెండూ పైకెత్తి నిల్చోడంతో ఏనుగు పని మరింత సులువైంది. అది అతనిని ఒక చుట్ట చుట్టి కింద పడేసి ముందుకు వెళ్ళిపోయింది. అతనికి గాయాలయ్యాయి.విషయం తెలిసి ఆశ్రమానికి చెందినవారు అక్కడికి చేరుకుని కింద పడి ఉన్న అతనిని అతికష్టం మీద గురువుగారి వద్దకు తీసుకుపోయారు. అతను జరిగినదంతా చెప్పాడు. అప్పుడు గురువుగారు ‘నువ్వనుకున్నది నిజమే, కానీ మావటివాడు కూడా దేవుడే కదా! అతను నిన్ను హెచ్చరించాడుగా తప్పు కోమని! ఆ మాటైనా పట్టించుకోవాలి కదా’ అని చెప్పగా శిష్యుడు అయోమయంగా చూశాడు. ‘వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోక పోవడం వల్ల వచ్చిన ప్రమాదమిది’ అంటూ గురువుగారు కథ ముగించారు.’’ – యామిజాల జగదీశ్ -
ఆచరణ ముఖ్యం..!
ఒక రోజు బోధివనానికి వచ్చిన ఓ నడివయస్కుడు బోధిసత్త్వుని పాదపద్మాలను తాకి నమస్కరించాడు. చిరునవ్వుతో అతని వివరాలు అడిగాడాయన. ‘దేవా నా పేరు అభినందనుడు. నేను పేదవాడిని. నాకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. లౌకిక పాశాల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్నాను. మీరేదైనా పరిష్కారం చెప్పాలి. మీరే నాకు జ్ఞానమార్గం చూపాలి’ అని వేడుకున్నాడు ఆ వ్యక్తి.బోధిసత్త్వుడు ‘అభినందనా, ఈ చెట్లకున్న ఆకులను చూడు. అవన్నీ ఎందుకు కదులుతున్నాయో తెలుసా... గాలి వచ్చి ఢీకొనడంతో కదులుతున్నాయి. పాశమనే గాలి వచ్చి ఢీకొన్నప్పుడల్లా మనిషి ఆకులా ఇలా ఊగుతాడు. మొదట నీ మనసులో ఉన్న లౌకిక పాశాలను తెంచుకో. అప్పుడే నీవు జ్ఞానమార్గంలో నడవగలవు. అది నీ వల్ల సాధ్యమేనా? అన్నాడు. సాధ్యమే అన్నాడు అభినందనుడు. అయితే ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండన్నాడు బోధిసత్త్వుడు.అభినందనుడు అక్కడే ఉండిపోయాడు. కొద్ది రోజులు సన్యాసి జీవితం చక్కగానే గడిపాడు. క్రమంగా అతడు మళ్లీ లౌకిక బంధనాల్లోకి జారుకోవడాన్ని బోధిసత్త్వుడు గమనించాడు.ఒక రోజు అభినందనుని పిలిచి రెండు పాత్రలు తీసుకున్నాడు. ఓ పాత్రలో రకరకాల పదార్థాలు ఉన్నాయి. మరొకటి ఖాళీ పాత్ర. పదార్థాలు ఉన్న పాత్రను నీటిలో వదిలేశాడు. అది లోపలికి మునిగిపోయింది. ఖాళీ పాత్రను నీటిలో వేశాడు. అది తేలియాడుతూ కనిపించింది. ‘బరువైన పాత్ర కనిపించకుండా పోయింది. ఖాళీ పాత్ర తేలుతోంది. ఖాళీ పాత్ర ఉంది చూశావూ, అది జ్ఞానపాత్ర. బరువైన పాత్ర ఉంది చూశావూ, అది బంధనాల పాత్ర.నేను సన్యాసినవుతాననీ, జ్ఞానినవుతాననీ చెప్పడం సులభం. కానీ ఆచరణ కొచ్చేటప్పటికి అది చాలా కష్టం. అది అంత సులభమైన విషయం కాదు. ఆశనూ, లౌకిక పాశాలనూ వదులుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేంటో నీకు అర్థమై ఉండాలి’ అన్నాడు బోధిసత్త్వుడు. అప్పటి నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచాడు అభినందనుడు. – యామిజాల జగదీశ్ -
బ్రహ్మజ్ఞానం అంటే...
ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు బ్రహ్మజ్ఞానం తెలియాలని ఆశపడ్డారు. వారిద్దరినీ ఓ మంచి గురువు వద్దకు పంపారు. ఇద్దరూ గురుకులవాసం పూర్తి చేసుకుని ఇంటికొచ్చారు. తండ్రి తన పెద్దకొడుకుని చూసి ‘బ్రహ్మజ్ఞానం గురించి ఏం నేర్చుకున్నావు’ అని అడిగాడు. వెంటనే ఆ కొడుకు వివిధ అంశాల గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. వేదాల నుంచీ, శాస్త్రాల నుంచీ ఉదాహరణలు చెబుతున్నాడు. అతడి మాటలకు అడ్డు తగులుతూ ‘సరే ఆపు’ అని తండ్రి అన్నాడు.ఈసారి బ్రహ్మజ్ఞానం గురించి నువ్వేం నేర్చుకున్నావని చిన్న కొడుకుని అడిగాడు తండ్రి. అతను నోరెత్తలేదు. తల వంచుకుని నిల్చున్నాడు. తండ్రి అతని వంక చూశాడు. నీ వాలకం చూస్తుంటే నీకే బ్రహ్మజ్ఞానం గురించి అంతో ఇంతో తెలిసినట్లుందన్నాడు. ‘బ్రహ్మం గురించి పూర్తిగా తమకు తెలుసని పలువురు అనుకుంటూ ఉంటారు. అది ఎలాంటిదంటే బ్రహ్మాండమైన చక్కెర కొండ నుంచి ఒక్క రవ్వ చక్కెరను తీసుకుని పోతున్న చీమ మరోసారి వచ్చినప్పుడు ఈ మొత్తం కొండను తీసుకుపోతానని చెప్పడం లాంటి’దని రామకృష్ణపరమహంస చెప్పారు.బ్రహ్మం అనేది మన ఆలోచనలకు, మాటలకు అతీతమైనది. గొప్ప గొప్ప మహాత్ములను కూడా ఈ విషయంలో పెద్ద చీమలని చెప్పవచ్చు. వారందరూ ఓ ఏడెనిమిది చక్కెర రవ్వలను తీసుకుపోయి ఉంటారు. అంతే. బ్రహ్మం అనే మహాసముద్ర తీరాన నిల్చుని కాళ్ళు తడుపుకోవడం లాంటిదే వారు బ్రహ్మజ్ఞానం తమకు తెలుసునని చెప్పడం. నిజానికి వారందులో మునగలేదు. మునిగి ఉంటే వారు తిరిగివచ్చి ఉండరు.‘అనగనగా ఓ ఉప్పు బొమ్మ ఉండేది. సముద్రం లోతెంత అని తెలుసుకోవడంకోసం అందులోకి దూకాలన్నది దాని ఆశ. అలాంటి ఆశ పుట్టినప్పుడు అది ఉత్తినే ఉండగలదా! సరే, సముద్రం లోతెంత చూసేద్దామని నిర్ణయించుకుంది. వెంటనే అది సముద్రంలో దూకేసింది. కొంచెం దూరం వెళ్ళిందో లేదో... అంతే సంగతులు. ఉప్పుబొమ్మ సముద్రంలో దూకితే ఏమవుతుంది... కొంచెం కొంచెంగా కరగనారంభించింది. కాస్సేపటికే బొమ్మ మొత్తం కరిగిపోయింది.అది ఇంకేం కనిపెట్టగలదు సముద్రం లోతుని! అలాగే బ్రహ్మజ్ఞానం తనకొచ్చేసింది అనుకున్న మనిషి మౌనంగా ఉంటాడు. అది వచ్చేంతవరకూ మట్లాడుతూనే ఉంటాడు. తేనె తాగడం కోసం ఓ భ్రమరం తోటలోకి వెళ్ళింది. అది పువ్వు మీద వాలే వరకే ఝుమ్మని శబ్దం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పువ్వు మీద వాలిందో ఆ క్షణంలోనే అది మౌనమైపోతుంది. అలాటిదే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడ’మని పరమహంస అంటారు. – యామిజాల జగదీశ్ఇవి చదవండి: June11: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ -
మీ దగ్గర శిష్యుడిగా ఉండటానికొచ్చాను
ఆయన ఓ గొప్ప సాధువు. ఆయనకంటూ ఓ ఆశ్రమం. ఆయన వద్ద ఎందరో శిష్యులున్నారు. ఓరోజు ఓ వ్యాపారి వచ్చాడు. అతను ధనవంతుడు. సాధువుకు నమస్కరించి ‘నేను మీ దగ్గర శిష్యుడిగా ఉండటానికొచ్చాను‘ అన్నాడు. సాధువు అతని వంక చూసి ‘నిన్ను చూస్తుంటే విలాసవంతుడిలా ఉన్నావు. మా ఆశ్రమం లో ఆడంబరాలకు తావు లేదు. చాలా సామాన్యమైనది. మా జీవన పద్ధతులు నీకు సరిపోతాయనిపించడం లేదు. అన్నింటినీ త్యజించి ఓ నిరాడంబర సాధువులాబతగ్గలవా అని అనిపిస్తోంది. నీవల్ల కాదేమో అని నా ప్రశ్న. నిజంగానే నువ్వు అన్నింటినీ వదులుకోగలవా?’ అడిగారు. ‘తప్పకుండా స్వామీ’ చెప్పాడు ధనవంతుడు. ‘నేనీ క్షణమే పట్టు వస్త్రాలు తీసేసి మామూలు నూలు వస్త్రాలు ధరిస్తాను. మామూలు భోజనం చేస్తాను. నా ధనమంతా ధర్మ కార్యాలకు రాసేస్తాను. మీరెలా చెప్తే అలాగే బతుకుతాను. నాకు జ్ఞానం మాత్రం లభిస్తే చాలు’ అన్నాడు ధనవంతుడు. అప్పటికీ సాధువుకి అతని మాటలు తృప్తి కలిగించలేదు. ‘సరేగానీ, నేను నిన్ను కొన్ని రోజులు పరిశీలిస్తాను. ఆ తర్వాత ఓ నిర్ణయానికొస్తాను‘ చెప్పాడు సాధువు. ఆరోజు నుంచి ఆ ధనవంతుడు సాధువు ఆశ్రమంలోనే ఉంటూ వచ్చాడు. సాధువుకి మాట ఇచ్చినట్లే చాలా నిరాడంబరమైన జీవితాన్నే గడుపుతూ వచ్చాడు. సాధువు అనుకున్న పదిహేనురోజులు ముగిశాయి. ఓరోజు పొద్దున్నే సాధువు అతనిని పిలిచి ‘నీకు ఈ ఆశ్రమ జీవితం సరిపోదు. నువ్విక ఇంటికి వెళ్ళిపోవచ్చు‘ అన్నాడు. ‘ఏమిటి స్వామీ అలా అంటున్నారు? నేను మీకోసం డబ్బుని వదులుకున్నాను. ఆస్తిపాస్తులు వదులుకున్నాను. సకల వసతులూ వదులుకున్నాను. ఇవేవీ సరిపోవా?‘ అడిగాడు ధనవంతుడు. సాధువు ఓ నవ్వు నవ్వారు. ‘నేను వేరుని నరకమన్నాను. నువ్వు కొన్ని కొమ్మలను మాత్రమే నరికావు. ఆ నరికేసిన కొమ్మల గురించి గొప్పలు చెప్తున్నావు. పైగా నాకోసం వదిలేశాను... నాకోసం వదిలేశాను అంటున్నావు... ఇది సరికాదు. నువ్వు దయ చేయొచ్చు. నీలో ఇంకా నేనూ నాకోసం వంటి ఆలోచనలున్నాయి. అవి నిన్నొదలవు‘ అన్నారు సాధువు. – యామిజాల జగదీశ్ -
ఒక్కరూ తీయలేదు
రాజ్యం ప్రధాన వీధిలోనే అంత పెద్ద బండరాయి ఉండడం రాజు దృష్టికి రాకపోవడం విచిత్రంగా ఉందని, ఏం పాలన చేస్తున్నాడో ఏమిటో అని ప్రజలు కోపావేశాలు వ్యక్తం చేసుకుంటూ పోతున్నారు. అనగనగా ఓ రాజు. ఆయనకి ఓ రోజు ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే తన రాజ్యంలోని ఓ ప్రధాన వీధి మధ్యలో ఓ పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టడం. అప్పుడు దాన్ని ఎవరైనా పక్కకు జరుపుతారా? లేక పక్కకు తప్పుకుపోతారా? ఈ పరీక్ష వల్ల జనం నాడి పట్టుకోవచ్చన్నది రాజు ఆలోచన. ఓ భటుడితో ఓ రోజు అర్ధరాత్రి తాననుకున్న వీధి మధ్యలో ఓ పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టించాడు. ఓ భటుడిని ఆ దారిన చాటుగా ఉండి వచ్చీపోయే వారందరూ ఆ బండరాయిని చూసి ఏమనుకుంటున్నారో విని తనకు చెప్పాలన్నాడు. తెల్లవారింది. ఆ దారిన వచ్చీ పోయే వారందరికీ ఆ బండరాయి పెద్ద అడ్డంకిగానే ఉంది. చాలా మంది ఆ రాతికి పక్కనుంచో లేక మరొక దారిలోనో పోతున్నారే తప్ప దాన్ని తప్పించాలనే ఆలోచనలో ఎవరూ లేరు. ఎక్కువ శాతం మంది రాజు పాలనా తీరును నిందించినవారే. రాజ్యం ప్రధాన వీధిలోనే ఇంత పెద్ద బండరాయి ఉండడం రాజు దృష్టికి రాకపోవడం విచిత్రంగా ఉందని, ఏం పాలన చేస్తున్నాడో ఏమిటో అని కోపావేశాలు వ్యక్తం చేసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ ఆ భటుడి చెవిన పడుతూనే ఉన్నాయి. రాజుకి కూడా ఎప్పటికప్పుడు ఈ విమర్శలను చేరవేస్తున్నాడు భటుడు. ఓ రెండు మూడు గంటలు గడిచాయి. ఇంతలో ఓ కార్మికుడు నెత్తిమీద ఓ పెద్ద బస్తానిండా కాయగూరలు పెట్టుకుని మెల్లగా రొప్పుతూ నడుస్తూ వస్తున్నాడు. అతను వీధి మధ్యలో ఉన్న బండరాయిని చూశాడు. తన నెత్తిమీదున్న మూటను కిందకు దింపాడు. మరెవరి సహాయమూ కోరకుండా తానొక్కడే ఆ బండరాయిని రోడ్డు పక్కగా దొర్లించాడు. అలా దొర్లించిన క్రమంలో అతనికి దాని కింద ఉన్న ఓ సంచి కనిపించింది! దానికున్న ముడి విప్పి చూశాడు. అందులో బంగారు నాణాలు కనిపించాయి! రోడ్డు పక్కనున్న చెట్టుకింద కాసేపు కూర్చుని ఆయాసం తీర్చుకున్న ఆ తర్వాత తన కూరగాయల మూట నెత్తిన పెట్టుకుని ముందుకు నడిచాడు. తిన్నగా రాజుగారి కోటకు వెళ్లాడు. అక్కడున్న భటుడికి తనకు దొరికిన బంగారు నాణాల సంచీ విషయం చెప్పాడు. భటుడు అతనిని రాజు గారి దగ్గరకు తీసుకుపోయాడు. రాజుకి నమస్కరించిన ఆ కార్మికుడు జరిగినదంతా వివరించి, బంగారు నాణాలున్న సంచిని ఇచ్చిపోదామని వచ్చానని చెప్పాడు. రాజు విషయమంతా విని.. ‘‘సెభాష్.. నువ్వు తప్ప మిగతావాళ్లంతా.. ఆ బండరాయిని పక్కకు దొర్లించాలనే ఆలోచనే లేకుండా నన్ను తిట్టుకుంటూ పోయారు. కానీ నువ్వు మాత్రమే ఒంటరిగా కష్టపడి ఆ బండరాయిని పక్కకు జరిపి ఆ దారిలో ఏ సమస్యా తలెత్తకుండా చేశావు. కనుక నీకే ఆ బంగారు నాణాలు’’ అంటూ అతనికి కానుక ఇచ్చి సత్కరించాడు. – యామిజాల జగదీశ్ -
నేటి ముళ్ళబాటే రేపటి పూలబాట కాదా?
మునీశ్వరులకు ఎన్నో మాయలూ మంత్రాలూ తెలుసుననే ఉద్దేశంతోనూ నమ్మకంతోనూ ఓ యువకుడు ఒకరి దగ్గరకు వెళ్ళాడు. మునిని చూడడంతోనే ఆయనకు నమస్కరించి ‘‘స్వామీ’’ అంటూ మాటలు సాగించాడు. తాను పోయే దారంతా ఎప్పుడూ వెలుగుతో నిండి ఉండేలా వరం ప్రసాందించాలని కోరాడు. ముని తన మాటలు విని మాయతో వీధి దీపాల్లాంటిది ఇచ్చి తాను చీకట్లో వెళ్ళేటప్పుడల్లా ఉపయోగపడేలా చేస్తాడని అనుకున్నాడు యువకుడు. కానీ అతననుకున్నది వేరు. మునీశ్వరుడు ఇచ్చింది వేరు. మునీశ్వరుడు ఓ లాంతరు ఇచ్చి దీన్ని పుచ్చుకో అన్నాడు. మునీశ్వరుడు తనకున్న శక్తియుక్తులతో అద్భుతమైన ఓ దీపాన్ని ఇస్తాడనుకుంటే ఓ మామూలు లాంతరు ఇవ్వడమేమిటని ఆ యువకుడిలో నిరాశ కలిగింది. దాంతో మనసులోని మాటను చెప్పాడు... ‘‘స్వామీ, మీరు మాయతో కూడిన ఓ విచిత్రమైన దీపాన్ని ఇస్తారనుకున్నాను. కానీ ఓ లాంతరు ఇచ్చారు, ఇది ఓ పది అడుగుల దూరం మించి వెలుగు చూపదు కదండీ’’ అన్నాడు. అప్పుడు మునీశ్వరుడు ‘‘అలాగనుకుంటున్నావా... నేను తలచుకుంటే నాకున్న మాయాశక్తితో నువ్వు వెళ్ళే దారంతా వెలుగు నిండేలా చేయగలను. కానీ అది లాభం లేని పని. అయినా నీ కళ్ళు కూడా దాదాపు పది అడుగుల మేరకే చూడగలదు. కనుక ఆ మేరకు నీకు వెలుగుంటే చాలుగా. ఈ లెక్కన నువ్వు పోయే కొద్దీ తెల్లవారేసరికి అడవి మార్గాన్ని దాటి పొరుగున ఉన్న పల్లెకు చేరుకోగలవు. ఆ ఉద్దేశంతోనే నీకు లాంతరు ఇచ్చాను. కనుక ఏ సమస్యా లేకుండా నువ్వనుకున్న గమ్యస్థానానికి చేరుకోగలవు’’ అని అన్నాడు. ఓ విధంగా ఇది నిజమేగా... మనలో చాలా మంది ఆ యువకుడిలాంటివారే. ఎంతసేపూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోరు. మన ముందరున్న కాలం ఏమిటో తెలుసుకోరు. ఉన్న కాలం గురించి ఆలోచించరు. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. అందుకే అనుభవజ్ఞులనే మాట ఇదే... ఈరోజు ఈ క్షణంలో చెయ్యవలసిన దానిని ఆచితూచి చెయ్యడంలో చైతన్యవంతులై ఉండాలి. – యామిజాల జగదీశ్ -
అప్పుడిచ్చిందే ధర్మం
‘‘ఏదీ ఆ సంచీ ఇటివ్వు, అందులో అయిదు వందల దీనారులు ఉండాలి.. నువ్వేమన్నా తీసుకున్నావా?’’ అని అన్నాడు ధనవంతుడు ఆత్రుతతో. అదొక మసీదు. అక్కడ వాకిట్లో ఓ యాచకుడు కూర్చున్నాడు. ధర్మం చెయ్యండి బాబూ అంటూ యాచిస్తున్నాడు. అటువైపుగా కొందరు ధనవంతులు వచ్చారు. వారిని చూసీ చూడడంతోనే యాచకుడు చేతిలోని భిక్షపాత్రను చాచి.. ‘ధర్మం బాబయ్యా’ అని అడిగాడు. కానీ వారిలో ఒక్కరూ చిల్లిగవ్వ కూడా ఆ పాత్రలో వెయ్యలేదు. అలా వెళ్లిపోయిన వారిలో ఓ ధనవంతుడి దగ్గరున్న ఓ డబ్బు సంచీ కింద జారిపడిపోయింది. ఆ విషయం అతనికి తెలియలేదు. కానీ ఆ డబ్బు సంచీని యాచకుడు చూశాడు. దాన్ని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు. మసీదు లోపలికి వెళ్లిన కాస్సేపటికి డబ్బు సంచీ పోగొట్టుకున్న వ్యక్తి రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘ఇక్కడెక్కడైనా నా సంచీ పడిపోయుంటే చూసేవా?’’ అని అడిగాడు ఆ ధనవంతుడు. చూశానని, ‘మీరొస్తే మీకివ్వాలనే నా పక్కనే పెట్టుకున్నాను’ అనీ చెప్పాడు యాచకుడు. ధనవంతుడు ఆత్రుతతో ‘‘ఏదీ ఆ సంచీ ఇటివ్వు, అందులో అయిదు వందల దీనార్లు ఉండాలి.. నువ్వేమన్నా తీసుకున్నావా?’’ అని అన్నాడు. ‘‘నేనసలు ఆ సంచీ లోపల ఏం ఉందో కూడా చూడలేదండీ, మీరు లెక్కపెట్టుకోండి’’ అన్నాడు యాచకుడు. ధనవంతుడు లెక్కపెట్టి చూసుకుంటే అతను చెప్పిన అయిదు వందల దీనార్లు అలాగే ఉన్నాయి. దాంతో అతని ముఖాన అప్పటి వరకూ ఉన్న కంగారు, దాంతో పుట్టిన పట్టిన చెమటా మటుమాయమైంది. సంతోషం ఉప్పొంగింది. ఆ పట్టరాని ఆనందంతోనే అతను అందులోంచి పదిహేను దీనార్లు లెక్కపెట్టి ఇదిగో ఇది నా కానుక అంటూ యాచకుడికి ఇచ్చాడు. కానీ యాచకుడు తనకక్కరలేదని సున్నితంగా తిరస్కరించాడు. అంతేకాదు, ఇలా అన్నాడు.. ‘‘మీరు కానుకగా ఇచ్చే సొమ్ము నాకక్కరలేదు. నేను మొదట మిమ్మల్ని ధర్మం చెయ్యండి బాబూ అని ధర్మం అడిగాను. అప్పుడే ఇచ్చి ఉంటే మహదానందంగా తీసుకునేవాడిని అన్నాడు యాచకుడు. ధనవంతుడు మౌనంగా వెళ్లిపోయాడు. – యామిజాల జగదీశ్ -
చూడవచ్చు నెలవంకను
సముద్రమట్టానికి ముప్పై అయిదు వేల అడుగుల ఎత్తున విమానం పోతోంది. ప్రయాణికులకు స్నాక్స్, బిస్కెట్లు, పండ్లరసాలు వంటివి సరఫరా చేస్తున్నారు. మరికాసేపట్లో రాత్రి ఆహారం కూడా సరఫరా చేసే సమయం దగ్గరపడుతోంది. అప్పుడు ఉన్నట్టుండి పైలట్ కూర్చున్న సీటుకి దగ్గర్లో ఏదో శబ్దం వినవచ్చింది. వెంటనే వైమానిక సిబ్బంది అక్కడికి పరుగున చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నవారెవరూ మళ్లీ వెనుకకు రాలేదు. కాసేపటికి స్పీకర్ గుండా గరగరమని చప్పుడు వినిపించింది. ఆ తర్వాత.. ‘ప్రయాణికుల దృష్టికి ఒక ముఖ్య విషయం. మనం ఉన్న విమానంలోని ఇంజన్లలో ఒకటి దెబ్బతింది. అది బాగుచేస్తున్నాం. ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదు. అంతా సవ్యంగానే జరిగి విమానం సాఫీగానే ముందుకు సాగుతుంది’’ అని వినిపించింది. ఈ మాటలు వినడంతోనే ప్రయాణికులలో అలజడి మొదలైంది. ఎవరికి వారు తమ ఇష్టదైవానికి దణ్ణం పెట్టుకుంటున్నారు. కొందరు తమ బంధువులకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కొంచెంసేపు అయింది. పైలట్ మళ్లీ ఓ ప్రకటన చేశారు. ప్రయాణికులారా, ఇందాక చెప్పిన ఇంజన్ని బాగు చేయడం కుదరడం లేదు. ఇలాగే కొనసాగితే కాస్సేపటికి విమానం మా పరిధి దాటిపోవచ్చు. కనుక ముందుజాగ్రత్తగా దగ్గర్లోని ఓ విమానాశ్రయానికి తెలియజేశాం. అక్కడి సిబ్బంది మన సహాయానికి వస్తారు. ఎవరూ కంగారుపడకండి అని! మొదటి ప్రకటనతోనే కంగారు పడుతున్న ప్రయాణికులు ఈ ప్రకటనతో మరింత అయోమయంలో పడ్డారు. ప్రయాణికులు తమకు తోచిన రీతిలో ప్రార్థనలు చేస్తున్నారు. కొందరైతే అరుస్తున్నారు. కిటికీ అద్దంలోంచి కిందకు చూస్తున్నారు. కింద సముద్రం గానీ లేదు కదా అని. విమానంలో ఇలా అందరూ కంగారుపడుతుంటే ఒక్కరు మాత్రం ఏదీ పట్టనట్లు నిదానంగా తనకిచ్చిన స్నాక్స్ ప్యాకెట్టుని తెరచి అందులోంచి ఒక్కో ముక్కా తీసి నోట్లో వేసుకుంటున్నారు.ఆయన మరెవరో కాదు, ఓ జెన్ మాస్టరు. ఏ స్థితినైనా.. అంటే అది మంచైనా చెడైనా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించక తప్పదన్నది ఆ జెన్ మాస్టరు మాట. అదే మాట తనకు అటూ ఇటూ ఉన్నవారికి చెప్పాడు. ఈ తత్వాన్ని చెప్పే కవిత ఒకటుంది. ‘‘పాక తగలబడింది ఇక చూడచ్చు నెలవంకను....’’ అని. కాసేపటికి ఆ విమానం.. దగ్గర్లో ఉన్న ఓ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండైంది. అక్కడి సాంకేతిక సిబ్బంది చెడిపోయిన ఇంజన్ని బాగు చేశారు. మళ్లీ అక్కడి నుంచి విమానం తన గమ్యంకేసి ప్రయాణమైంది. ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. – యామిజాల జగదీశ్ -
విలువైన వజ్రాన్ని చినిగిన బట్టలో కట్టి దాస్తారా..?
సూఫీ జ్ఞాని జలాలుద్దీన్ రూమీని ఒకరడిగారు... ‘‘ఫలానా మతగ్రంథం చదవడం మంచిదేనా’’ని. ఈ ప్రశ్నకు రూమీ ‘దానిని చదవడం వల్ల మంచి మార్గంలో నడిచే స్థితిలో నువ్వున్నావా అనేది ముందుగా తెలుసుకోవాలి’’ అని అన్నారు. ఆ మాటకొస్తే ఏ పుస్తకంలోనైనా మంచి విషయాలుండొచ్చు. కానీ ఏం లాభం... ఆ మంచిని ఉపయోగించుకోవడంలో మంచితనం ఉంటుంది. లేకుంటే ఎన్ని పుస్తకాలు చదివినా ఏం లాభం... చెవులేవీ పనిచేయనప్పుడు అతనికి మధురమైన సంగీతమైనా ఒకటే. రణగొణధ్వనైనా ఒకటే. కంటి చూపులేని వ్యక్తికి రవివర్మ పెయింటింగ్ చూపించినా, పికాసోది చూపించినా ఒకటే. భావం, చిత్రం ఎంత గొప్పవైనా ఉన్నతమైనదైనా అంతకన్నా ముఖ్యం. వాటిని చదివి చూసి ఆస్వాదించే మనసు లేకుంటే నిష్పయ్రోజనమే. ఉదాహరణకు ఓ కుక్క ఓ కొబ్బరిబొండాం నోట కరచుకుని పరిగెత్తుతుండొచ్చు. ఆ బొండాకు కన్నం చేస్తేనే, అందులోని నీరు తాగగలం. కానీ దానిని బద్దలు కొట్టే శక్తికి కుక్కకు లేదు. అప్పుడది ఎంత దూరం దాంతో పరుగెత్తినా లాభమేంటి? ఆత్మజ్ఞానంలో అంతరంగం అనేదే ముఖ్యం. విలువైన వజ్రాన్ని ఎవరైనా ఓ చినిగిన బట్టలో కట్టి దాస్తారా... మనసుకి పరిపక్వత లేనప్పుడు జ్ఞానాన్వేషణకోసం ఎన్ని ప్రదేశాలు, ఎన్ని ఆలయాలు సందర్శించినా ఫలితముండదు. తన లోపల సమస్యలుంచుకొని వాటిని కాదని ఎక్కడ తిరిగితే ఏం లాభం. కనుక మనసుకి స్వీకరించే శక్తి ఉంటేనే ఏదైనా ఫలితం ఉంటుంది. ఈ స్థితికి చేరాలంటే మనలో ఎంతో కొంత చైతన్యమనేది ఉండాలి. పువ్వు వికసించినప్పుడేగా అందులోని మకరందం వినియోగానికి వస్తుంది. అంతేకాదు, దానిపై సీతాకోకచిలుకో తుమ్మెదో వాలుతుంది. తన దాహం తీర్చుకుంటుంది. అలా కాకుండా పువ్వు వికసించకుండా మొగ్గగానే ఉంటే అది ఎవరిని ఆకర్షిస్తుంది. ఏ సీతాకోకచిలుక దానిమీదకు వాలుతుంది. అందుకే అంటారు, మనసు వికసించి పరిపక్వతనేది కలగాలని. లేకుంటే ఎంత మంచి పుస్తకం చదివినా ఎంత మంచి బొమ్మను చూసినా ఎంత మంచి పని చేసినా ఆనందం కలగదు. పువ్వు వికసిస్తేనే మొక్కకు అందం. కంటిచూపుకీ ఆహ్లాదం. కనుక చైతన్యవంతులు కావడానికి మనసుని ఖాళీగా ఉంచుకోకుండా సన్మార్గంలో చక్కటి ఆలోచనలతో, సత్కార్యాలతో ముందుకు సాగాలి. అప్పుడే నిజమైన సంతోషం కలుగుతుంది. లేకుంటే ఏదైనా బూడిదలో పోసిన పన్నీరే సుమా. – యామిజాల జగదీశ్ -
జీవితం... ఒక పోరాటం
జెన్ గురువు ఒకరు తన శిష్యులకు జీవితం అంటే ఏమిటో చెప్పడం కోసం వారినందరినీ ఒకచోట సమావేశపరిచారు. ఆయన అవీ ఇవీ మాటలు చెప్తూ వారికి ఓ సీతాకోకచిలుక గూటిని చూపించి అందులోంచి కాస్సేపటికి సీతాకోకచిలుక ఎలా పోరాడి బయటకు వస్తుందో చూడండి అంటూ లోపలకు వెళ్ళిపోయారు. దానికెవరూ సాయం చేయకూడదని హెచ్చరిక చేశారు. ఆయన వెళ్ళిన వెంటనే శిష్యులందరూ మౌనంగా చూస్తున్నారు ఏం జరుగుతుందోనని. కానీ ఒక శిష్యుడికి చిన్న సందేహం కలిగింది. అది గూటిలాంటి పెంకుని చీల్చుకుని ఎలా బయటకు వస్తుందో పాపం అని మనసులో అనుకుని ఉండబట్టలేక దానికి సహాయం చేయాలనుకున్నాడు. మెల్లగా ఆ పెంకుకున్న రంధ్రాన్ని బద్దలు కొట్టాడు. దాంతో సీతాకోకచిలుక బయటకు వచ్చి చనిపోతుంది. తోటిశిష్యులందరూ అతని వంక గుర్రుగా చూశారు. కాసేపటి తర్వాత గురువుగారు అక్కడికి వచ్చారు. పెంకుని బద్దలు కొట్టిన శిష్యుడు ఏడుస్తుండడాన్ని చూశారు. ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఆ శిష్యుడు జరిగింది చెప్పి బాధ పడ్డాడు. అప్పుడు గురువుగారు, సీతాకోకచిలుక అంతగా కష్టపడడానికి కారణం, తన రెక్కలు బాగా ఎదగడానికీ, తనను గట్టిపరచుకోవడానికి అని చెప్పారు. అలాగే మనమూ మన జీవితంలో ప్రతి ఒక్కరం కష్టపడాలి. అప్పుడే జీవితంలోని లోతుపాతులు తెలుస్తాయి. జీవితం ఎంత అందమైందో కూడా తెలుస్తుంది. అనుకోని కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అంతమాత్రాన డీలా పడిపోకూడదు. సమస్యల నుంచి పారిపోకూడదు. అనుభవాలను పాఠాలుగా చేసుకుని వర్తమానంలో ఎలా ఉండాలో అలవరచుకోవాలి. మనసుకి పరిపక్వత వచ్చినప్పుడే ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది... అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. – యామిజాల జగదీశ్ -
తోట పనీ ధ్యానమే
ఆ జెన్ గురువు ఓ పర్వతం పాదాలకింద ఓ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే ఏళ్ళ తరబడి నివసిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో ఓ అందమైన పూలతోట కూడా ఉంది. ఆ తోటలో బోలెడన్ని పూలమొక్కలు. వాటి బాగోగులు పరిశీలించే పనులన్నీ శిష్యులకు అప్పగించారు సాధువు. వాళ్ళూ గురువుగారి మాట మీరకుండా పూదోటను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నిత్యమూ బోలెడు పువ్వులు వికసిస్తూ చూపరులను ఆకర్షించడమే ఆ పూలమొక్కల పని. సాధువుకు ఆ పూలవనం అంటే ఎంతో ఇష్టం. వాటిని శిష్యులు ప్రాణప్రదంగా చూసుకోవడం గురువుకెంతో నచ్చింది. అందుకే ఆయన ప్రతిరోజూ ఆ తోటలో కొన్ని గంటలు గడుపుతారు. అంతేకాదు, ఆయన కూడా కొన్ని మొక్కలకు నీరు పోస్తారు. పువ్వులతోనూ, మొగ్గలతోనూ, పచ్చని ఆకులతోనూ కబుర్లు చెబుతూనే, రాలిన ఆకులను సేకరించి తోటనంతా శుభ్రం చేస్తుంటారు. గురువు తీరుని చూసి ఆశ్చర్యంతో ఒకరడిగారు... ‘‘అయ్యా, ఈ తోటలో చెత్తాచెదారం మీరు బాగు చేయాలా... మీరు ఏం చెప్తే అది చెయ్యడానికి శిష్యులు ఉన్నారు... ఒకవేళ శిష్యులు బద్దకించినా డబ్బులు వెదజల్లితే తోట పనులు చెయ్యడానికి మనుషులు ముందుకొస్తారు కదా’’ అని. సాధువు నవ్వి ‘‘ఎవరో ఎందుకూ... నేను ఈ తోట పని చేస్తే తప్పేంటీ...’’ అని ప్రశ్నించారు. ‘‘తప్పు లేదండి. కానీ మీరు మహాత్ములు. ఎన్నో ప్రసంగాలు చేసే గొప్ప ఆలోచనాపరులు. మీ అపూర్వమైన కాలాన్ని మీరు మరివేటికైనా ఉపయోగించుకోవచ్చు కదా’’ అని ఆయన మనసులోని మాట చెప్పాడు. సాధువు ‘‘మిత్రమా, నేను ఒట్టి తోట పనే చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజానికి నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను... ప్రతి రోజూ నేను ఈ సమయం కోసమే నిరీక్షిస్తుంటాను. తోటలోకెళ్ళి ఎప్పుడు శుభ్రం చేస్తానా అని. ఇక్కడే ఇతర ఆలోచనలేవీ మనసులోకి రానివ్వక మొక్కలతోనూ పువ్వులతోనూ నా సమయాన్ని గడుపుతాను. మొక్కలకు నీరు పోస్తూ, వికసించిన పువ్వులతో మాట్లాడుతూ పరవశించి నన్ను నేను మరచిపోతుంటాను. అలాంటి అమృతఘడియలు మరెక్కడా అంత అమోఘంగా అద్భుతంగా దొరకవు. కనుక నాకీ తోట పనీ ఓ ధ్యానమే‘‘ అని చెప్పారు. – యామిజాల జగదీశ్ -
నీలా ఉంటే ఎంత బాగుంటుందో!
అదొక పల్లెటూరు. ఆ ఊరికో ప్రత్యేకత ఉంది. ఎలాగంటే ఆ ఊళ్ళో ఓ పండు దొరుకుతుంది. ఆ పండు ఇంకెక్కడా దొరకదు. అంతటి ప్రత్యేకమైన పండది. ఆ పండు తింటే కొన్ని రోజుల వరకూ ఆకలి అనేది ఉండదు. ఈ విషయం ఓ సూఫీ సాధకుడి చెవిన పడింది. ఆ పండేదో తెలుసుకుందామని ఆ సూఫీ సాధకుడు ఆ ఊరుకి వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఉన్న పెద్ద సంతకు వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఆ పండు దొరకలేదు. ఆయన వాలకాన్ని ఓ యువకుడు పసికట్టాడు. ఆయన వద్దకు వచ్చిన యువకుడు ‘‘మీరు దేని కోసమో వెతుకుతున్నట్టు అనిపిస్తోంది. నేనేమైనా మీకు సాయం చేయగలనా‘‘ అని అడిగాడు. సూఫీ సాధకుడు ‘‘అవును. మీరన్నది నిజమే. ఈ ఊళ్ళో ఓ అపూర్వమైన, అరుదైన పండు ఉందని తెలిసి పొరుగూరి నుంచి వచ్చాను. ఆ పండు తింటే చాలా రోజులవరకూ ఆకలనేదే ఉండదట. ఆ పండు గానీ లేదా ఆ పండు విత్తనం గానీ దొరికితే దాన్ని తీసుకుపోయి ఆకలితో నకనకలాడే ప్రాంతంలోని ప్రజలకు సాయపడాలన్నదే నా ఆశ...’’ అన్నాడు సాధువు. యువకుడు కాస్సేపు ఆయనను ఉండమని చెప్పి అక్కడినుంచి బయలుదేరాడు. చెప్పినట్టే కాసేపటికి ఆ యువకుడు వచ్చాడు. అతని చేతిలో ఓ పండు ఉంది. ‘‘మీరడిగిన పండు ఇదేనండి. తీసుకోండి’’ అని ఆ పండుని యువకుడు సాధువుకు అందించాడు. ‘‘ఈ ఊళ్ళో ఈ పండు ఎక్కువగానే లభిస్తుందని ఆ నోటా ఈ నోటా విన్నాను...’’ అని చెప్పాడు సాధువు. ‘‘నిజమే. ఈ ఊళ్ళో ఈ పండు ఎక్కువగానే లభిస్తూ వచ్చింది. కానీ ఈ ఊరి ప్రజలు స్వార్థపరులుగా మారిపోయారు. తాము పొందే ఫలితాన్ని ఇతరులు పొందకూడదనే కారణంగా ఎవరికి వారు అవసరానికి మించి కొని దాచుకుంటున్నారు. అంతేకాదు, దీన్ని సాగుచేసే పద్ధతిని కూడా గుట్టుగా ఉంచారు. అయితే మా ఇంట ఉన్న ఓ పండుని తీసుకొచ్చి మీకిచ్చాను...ఈ పండుని ఆకలితో మాడుతున్న ప్రజలకు ఉపయోగిస్తానని మీరు చెప్పడం నాకు నచ్చింది. అందుకే మీకీ పండు ఇవ్వాలనిపించింది’’ అన్నాడు యువకుడు. ఆ యువకుడి మాటలు సాధువుని ఆకట్టుకున్నాయి. అతనిని దీవించి ఇలా చెప్పారు ... ‘‘నీలాగా ఇతరులకు సాయం చేయాలనే వారి సంఖ్య గానీ పెరిగితే వారుండే ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి కష్టమూ నష్టమూ కలగదు కదా’’ అన్నాడు. – యామిజాల జగదీశ్ -
అందమూ... వికారమూ
అతను ఓ చిత్రకారుడు. ఓ అందమైన నగుమోము, వికారమైన మోము చిత్రాలు గీయాలనుకున్నాడు. ముందుగా అందమైన మోము గల చిత్రం గీయడానికి నిర్ణయించుకున్నాడు. చాలా కాలానికి అతను అనుకున్నట్టే ఓ అందమైన అయిదేళ్ళ చిన్నవాడొకడు కనిపించాడు. వాడి బొమ్మ గీశాడు. ఆ చిత్రం ఎంతో అందంగా ఉంది. ఆ తర్వాత వికారస్వరూపం ఉన్న మోము కోసం వెతకడం మొదలుపెట్టాడు. చాలా కాలమే పట్టింది. అతనిలో విసుగు మొదలైంది. అయినా ప్రయత్నం మానలేదు. ఉన్నట్లుండి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో వెతకడమెందుకు ఏదైనా ఒక జైలుకి వెళ్తే తాననుకున్న వికారస్వరూపుడు తారసపడతాడనుకున్నాడు. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అతను అనుకున్నట్టే ఒక జైలులో అత్యంత వికారమైన ముఖం ఉన్న ఒక వ్యక్తి కనిపించేసరికి అప్పటిదాకా అతనిలో ఉన్న నీరసం, విసుగు మటుమాయమయ్యాయి. ఉత్సాహం ఉప్పొంగింది. జైలు అధికారి అనుమతితో ఆ వికారస్వరూపుడి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. గీస్తున్నంతసేపు ఆ వికారస్వరూపుడిని మాటల్లో పెట్టాడు. అతని ఊరు, పేరు, పెద్దల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతను చెప్పిన వివరాలన్నీ విన్న తర్వాత చిత్రకారుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే అతను మరెవరో కాదు, అందమైన చిన్నవాడనుకుని కొన్నేళ్ళ క్రితం గీసిన ఆ కుర్రాడే ఇప్పుడీ వికారస్వరూపుడు. కాలక్రమంలో ఆ అందమైన చిన్నోడు అనేక నేరాలూ ఘోరాలు చేసి ఇప్పుడిలా వికారస్వరూపుడిగా మారి తనముందున్నాడు. ఈ నిజం తెలిసి చిత్రకారుడి నోటి వెంట మాట లేదు. ప్రతి మనిషిలోనూ అందమూ, వికారమూ ఉంటాయి. అయితే అతన్ని ఒకసారి అందంగానూ, మరోసారి వికారంగానూ చూపేది అతనున్న పరిస్థితులే! – యామిజాల జగదీశ్ -
జీవిత సత్యం
జెన్ లోకంలో ఓ గురువు ఉండేవారు. ఆయన మహాజ్ఞాని. ఆత్మజ్ఞానం గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు. ఆయన పేరు షెన్ హాయ్. ఓ రాజు ఆయనను వెతుక్కుంటూ వచ్చి, ‘‘నాకు ఓ అంతిమ మాట రాసివ్వండి’’ అని అడిగాడు. ఆ మాట ఎలా ఉండాలంటే జీవిత సత్యాన్ని ప్రతిఫలించేట్టుగా ఉండాలన్నాడు. రాజు చెప్పిందంతా విన్న జ్ఞాని ఓ చిన్న కాగితంలో రాసిచ్చారు.... అదొక చిన్న కవిత. ‘‘తండ్రీ మరణిస్తాడు. కొడుకూ మరణిస్తాడు. ఆ తర్వాత మనవడూ మరణిస్తాడు’’ అది చదివి రాజు ‘‘ఏమిటండీ ఇది... ఇలా రాశారు... అని బాధను వ్యక్తం చేశాడు. అప్పుడు జ్ఞాని ఓ నవ్వు నవ్వారు. నువ్వు అడిగింది జీవిత సత్యాన్ని. ఇది ఎప్పటికీ చెరగిపోని జీవిత సత్యం. మీ తాత ఎప్పుడో చనిపోయారు. నీ తండ్రీ కొన్నిరోజుల ముందు చనిపోయారు. నువ్వూ ఓ రోజు చనిపోబోతున్నావు. నీ కుమారుడూ ఓరోజు కచ్చితంగా చనిపోతాడు కదా, అందులో దోషం ఏముంది’’ అని అన్నారు. ‘‘పుట్టిన వారందరూ మరణిస్తారు అనేది అందరికీ తెలుసు. కానీ మీవంటి జ్ఞాని ప్రజలకు వరప్రసాదం లాంటి మాట చెప్పకుండా శాపం లాటి అపశకునపు మాటల్ని రాసివ్వడం బాధ కలిగిస్తోంది’’ అన్నాడు రాజు. ‘‘ఇది శాపమా... పెద్ద వరం... శుభశకునం... బాగా ఆలోచించి చూడు. ముందుగా తండ్రి మరణిస్తాడు. ఆ తర్వాత బిడ్డలు చనిపోతారు. అనంతరం మనవళ్ళు మరణిస్తారు. ఇదేగా ఓ క్రమపద్ధతి. నీ పెద్దలు తమ అంత్యక్రియలను నువ్వు చెయ్యాలనేగా అనుకుంటారు. నువ్వు మరణించి నీ కొడుకు నీకు అంతిమ సంస్కారాలు చేయడం సహజం. అలాకాకుండా నువ్వుండి నీ కొడుకు మరణించి నువ్వు అతని అంత్యక్రియలు చెయ్యవలసి వస్తే అది ఎలా ఉంటుందో ఆలోచించు. అలా జరిగితే అది శాపం. కానీ నువ్వు మరణించి నీ అంత్యక్రియలు నీ కొడుకు చెయ్యడం అనేది వరం. మరణం అనేది సహజం. అలా అది సహజ పద్ధతిలో జరిగితే అది దైవమిచ్చిన వరమేగా...’’ అన్నాడు జ్ఞాని. జ్ఞాని వివరంగా చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత రాజు ఆ కవితను కళ్ళకు అద్దుకుని ఒకటికి రెండుసార్లు చదువుకుని ఆయనకు నమస్కరించి వీడ్కోలు తీసుకున్నాడు. ప్రపంచంలో పెద్ద విచిత్రమేమిటి... కళ్ళ ఎదుటే ఎందరో మరణిస్తున్నా తాను మాత్రం దీర్ఘకాలం ఉంటానని మనసు ఊహించడం! మరణానంతరం ఏం జరుగుతుందో అనే భయం అనవసర భ్రమ. మనం పుట్టడానికి మూడు రోజుల ముందు మనకోసం అమ్మ రొమ్ములో పాలు ఉత్పత్తి అయినట్లే మనకంటూ ఓ ప్రత్యేకమైన చోటూ ఎదురు చూస్తూనే ఉంటుంది. – యామిజాల జగదీశ్ -
సహనమే సగం బలం
అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యానికి ఓ రాజు. ఆ రాజుకి ఒకటే దిగులు. దానిని ఎవరితోనూ చెప్పుకోలేక నానా అవస్థ పడుతున్నాడు. లోలోపల ఒత్తిడికి లోనవుతున్నాడు. రాజు ముఖం చూడగానే ఆయన ఏదో సమస్యతో ఒత్తిడికి లోనైనట్టు మంత్రి గ్రహించాడు. కానీ అడిగితే కోపగించుకుంటాడేమో అని మంత్రి అనుమానం. అయినా ఎలాగైనా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఓ ఎత్తుగడ వేశాడు. ‘‘మీరు వేటకు వెళ్ళి చాలా కాలం అయినట్టుందే’’ గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు మంత్రి. ‘‘అవును. కానీ ఇప్పుడు నేను వేటాడే మానసికస్థితిలో లేను’’ చెప్పాడు రాజు. ‘‘మనసు సరిగ్గా లేనప్పుడే ఉత్సాహం తెచ్చుకోవడానికి వేటాడాలి రాజా. దారిలోనే మీ గురువుగారి ఆశ్రమం. ఆయనను కూడా ఓ సారి దర్శించుకుందాం. బయలుదేరండి.’’ చెప్పాడు మంత్రి. ‘‘గురువు’’ అనే మాట వినడంతోనే రాజులో ఆశ చిగురించింది. ఆయనను కలిస్తే ఆయన చెప్పే మాటలతో తన దిగులుకు సమాధానం లభిస్తుందేమో అని రాజు అనుకున్నాడు. రాజుగారి గురువు ఓ జెన్ సాధువు. ఆయన ఊరు చివర ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నారు. ఆయన దగ్గర కొందరు శిష్యులు కూడా ఉన్నారు. రాజు రాక తెలియడంతోనే ఆశ్రమ శిష్యులు ఎదురెళ్ళి రాజుగారికి స్వాగతం పలికారు. రాజు తిన్నగా గురువుగారి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. తన మనసులోని సమస్యను చెప్పుకున్నాడు. ఎలా పరిష్కరించుకోవాలనుకున్నాడో కూడా చెప్పాడు. అన్నీ అయిన తర్వాత రాజు అడిగాడు –‘‘మీరేమనుకుంటున్నారు’’ అని. సాధువు ఏమీ చెప్పలేదు. కొన్ని నిముషాలు మౌనంగా గడిచాయి. ‘‘నువ్వు బయలుదేరవచ్చు’’ అన్నారు. రాజు ముఖంలో కోపం గానీ నిరాశ గానీ కనిపించలేదు. ఉత్సాహం కనిపించింది. బయలుదేరాడు. తన గుర్రం ఎక్కాడు. అది చూసిన మంత్రి సాధువు దగ్గరకు వెళ్ళి ‘‘రాజుగారి సమస్యను ఎలా పరిష్కరించారు’’ అని అడిగాడు. ‘‘మీ రాజు చాలా తెలివైనవాడు. అతనే తన సమస్యను పరిష్కరించుకున్నాడు. నేను చేసిందేమీ లేదు. అతను తన సమస్యలన్నీ విడమరిచి ఒకటి తర్వాత ఒకటి వరుసగా చెప్తుంటే ఓపికగా విన్నాను. అంతేకాదు, ఆయన దగ్గరకు జరిగి భుజం మీద వాలి విన్నాను. వెన్ను తట్టాను. అంతే....’’ అన్నారు. సాధువు మౌనంగా విన్న క్రమంలో ఆయన పాటించిన సహనాన్ని గమనించి దాన్ని రాజు పాటించాలనుకున్నాడు. అదే తన సమస్యలకు పరిష్కారం అని అనుకున్నాడు. అంతకన్నా మరొకటి లేదని గ్రహించాడు కనుకే రాజు తన సమస్యకు జవాబు దొరికిందన్న ఆనందంతో వేటకు వెళ్ళాడు. – యామిజాల జగదీశ్ -
ఒక్కరోజే కదండీ మోయాల్సింది!
ఆయన ఓ తత్వజ్ఞాని. ఆయన ప్రసంగం వినడానికి ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చిపోతుండేవారు. వాటిని ఆధారంగా చేసుకుని తమ ఆధ్యాత్మిక చింతనను పెంచుకునే వారు. ఆయనను ప్రశంసించే వారనేకం. ఆయన ప్రసంగాలలో ఆధ్యాత్మిక చింతనే కాకుండా రోజువారీ మామూలు విషయాలు కూడా ఉపయోగపడేవిగా ఉంటూ ఉండేవి. బుద్ధుడు, మహావీరుడు తదితర పెద్దల మాటలను కూడా ఆయన తన ప్రసంగాలలో ఉదహరిస్తూ వచ్చేవారు. ఓరోజు ఆయన వీధిలో నడచుకుంటూ పోతున్నారు. ఇంతలో అనుకోకుండా ఆయన చెప్పులు తెగిపోయాయి. ఆయన మెల్లగా కాళ్ళీడుస్తూ రోడ్డుపక్కనున్న చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు చేరుకున్నారు. ‘‘ఇదిగో, ఈ చెప్పులు బాగు చేసివ్వు. తెగిపోయాయి’’ అన్నారాయన చెప్పులు కుట్టే వ్యక్తికి రెండు చెప్పులూ ఇస్తూ. చెప్పులు కుట్టే వ్యక్తి వాటిని అటూ ఇటూ తిప్పి చూసాడు. అవి బాగా అరిగిపోయున్నాయి. ‘‘ఇక్కడ వదిలేసి వెళ్ళండి, సరిచేసి పెడతాను. రేపొచ్చి తీసుకుపోగలరు’’ అన్నాడతను. ‘‘ఏంటీ, రేపా‘‘ అన్నారు జ్ఞాని. ‘‘అవునయ్యా, ఇప్పటికే చేతి నిండా బోలెడంత పని ఉంది. ఆ పనంతా పూర్తి చేస్తే తప్ప మీ చెప్పుల విషయానికి రాలేను. పైగా ఈ చెప్పులు బాగు చేయడానికి చాలా సమయం పడుతుంది‘‘ అన్నాడు. అప్పుడు జ్ఞాని ‘‘ఓ రోజంతా చెప్పులు లేకుండా ఎలా గడపాలి‘‘ అని అడిగారు జ్ఞాని. ‘‘ఒక్క రోజే కదండీ, వీటికి బదులు నా దగ్గరున్న మరో జత చెప్పులు ఇస్తాను. వాటితో గడపండి‘‘ అన్నాడు ఆ పనివాడు. ‘‘ఏంటీ‘‘ అని స్వరం పెంచారు జ్ఞాని. ‘‘మరొకరి చెప్పులను నా కాళ్ళు మోయాలా, నీకలా చెప్పడానికి ఎలా మనసొచ్చింది‘‘ అని జ్ఞాని ఆవేశంగా అన్నారు. చెప్పులు కుట్టే వ్యక్తి ఓ నవ్వు నవ్వాడు. అనంతరం అతను ఆయనను చూసి ‘‘ఇతరులు చెప్పిన అభిప్రాయాలన్నింటినీ మీ బుర్రలో పెట్టుకుని మోస్తూ తిరుగుతుంటారు. వాటిని అందరికీ చెప్తుంటారు... అలాంటిది మీరు ఒక్కరోజుమాత్రమే మరొకరి చెప్పులు వేసుకుని వాటిని మోయడంలో మీకొచ్చిన కష్టమేమిటండీ‘‘ అని అడిగాడు. ఆ మాటలతో జ్ఞాని ‘‘సరే రేపు వస్తాను.... ‘‘ అని అక్కడి నుంచి మరొక్క మాటమాట్లాడకుండా వెళ్ళిపోయారు. – యామిజాల జగదీశ్ -
సత్యాన్వేషి-సూఫీ గురువు
సూఫీ తత్వం భగవంతుడు ఫలానా రూపంలోనే ఉంటాడు అని అనుకునే వ్యక్తి అందుకు భిన్నమైన రూపంలో దేవుడు తన ఎదుట ప్రత్యక్షమైనా ఆ సంగతిని గుర్తించలేదు. సాక్షాత్కార భాగ్యాన్ని పొందలేడు. ఒకడు సత్యాన్వేషణలో పడతాడు. ఎక్కడెక్కడో తిరిగి ఆనోటా ఈనోటా విని చివరికి ఓ సూఫీ జ్ఞాని వద్దకు బయలుదేరుతాడు. కానీ అతన్ని ఆ జ్ఞాని వద్దకు వెళ్లనివ్వకుండా సైతాన్ అడ్డుపడతాడు. ముందుగా, సైతాన్ ఒక అందాల సుంద రి రూపంలో అతని ముందుకు వస్తాడు. ఆ సుందరి రూపానికి ఆ సత్యాన్వేషి అడుగులు ముందుకు పడవు. కాసేపటి తర్వాత తను దారి తప్పిన విషయాన్ని తెలుసుకుని సుందరిని విడిచిపెట్టి జ్ఞాని వద్దకు మళ్లీ అడుగులు వేస్తాడు. అయితే ఓ పది అడుగులు వేశాడో లేదో ఓ వ్యక్తి తారసపడతాడు. అతను ఎంతో వినమ్రంగా మాట్లాడి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. అతనితోనూ సత్యాన్వేషి కొంత దూరం వెళ్తాడు. మళ్లీ వెనక్కు వస్తాడు. ఇలా అడుగడుగునా సైతాన్ ఏదో రూపంలో సత్యాన్వేషికి అడ్డు తగులుతూ ఉంటాడు. అతనిని దారి మళ్లించడం కోసం వస్తువులు, పొగడ్తలు, అధికారం, అంతస్తు ఇలా రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తాడు. ఎలాగైతేనేం అవన్నీ వది లించుకుని సత్యాన్వేషి చాలాసేపటి తర్వాత జ్ఞాని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆశ్రమం తలుపులు తెరిచే ఉంటాయి. తిన్నగా లోపలికి వెళ్తాడు. దాంతో సైతాన్ కాస్తా తన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని నొచ్చుకుని అతనికి దూరమై చీకట్లో నీలుగుతూ ఉంటాడు. సత్యాన్వేషి జ్ఞాని ఉన్న గదిలోకి వస్తాడు. జ్ఞాని ఒక ఆసనంపై కూర్చుని ఉంటాడు. ఆయన చుట్టూ శిష్యులు అనేకులు కూర్చుని ఉంటారు. ఆయన రూపురేఖలు తానూహించుకున్నట్లు లేకపోవడంతో సత్యాన్వేషి మనసులో అనేక సందేహాలు కలుగుతాయి. ‘ఇతనేం గురువో? నేను అనుకున్నట్లు లేరే?’ అనుకుంటాడు. జ్ఞాని అతను వచ్చి నిల్చున్న విషయాన్ని పట్టించుకోనట్లు ఉంటాడు. శిష్యులూ అతని రాకను పట్టించుకోరు. దాంతో సత్యాన్వేషి, తానొస్తే ‘రండి రండి’ అని ఆహ్వానించే వారే లేరేంటీ?’’ అనుకుంటాడు. అయినా ఓపిక వహిస్తాడు. అక్కడ ఏం జరుగుతోందో పరిశీలిస్తాడు. శిష్యుల్ని ఉద్దేశించి జ్ఞాని చెప్తున్న మాటలు అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఆయన మాటల్లో ఎలాంటి తత్వమూ లేదనుకుంటాడు. అటువంటి ఓ సామాన్యుడిని ఇంతమంది శిష్యులు గురువుగా పరిగణిస్తున్నారా? ఇదేం విడ్డూరమో? అనుకుంటాడు. ఓ వెర్రి నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వు అక్కడున్న జ్ఞానిని కించపరిచేటటువంటి నవ్వు. ‘‘ప్రజలు వొట్టి మూర్ఖులు. ఎవరిని గురువుగా భావించాలో కూడా తెలియదు’’ అనుకుని అక్కడున్న వారితో ఒక్క మాటా మాట్లాడక తానొచ్చిన సత్యాన్వేషణ విషయాన్ని అక్కడే విడిచిపెట్టి వెనుతిరుగుతాడు. అతనలా వెళ్లిన తర్వాత జ్ఞాని ఓ నవ్వు నవ్వుతారు. అతను వెళ్లిన వైపే చూస్తారు. ‘‘సైతాన్, నువ్వు అతనికి అన్ని పరీక్షలు పెట్టవలసిన అవసరమే లేదు. అతను నీ కోవకు చెందిన మనిషే. అతనిలో నిజంగానే సత్యాన్ని తెలుసుకోవాలే ఆరాటం ఉండి ఉంటే నీ తొలి అస్త్రాన్నే ఆ క్షణంలోనే ఛేదించి నా దగ్గరకు వచ్చి ఉండేవాడు. కానీ అడుగడుగుకీ అతను దారి తప్పుతూ వస్తున్నాడు. అతని మనస్సు స్థిరంగా లేదు...’’ అని జ్ఞాని అన్నారు. సైతాన్ కూడా ఒక్క మాటా మాట్లాడకుండా అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. భగవంతుడి ఆచూకీ కోసం తపించే జీవుడు వస్తువులు, పొగడ్తలు, ఆశలు, హోదా వంటివేవీ దరికి రానివ్వడు. భగవంతుడు ఫలానా రూపంలోనే ఉంటాడు అని అనుకునే వ్యక్తి అందుకు భిన్నమైన రూపంలో దేవుడు తన ఎదుట ప్రత్యక్షమైనా ఆ రూపాన్ని భగవంతుడిగా అనుకోడు, నమ్మడు అనేదే ఈ కథ సారాంశం. - యామిజాల జగదీశ్ -
ఏది వెలుగు?
జెన్ పథం శిష్యులంతా కూడబలుక్కుని అసలైన సమాధానం ఏదో మీరే చెప్పండని గురువుగారిని అడిగారు. ఒక గురువు శిష్యులకు పాఠం చెప్తున్నారు. ‘‘పుట్టుకకు సంబంధించి అన్ని ప్రాణులూ సమానమే. ఆకలి, దాహం, నిద్ర, మృత్యువు భయం వంటివి అన్ని ప్రాణులకూ సంబంధించినవే. దిగులు అనేది కూడా అందరికీ చెందినదే. ఇందులో ధనికులూ, పేదలూ అనే తేడా ఉండదు. రాత్రీ పగలూ ఆనందం, ఆవేదన, సుఖమూ, దుఃఖమూ అనేవి కూడా ఒక దాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఏవీ స్థిరంగా ఉండిపోవు. అలాగే జననం, మరణం కూడా. రాత్రి వస్తుంది. అది కొన్ని గంటలు ఉండి నెమ్మది నెమ్మదిగా చెదరిపోయి పగలు వస్తుంది. అయితే ఇంతకూ మనకు ఏ క్షణాన ఉదయం వచ్చిందో మీలో ఎవరైనా చెప్పగలరా?’’ అని గురువుగారు ప్రశ్నించారు. ఒక శిష్యుడు లేచి నిల్చుని ‘‘గురువుగారూ, ఒక మృగం అల్లంత దూరాన ఉన్నప్పుడే అది గాడిదో, గుర్రమోనని గుర్తు పట్టినప్పుడు వెలుతురుతోపాటే ఉదయం వచ్చినట్టు అనుకోవాలి’’ అని ఎంతో వినయంగా చెప్పాడు. కానీ గురువు గారు అతను చెప్పిన మాటలన్నీ విని అది సరైన సమాధానం కాదని అన్నారు. ఇంతలో మరో శిష్యుడు లేచి నిల్చుని ‘‘గురువుగారూ, అల్లంత దూరంలో ఉన్న ఒక చెట్టుని అది మర్రిచెట్టో, చింతచెట్టో చెప్పగలిగినప్పుడు వెలుతురు వచ్చినట్టే అనుకోవాలి’’ అన్నాడు. అది కూడా సరైన జవాబు కాదన్నారు గురువుగారు. అప్పుడు మిగిలిన శిష్యులు ఒక్కటై తాము ఏది చెప్పినా సరికాదంటున్న గురువుగారినే సరైన సమాధానమేదో చెప్పమంటే సరిపోతుంది కదా అని కూడబలుక్కుని ఆ మాటనే గురువుగారితో అన్నారు. గురువుగారు సరేనని ఇలా చెప్పారు- ‘‘ఏ పురుషుడు కనిపించినా అతను నా సోదరుడే అని, ఏ స్త్రీ కనిపించినా ఆమె నా సోదరి అని ఎప్పుడైతే మీరు భావిస్తారో అప్పుడే మీరు నిజమైన వెలుగును చూసినట్లు అనుకోవాలి. అప్పటిదాకా మిట్టమధ్యాహ్నపు ఎండ వెలుగైనా సరే నిశిరాత్రి చీకటే’’. రాత్రీ పగలూ అనే వి కేవలం కాలంలో వచ్చే మార్పులే. వెలుగు అనేది అంతరంగంలో రావాలన్నది ఇక్కడి గురువుగారి భావం. - యామిజాల జగదీశ్