ఒక రోజు బోధివనానికి వచ్చిన ఓ నడివయస్కుడు బోధిసత్త్వుని పాదపద్మాలను తాకి నమస్కరించాడు. చిరునవ్వుతో అతని వివరాలు అడిగాడాయన. ‘దేవా నా పేరు అభినందనుడు. నేను పేదవాడిని. నాకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. లౌకిక పాశాల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్నాను. మీరేదైనా పరిష్కారం చెప్పాలి. మీరే నాకు జ్ఞానమార్గం చూపాలి’ అని వేడుకున్నాడు ఆ వ్యక్తి.
బోధిసత్త్వుడు ‘అభినందనా, ఈ చెట్లకున్న ఆకులను చూడు. అవన్నీ ఎందుకు కదులుతున్నాయో తెలుసా... గాలి వచ్చి ఢీకొనడంతో కదులుతున్నాయి. పాశమనే గాలి వచ్చి ఢీకొన్నప్పుడల్లా మనిషి ఆకులా ఇలా ఊగుతాడు. మొదట నీ మనసులో ఉన్న లౌకిక పాశాలను తెంచుకో. అప్పుడే నీవు జ్ఞానమార్గంలో నడవగలవు. అది నీ వల్ల సాధ్యమేనా? అన్నాడు. సాధ్యమే అన్నాడు అభినందనుడు. అయితే ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండన్నాడు బోధిసత్త్వుడు.
అభినందనుడు అక్కడే ఉండిపోయాడు. కొద్ది రోజులు సన్యాసి జీవితం చక్కగానే గడిపాడు. క్రమంగా అతడు మళ్లీ లౌకిక బంధనాల్లోకి జారుకోవడాన్ని బోధిసత్త్వుడు గమనించాడు.
ఒక రోజు అభినందనుని పిలిచి రెండు పాత్రలు తీసుకున్నాడు. ఓ పాత్రలో రకరకాల పదార్థాలు ఉన్నాయి. మరొకటి ఖాళీ పాత్ర. పదార్థాలు ఉన్న పాత్రను నీటిలో వదిలేశాడు. అది లోపలికి మునిగిపోయింది. ఖాళీ పాత్రను నీటిలో వేశాడు. అది తేలియాడుతూ కనిపించింది. ‘బరువైన పాత్ర కనిపించకుండా పోయింది. ఖాళీ పాత్ర తేలుతోంది. ఖాళీ పాత్ర ఉంది చూశావూ, అది జ్ఞానపాత్ర. బరువైన పాత్ర ఉంది చూశావూ, అది బంధనాల పాత్ర.
నేను సన్యాసినవుతాననీ, జ్ఞానినవుతాననీ చెప్పడం సులభం. కానీ ఆచరణ కొచ్చేటప్పటికి అది చాలా కష్టం. అది అంత సులభమైన విషయం కాదు. ఆశనూ, లౌకిక పాశాలనూ వదులుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేంటో నీకు అర్థమై ఉండాలి’ అన్నాడు బోధిసత్త్వుడు. అప్పటి నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచాడు అభినందనుడు. – యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment