Ramakrishna Paramahamsa
-
అంతా.. అర్థం చేసుకోవడంలోనే..!
శ్రీ రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్పారు. అది ఇలా సాగుతుంది:‘‘ఊరి పొలి మేరలో ఓ ఆశ్రమంలో గురువు ఉండేవారు. ఆయనకు శిష్యులనేకమంది. ఒకరోజు వారందరినీ కూర్చో పెట్టి... ‘ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడి రూపాలే. దానిని మీరు అర్థం చేసుకుని నమస్కరించాలి’ అన్నారు. శిష్యులందరూ సరేనన్నారు.ఓరోజు ఓ శిష్యుడు గురువుగారు చెప్పిన పని మీద అడవిలోకి బయలు దేరాడు. ఇంతలో ‘ఎవరెక్కడున్నా సరే పారిపోండి... మదమెక్కిన ఏనుగొకటి వస్తోంది. దాని కంట పడకండి’ అని హెచ్చరిస్తూ ఒక వ్యక్తి పారిపోతున్నాడు. ఈ హెచ్చరికతో అక్కడక్కడా ఉన్నవారు పారిపోయారు. కొందరు చెట్టెక్కి కూర్చున్నారు. కానీ ఈ గురువుగారి శిష్యుడున్నాడు చూశారూ, అతను తన ధోరణిలోనే నడుస్తున్నాడు. పైగా ‘నేనెందుకు పరుగెత్తాలి... నేనూ దేవుడు, ఆ ఏనుగూ దేవుడే! ఇద్దరం ఒక్కటే... ఏనుగు నన్నేం చేస్తుంద’నుకుని దారి మధ్యలో నిల్చుండిపోయాడు. ఏనుగు సమీపిస్తోంది.కానీ అతను ఉన్న చోటనే నిల్చున్నాడు. చేతులు రెండూ పైకెత్తి నమస్కరించాడు. పైగా దైవప్రార్థన చేశాడు. ఇంతలో ఏనుగుమీదున్న మావటివాడు కూడా అతనిని పక్కకు తప్పుకోమని హెచ్చరించాడు. కానీ శిష్యుడు ఆ హెచ్చరికను ఖాతరు చేయలేదు. అతను కావాలంటే ఏనుగుని దేవుడిగా భావించవచ్చు. కానీ ప్రతిగా ఏనుగు అలా అనుకోదుగా! అతను చేతులు రెండూ పైకెత్తి నిల్చోడంతో ఏనుగు పని మరింత సులువైంది. అది అతనిని ఒక చుట్ట చుట్టి కింద పడేసి ముందుకు వెళ్ళిపోయింది. అతనికి గాయాలయ్యాయి.విషయం తెలిసి ఆశ్రమానికి చెందినవారు అక్కడికి చేరుకుని కింద పడి ఉన్న అతనిని అతికష్టం మీద గురువుగారి వద్దకు తీసుకుపోయారు. అతను జరిగినదంతా చెప్పాడు. అప్పుడు గురువుగారు ‘నువ్వనుకున్నది నిజమే, కానీ మావటివాడు కూడా దేవుడే కదా! అతను నిన్ను హెచ్చరించాడుగా తప్పు కోమని! ఆ మాటైనా పట్టించుకోవాలి కదా’ అని చెప్పగా శిష్యుడు అయోమయంగా చూశాడు. ‘వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోక పోవడం వల్ల వచ్చిన ప్రమాదమిది’ అంటూ గురువుగారు కథ ముగించారు.’’ – యామిజాల జగదీశ్ -
శ్రీ రామకృష్ణ పరమహంస
ఆయన కాళిమాతకు వీరభక్తుడు. ప్రియమైన పుత్రుడు. తను పిలిచినప్పుడల్లా పలికి పరమానందానుభూతిలో ముంచెత్తే కాళీమాత ఆయన దృష్టిలో దేవత కాదు, సజీవ సత్యం. ఐతే ఈ ఆనందం కూడా ఒక బంధనమేనన్న ఆలోచన మదిలో మెదలి అంతకుమించిన జ్ఞానాన్ని పొందేదిశగా ప్రయత్నాలు చేసి, రామకృష్ణ పరమహంసగా ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచారు. బొమ్మకాదది... అమ్మ రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. చిన్ననాటినుండి చదువు, సంపాదనల మీద ఆసక్తి చూపించని రామకృష్ణులు ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిలోనే విహరిస్తూ సమయాన్ని గడిపేవారు. ఒకనాడు ఆలయంలోని కాళిమాతను చూసి ఆమె బొమ్మకాదని... తను పిలిస్తే పలుకుతుందని నిశ్చయించుకుని ఆ కాళీమాతకు పూజలు చేస్తూ అహర్నిశం అమ్మవారి ధ్యాసలోనే గడిపి అమ్మ దర్శనాన్ని పొందారు. భార్యను దైవంగా... తోతాపురి అనే సాధువు ఉపదేశించిన అద్వైతజ్ఞానం రామకృష్ణుల జీవితాన్ని మలుపు తిప్పింది. తన భార్య శారదాదేవినే మొదటి శిష్యురాలిగా చేసుకుని తాను గురువు వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమెను సాక్షాత్తూ కాళికాదేవిలా భావించి పూజించారు. వివేకానందుడు మొదలుకుని భగవంతుడిని తెలుసుకోవాలనే తపనగల మరెందరికో తన జ్ఞానానుభావాలను పంచారు. రామకృష్ణుని అమృత బిందువులు భగవంతుని ఆశ్రయం పొందడానికి అత్యంత ప్రేమతో సాధన చేయాలి. తనకోసం బిడ్డ అటూ ఇటూ పరుగులు పెట్టే బిడ్డను దగ్గరకు తీసుకోని తల్లి ఉంటుందా? అంటూ భక్తికి అనురాగాన్ని ముడివేసేవారు. మనస్సును సరైన దిశలో పయనింపజేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. కానీ దానికి దిశానిర్దేశం చేయడంలో మన వివేకం, విజ్ఞతలను ఉపయోగించకపోతే, అదుపుతప్పిన గుర్రంలా పరుగెడుతుందనే వారి మాట ఆధ్యాత్మికానికే కాదు.... అన్నింటా అనుసంధానించవలసినది. భగవన్నామాన్ని వినడానికి లక్ష చెవులున్నా చాలవు. ఎన్నిసార్లూ ఆ నామాన్ని నోటితో జపించినా తృప్తి కగదు. ఎప్పుడైతే ఆ నామం మనసులో ప్రకంపనలను కలగజేస్తుందో అప్పుడు ఇంద్రియశుద్ధి కలుగుతుంది. కామం, అసూయలనే రెండు శత్రువులను తొలగించుకున్ననాడు భగవంతుని దర్శించడం అందరికీ సాధ్యమవుతుంది. ఇదే వారి జీవనసందేశంగా సాధకులు గ్రహించగలుగుతారు. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
మాతా శారదాదేవి
ప్రాచీన ఆదర్శాలు–ఆధునిక జీవన విధానాలను సమన్వయం చేసుకున్న సరస్వతి ఆమె. ఒకవైపు ఇంటి వ్యవహారాలు చూస్తూ, కుటుంబంలోని ఒడిదుడుకులనే తపస్సుగా స్వీకరించిన సాధారణ గృహిణి ఆమె. బడికి వెళ్ళి పాఠాలు నేర్వలేదు. పుస్తకాలు చదవలేదు. కానీ ఆమెతో మాట్లాడిన గొప్పమేధావులు సైతం ఆమె ఆధ్యాత్మిక జ్ఞానానికి అబ్బురపోయేవారు. ఆవిడే శారదాదేవి. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని. వీరిద్దరిది భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం. తామరాకుపై నీటిబొట్టులా సంసారంలో ఉంటూనే దాని ప్రభావం తమ మీద పడకుండా చూసుకున్నారు వీరిరువురూ. రామకృష్ణులను తన ఆధ్యాత్మిక పురోగతికి సాయపడే గురువుగా శారదాదేవి తలిస్తే, ఆమెను సాక్షాత్తూ కాళీమాతగా భావించేవారు రామకృష్ణులు. రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించినవారంతా శారదాదేవిని మాతృమూర్తిగా ప్రేమించారు. జగమంత కుటుంబం సాధకుడైన భర్తకు కాళీమాతలా, అతని శిష్యుకు తల్లిలా భాసించిన శారదాదేవి... మాతృమూర్తి అన్న మాటకు మరో నిర్వచనాన్ని ఇచ్చారు. తనకు పిల్లలు లేరనే లోటు లేకుండా శిష్యులనే తన సంతానంగా భావించి వారి ఆలనాపాలన చూసుకునేది శారదాదేవి.. భౌతికంగా రామకృష్ణులు దూరమయ్యాక ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న శిష్యగణానికి శారదామాత తగిన ధైర్యాన్ని అందించారు. రామకృష్ణుని శిష్యులందరికీ కొత్త ఆశగా చిగురించారు. ఎలాంటి అధ్యాత్మిక సలహాకైనా, సందేహ నివృత్తికైనా శారదాదేవి దగ్గరకి చేరేవారు వారంతా. రామకృష్ణుల సాన్నిహిత్యంతో తనకు కలిగిన యోగానుభవాలను వారికి చెబుతూ ఓపికగా వారి సందేహాలను తీర్చేది శారదాదేవి అమ్మ నోట మాటలు–ఆణిముత్యాలు ధ్యానం ఆవశ్యకతను వివరిస్తూ ‘‘క్రమం తప్పక ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి, ఇక ధ్యానంతో పనిలేని స్థితికి వస్తారు. తీవ్రమైన గాలులు మేఘాలను చిన్నాభిన్నం చేసినట్టు, భగవంతుడి నామం మనోమాలిన్యాలను తొలగిస్తుంది. అందుకే నామజపం ఒక సాధనగా అభ్యసించాలి’’ అని చెప్పేవారు. అలాగే మీకు మనశ్శాంతి కావాంటే ఎదుటివారి తప్పులు వెతకడం మానండి. మీలోని తప్పులను సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే’’. అంటూ సందేశాన్ని అందించారు. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని, వేదపండితులు, (నేడు శారదా దేవి జయంతి) -
గురువు ఇలా ఉండాలి
రామకృష్ణ పరమహంస ఒకనాడు మారేడువనం గుండా నడిచి కాళికాలయంలోకి వెళ్తున్నారు. అది అసురసంధ్య వేళ. అక్కడ ఒక బురదపాము, గోదురుకప్పను పట్టుకుంది. గోదురుకప్ప చాల పెద్దదిగా ఉంటుంది. బురదపాము నోట్లో కొద్దిపాటి విషమే ఉంది. ఆ విషానికి గోదురుకప్ప చావదు, పాము వదలదు. కప్ప బాధగా అరుస్తోంది. పరమహంస ఆ దృశ్యాన్ని చూసి కాళికాలయంలోకి వెళ్లిపోయారు. లోపల అమ్మవారికి అర్చన చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయనతోపాటు ఒక శిష్యుడు కూడా బయటికి వస్తున్నాడు. అతడు రామకృష్ణులవారిని ఉద్దేశించి.. ‘గురువు శిష్యుడిని ఎలా ఉద్ధరిస్తాడు?’ అని అడిగాడు. వెంటనే పరమహంస ఆగి.. ‘గురువు సరైనవాడు కాకపోతే శిష్యుడు ఆ బురదపాము నోట్లో కప్పలా కొట్టుకుంటాడు’ అన్నారు. ఆ పాము కప్పను పట్టుకుని రెండున్నర గంటలు అయింది. అది కప్పను వదలదు. అలాగని దానిని చంపడానికి తగిన విషం దానిదగ్గర లేదు. పోనీ మింగుదామంటే కప్ప తన నోట్లో పట్టడం లేదు. అంత పెద్దదిగా ఉంది. అదే తాచుపాము అయితే ఆ కప్ప ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. పునర్జన్మను పొంది, వేరొక జీవితాన్ని ప్రారంభించి ఉండేది. ‘‘గురువు సరి అయినవాడు కాకపోతే శిష్యుని జీవితం ఇలా ఉంటుంది’’ అని రామకృష్ణులవారు చూపించిన ఆ దృశ్యాన్ని చూసిన శిష్యునికి ఎటువంటి గురువును పట్టుకోవాలో అర్థమయిపోయింది. -
చేతులు కట్టుకుని శ్లోకాలు చెబితే చాలా!!
మానవీయం అనుష్ఠానబలంచేత జనన మరణ చక్రంనుండి విడుదల పొందడం అనేది వాసనాబలం ఉన్న మనుష్యజన్మలో మాత్రమే సాధ్యం. వాసనలలో అన్నివేళలా మంచివే ఉండవు. ఎన్ని మంచి గుణాలు ఉన్నా, ఒకొక్కదాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది. వాసన అంటే ముక్కుతో పీల్చేదికాదు, గత జన్మలనుంచి తెచ్చుకున్న వాసనలలో ఒకటి. అన్నీ ఆయనకు ప్రీతే. కానీ ధనమునందు ఆయనకు విశేషమైన అపేక్ష. అప్పుడేమవుతుంది? ఆయన తనను తాను సంస్కరించుకోకపోతే’ జ్ఞానఖలునిలోని శారదయువోలె..’... అంటే మీరక్కడ తాంబూలం పెడితే తప్ప ఆయనేదీ చెప్పడు. మీరెంతిస్తారో చెబితే తప్ప ఆయన సభకు రాడు. అంటే అమ్ముకోవడానికి అదో వస్తువయింది. తాంబూలం పుచ్చుకుంటే తప్పేంలేదు. నాకింతిస్తేనే రామాయణం చెబుతానన్నాననుకోండి. అది చాలా ప్రమాదం. రామాయణం తెలుసు. డబ్బుకోసం తప్ప, రామాయణం ధర్మంకోసం కాకుండా పోయింది. ఇలా ఒక్క వాసన, మిగిలి ఉన్న మంచి గుణాలను పాడు చేసేస్తుంది. ఇది పోవాలంటే భగవంతుడిని శరణాగతి వేడుకోవాలి. లేదా మహాపురుషుల స్పర్శచేత కూడా పోతుంది.పెద్దలతో కలిసి తిరిగితే ఆ దోషం పోతుంది. ‘ఛీ! ఛీ! నేనిలా బతక్కూడదు...’ అనే బుద్ధి ఉండిపోతుంది. రామకృష్ణ పరమహంస ఏమంటారంటే... ‘‘ఏనుగు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు తొండం ఎత్తి ఒక జాజితీగ పీకుతుంది, ఓ చెట్టుకొమ్మను పట్టుకుని విరిచేస్తుంది. అలావెడుతూ పక్కన ఒక దుకాణంలోంచి ఒక అరటిపళ్ళ గెల ఎత్తి లోపల పడేసుకుంటుంది. అదే ఏనుగు పక్కన మావటివాడు అంకుశం పట్టుకుని నడుస్తూ పోతున్నాడనుకోండి. అదిలా తొండం ఎత్తినప్పుడల్లా అంకుశం చూపగానే దించేస్తుంది తప్ప దేనినీ పాడుచేయదు. అలాగే మహాపురుషులతో కలిసి తిరిగిన సాంగత్యబలంచేత నీలో ఉన్న వాసనాబలం పాడవకుండా రక్షింపబడుతుంది’’ అంటారు. ‘‘నేను ఫలానా గురువుగారి శిష్యుణ్ణి, అయన నడవడి ఎలా ఉంటుందో, ఆయనెలా ప్రవర్తిస్తారో తెలిసి నేనిలా ప్రవర్తించొచ్చా ! నేనిలా ఉండకూడదు, మార్పు చెందాలి’’అనుకొని దుష్కర్మలకు దూరంగా ఉండిపోతారు. చెడుబాట పట్టిన వాసనాబలం మహాత్ముల సంగమం చేత విరుగుతుంది. ఇది ఇతర ప్రాణులకు ఎక్కడుంటుంది? ఉండదు. ఒక మహాత్ముడి ఇంట్లో క్కు... సంగమం చేత ఏమయినా ప్రయోజనం లభిస్తుందా? త్రివేణీ సంగమంలో మొసలి... దానికేమయినా స్నానఫలితం వస్తుందా? ఎవడు కాలుపెడతాడా లాగేద్దామని చూస్తుంటుంది. సంగమం ప్రయోజనం వాటికుండదు. ఒక్క మనుష్యప్రాణికే ఉంటుంది. తరించగలడు, వాసనాబలాన్ని పోగొట్టుకోగలడు. ఆవుదూడ నోటికి చిక్కం వేస్తారు. ఎందుకని? రుచి. మట్టి తింటుంది. మట్టి తింటే కడుపులో ఎలికపాములు పెరిగి దూడ చనిపోతుంది. అందుకే చిక్కం. రుచి, వాసన-ఈ రెండింటినీ చంపగలవాడు భగవంతుడు. ఆ పరమాత్మ పాదాలను పట్టుకుని ‘‘ఈశ్వరా ! నేను ఈ దుర్గుణాల నుంచి బయటపడలేకపోతున్నాను’’ అని త్రికరణశుద్ధిగా ఎవడు మనసువిప్పి చెప్పుకుంటాడో వాడిని ఆ దుర్గుణం నుంచి పెకైత్తుతాడు. అలా చెప్పుకోవడం శరణాగతి తప్ప ఊరికే చేతులు కట్టుకుని శ్లోకాలు చెప్పడం శరణాగతి కాదు. మనసు అప్పటికప్పుడు లొంగినట్లుంటుంది. అప్పటికప్పుడే తిరగబడుతుంటుంది. ‘‘పాసీపాయదు పుత్రమిత్రజనసంపద్భ్రాంతి వాంఛాలతల్, కోసీకోయదు నామనంబకట నీకుంబ్రీతిగా సత్క్రియల్ చేసీచేయదు దీని తృళ్ళణపడవే శ్రీకాళహస్తీశ్వరా!’’అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. పుత్రజనం, మిత్రజనం, సంపదలు వీటి పట్ల మనసు ప్రీతిని పూర్తిగా వదలడం లేదు. ఆ కోరికలను పూర్తిగా కోసివేయడం లేదు. దీన్ని త్రుళ్ళు అణచవయ్యా. దీనిని నీవే లొంగదీసుకోవయ్యా. నేను సక్రమ మార్గంలో ఉండేటట్లు చేయి’’ అని ధూర్జటి వేడుకున్నాడు. దేవాలయం దగ్గర ఆయనెవరో వచ్చారట. ఉపన్యాసం వినడానికి వెడదాం అని ఉత్సాహపడి అప్పటికి లొంగి ఉన్నట్లు కనబడే మనసే, ఆయనకేం వస్తాడు పనాపాటా... హాయిగా ఇంటికెళ్ళి టీవి చూద్దాం పద... అని అప్పటికప్పుడే తిరగబడుతుంది. తుంటరి ఏనుగును మావటి లొంగదీసుకున్నట్లే, నా వశపడని ఈ మనసును నీవే దారిలో పెట్టు భగవాన్... అంటూ అటువంటి శరణాగతి చేసి వాసనాబలంనుండి పైకి వస్తాడు అంటే ఈశ్వరుని అనుగ్రహంచేత తన దుర్గుణాలను పోగొట్టుకునేటట్టు చేసే ప్రార్థనకు శరణాగతి అని పేరు. అటువంటి శరణాగతి చేసి వాసనాబలం నుండి విముక్తిపొందుతాడు, లేదా సాధనచేత పొందుతాడు. ‘అరే, నేనెందుకు చేయాలి ఇటువంటి పని. ఎంతోమంది ఇలా చేసి పాడైపోయారు. గురువుగారు చెప్పిన ఒక్క మాట చాలు’ అనుకుని మారిపోవాలన్న ఆర్ద్రత మనసులో కలగాలి. ఒక్కసారి కలిగిందా... ఆ మార్పు వచ్చేస్తుంది. భూమిలో తడి ఉందా... అందులో వేపగింజ వేసావా, జామగింజ వేసావా, మామిడి టెంక వేసావా... సంబంధం ఉండదు. మొక్క వచ్చేస్తుంది. ఒక వేళ అది రాతినేల అనుకోండి, అందులో ఏ గింజవేసినా అంకురం రాదు. మేకు తీసుకెళ్ళి ఇనుపదూలంలో కొట్టారనుకోండి. మేకు వంగిపోతుంది తప్ప, దిగదు. అదే గోడకు గుల్లతనం ఉంటే మేకు దిగుతుంది. మనసులో ఆర్ద్రత ఉన్నప్పుడు గురువుగారి ఒక్కమాట చాలు, జీవితం మారిపోవడానికి. అందుకు భగవాన్ రమణులు అంటుంటారు. అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తుంటాయి. వాటికి ప్రాధాన్యతేం ఉంటుంది. అది అడవికాబట్టి అరుస్తాయి. సింహం వచ్చి ఒక్కసారి గర్జన చేసిందా... అంతే మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి. అన్ని జంతువులు పారిపోవడానికి సింహగర్జన ఎలా పనిచేస్తుందో, ఒక్క గురువుగారి మాట మనలోని దుర్గుణాలను పార్రదోలడానికి అలా పనికి వస్తుంది. మనలో మార్పునకు కారణం అవుతుంది. తుంటరి ఏనుగును మావటి లొంగదీసుకున్నట్లే, నా వశపడని ఈ మనసును నీవే దారిలో పెట్టు భగవాన్... అంటూ అటువంటి శరణాగతి చేసి వాసనాబలంనుండి పైకి వస్తాడు అంటే ఈశ్వరుని అనుగ్రహంచేత తన దుర్గుణాలను పోగొట్టుకునేటట్టు చేసే ప్రార్థనకు శరణాగతి అని పేరు. అటువంటి శరణాగతి చేసి వాసనాబలం నుండి విముక్తిపొందుతాడు, లేదా సాధనచేత పొందుతాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మానవతను వీడొద్దు!
సహనమే జాతీయ సమైక్యతకు పునాది: ప్రణబ్ బిర్భూమ్/సూరి: అసహనం వెల్లువలా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. సహనం, అసమ్మతికి అంగీకారం అనేవి దేశంలో అంతరించిపోతున్నాయా అని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన సోమవారం పశ్చిమబెంగాల్లోని బిర్భూమ్లో స్థానిక వారపత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘మనవతావాదం, బహుళత్వవాదాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ విడనాడరాదు. ఆహ్వానించటం ద్వారా అందరినీ కలుపుకోవటం భారత సమాజపు విశిష్టత. సమాజంలోని దుష్ట శక్తులను నిరోధించటానికి మన సమష్టి శక్తిని బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయన్న రామకృష్ణ పరమహంస బోధనలను ఈ సందర్భంగా ప్రణబ్ గుర్తుచేశారు. భారత సమాజం తన సహనం కారణంగా ఐదు వేల ఏళ్లుగా నిలిచివుందని.. జాతీయ సమైక్యతకు సహనమే పునాది అని పేర్కొన్నారు. ‘‘ఈ సమాజం ఎల్లవేళలా అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను అంగీకరించింది. పెద్ద సంఖ్యలో భాషలు, 1,600 మాండలికాలు, ఏడు మతాలు ఇండియాలో సహజీవనం చేస్తున్నాయి. ఈ భేదాలన్నిటికీ స్థానం కల్పిస్తున్న రాజ్యాంగం మనకు ఉంది’’ అని చెప్పారు.