
ఒక నిర్దిష్ట నాయకుని నాయకత్వంలో పార్టీ నిరంతరం ఓడిపోతుంటే, దాని గురించి ఆలోచించడం చాలా ముఖ్యమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, రచయిత శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌ల జరిగిన 17వ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2014, 2019లలో రాహుల్ గాంధీ ఘోరంగా ఓడిపోయారనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అని, దానిని ఎలా బలోపేతం చేయాలనే దానిపై కాంగ్రెస్ నేతలంతా ఆలోచించాలని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీలోని సంస్థాగత ఎన్నికలు, విధానపరమైన నిర్ణయాలు... ఇలా ప్రతి స్థాయిలోనూ అట్టడుగు స్థాయి కార్యకర్తలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నారని శర్మిష్ట పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో భిన్నమైన సిద్ధాంతాలు ఉంటాయని, ఎవరి భావజాలంతోనూ మనం ఏకీభవించకపోయినప్పటికీ, వారి భావజాలం తప్పుకాదని అర్థం చేసుకోవాలని శర్మిష్ట అన్నారు. తమ తండ్రి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు, పార్లమెంటులో ప్రతిష్టంభన సమయంలో ఇతర పార్టీ సభ్యులతో చర్చించడంలో ఆయనకున్న నేర్పు కారణంగా ఆయన ఏకాభిప్రాయ నిర్మాతగా గుర్తింపు పొందారన్నారు. ప్రజాస్వామ్యం అంటే మాట్లాడటం మాత్రమే కాదని, ఇతరుల మాట వినడం కూడా చాలా ముఖ్యమని, ప్రజాస్వామ్యంలో చర్చలు ఉండాలన్నది ప్రణబ్ ముఖర్జీ సిద్ధాంతమని షర్మిష్ట పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment