మానవతను వీడొద్దు!
సహనమే జాతీయ సమైక్యతకు పునాది: ప్రణబ్
బిర్భూమ్/సూరి: అసహనం వెల్లువలా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. సహనం, అసమ్మతికి అంగీకారం అనేవి దేశంలో అంతరించిపోతున్నాయా అని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన సోమవారం పశ్చిమబెంగాల్‌లోని బిర్భూమ్‌లో స్థానిక వారపత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘మనవతావాదం, బహుళత్వవాదాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ విడనాడరాదు. ఆహ్వానించటం ద్వారా అందరినీ కలుపుకోవటం భారత సమాజపు విశిష్టత. సమాజంలోని దుష్ట శక్తులను నిరోధించటానికి మన సమష్టి శక్తిని బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు.
ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయన్న రామకృష్ణ పరమహంస బోధనలను ఈ సందర్భంగా ప్రణబ్ గుర్తుచేశారు. భారత సమాజం తన సహనం కారణంగా ఐదు వేల ఏళ్లుగా నిలిచివుందని.. జాతీయ సమైక్యతకు సహనమే పునాది అని పేర్కొన్నారు. ‘‘ఈ సమాజం ఎల్లవేళలా అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను అంగీకరించింది. పెద్ద సంఖ్యలో భాషలు, 1,600 మాండలికాలు, ఏడు మతాలు ఇండియాలో సహజీవనం చేస్తున్నాయి. ఈ భేదాలన్నిటికీ స్థానం కల్పిస్తున్న రాజ్యాంగం మనకు ఉంది’’ అని చెప్పారు.