
రామకృష్ణ పరమహంస ఒకనాడు మారేడువనం గుండా నడిచి కాళికాలయంలోకి వెళ్తున్నారు. అది అసురసంధ్య వేళ. అక్కడ ఒక బురదపాము, గోదురుకప్పను పట్టుకుంది. గోదురుకప్ప చాల పెద్దదిగా ఉంటుంది. బురదపాము నోట్లో కొద్దిపాటి విషమే ఉంది. ఆ విషానికి గోదురుకప్ప చావదు, పాము వదలదు. కప్ప బాధగా అరుస్తోంది. పరమహంస ఆ దృశ్యాన్ని చూసి కాళికాలయంలోకి వెళ్లిపోయారు. లోపల అమ్మవారికి అర్చన చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయనతోపాటు ఒక శిష్యుడు కూడా బయటికి వస్తున్నాడు. అతడు రామకృష్ణులవారిని ఉద్దేశించి.. ‘గురువు శిష్యుడిని ఎలా ఉద్ధరిస్తాడు?’ అని అడిగాడు. వెంటనే పరమహంస ఆగి.. ‘గురువు సరైనవాడు కాకపోతే శిష్యుడు ఆ బురదపాము నోట్లో కప్పలా కొట్టుకుంటాడు’ అన్నారు.
ఆ పాము కప్పను పట్టుకుని రెండున్నర గంటలు అయింది. అది కప్పను వదలదు. అలాగని దానిని చంపడానికి తగిన విషం దానిదగ్గర లేదు. పోనీ మింగుదామంటే కప్ప తన నోట్లో పట్టడం లేదు. అంత పెద్దదిగా ఉంది. అదే తాచుపాము అయితే ఆ కప్ప ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. పునర్జన్మను పొంది, వేరొక జీవితాన్ని ప్రారంభించి ఉండేది. ‘‘గురువు సరి అయినవాడు కాకపోతే శిష్యుని జీవితం ఇలా ఉంటుంది’’ అని రామకృష్ణులవారు చూపించిన ఆ దృశ్యాన్ని చూసిన శిష్యునికి ఎటువంటి గురువును పట్టుకోవాలో అర్థమయిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment