శ్రీ రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్పారు. అది ఇలా సాగుతుంది:
‘‘ఊరి పొలి మేరలో ఓ ఆశ్రమంలో గురువు ఉండేవారు. ఆయనకు శిష్యులనేకమంది. ఒకరోజు వారందరినీ కూర్చో పెట్టి... ‘ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడి రూపాలే. దానిని మీరు అర్థం చేసుకుని నమస్కరించాలి’ అన్నారు. శిష్యులందరూ సరేనన్నారు.
ఓరోజు ఓ శిష్యుడు గురువుగారు చెప్పిన పని మీద అడవిలోకి బయలు దేరాడు. ఇంతలో ‘ఎవరెక్కడున్నా సరే పారిపోండి... మదమెక్కిన ఏనుగొకటి వస్తోంది. దాని కంట పడకండి’ అని హెచ్చరిస్తూ ఒక వ్యక్తి పారిపోతున్నాడు. ఈ హెచ్చరికతో అక్కడక్కడా ఉన్నవారు పారిపోయారు. కొందరు చెట్టెక్కి కూర్చున్నారు. కానీ ఈ గురువుగారి శిష్యుడున్నాడు చూశారూ, అతను తన ధోరణిలోనే నడుస్తున్నాడు. పైగా ‘నేనెందుకు పరుగెత్తాలి... నేనూ దేవుడు, ఆ ఏనుగూ దేవుడే! ఇద్దరం ఒక్కటే... ఏనుగు నన్నేం చేస్తుంద’నుకుని దారి మధ్యలో నిల్చుండిపోయాడు. ఏనుగు సమీపిస్తోంది.
కానీ అతను ఉన్న చోటనే నిల్చున్నాడు. చేతులు రెండూ పైకెత్తి నమస్కరించాడు. పైగా దైవప్రార్థన చేశాడు. ఇంతలో ఏనుగుమీదున్న మావటివాడు కూడా అతనిని పక్కకు తప్పుకోమని హెచ్చరించాడు. కానీ శిష్యుడు ఆ హెచ్చరికను ఖాతరు చేయలేదు. అతను కావాలంటే ఏనుగుని దేవుడిగా భావించవచ్చు. కానీ ప్రతిగా ఏనుగు అలా అనుకోదుగా! అతను చేతులు రెండూ పైకెత్తి నిల్చోడంతో ఏనుగు పని మరింత సులువైంది. అది అతనిని ఒక చుట్ట చుట్టి కింద పడేసి ముందుకు వెళ్ళిపోయింది. అతనికి గాయాలయ్యాయి.
విషయం తెలిసి ఆశ్రమానికి చెందినవారు అక్కడికి చేరుకుని కింద పడి ఉన్న అతనిని అతికష్టం మీద గురువుగారి వద్దకు తీసుకుపోయారు. అతను జరిగినదంతా చెప్పాడు. అప్పుడు గురువుగారు ‘నువ్వనుకున్నది నిజమే, కానీ మావటివాడు కూడా దేవుడే కదా! అతను నిన్ను హెచ్చరించాడుగా తప్పు కోమని! ఆ మాటైనా పట్టించుకోవాలి కదా’ అని చెప్పగా శిష్యుడు అయోమయంగా చూశాడు. ‘వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోక పోవడం వల్ల వచ్చిన ప్రమాదమిది’ అంటూ గురువుగారు కథ ముగించారు.’’ – యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment