మేధాతిథి అనే తాపసుని పుత్రుడు చిరకారి. అతడు ఏ పనిని తొందర పడి చేయడు. చక్కగా అలోచించి చేస్తాడు. అందువలన అందరూ అతనిని చిరకారి అని పిలిచేవారు. ఒకసారి మేధాతిథికి భార్యపై బాగా కోపం వచ్చింది. కొడుకును పిలిచి ఆమెను చంపమని ఆజ్ఞాపించి అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. చిరకారి చాలా సేపు ఇలా ఆలోచించాడు..
‘తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించటం మంచిది కాదు. అలాగని తల్లిని చంపటం యుక్తం కాదు. తల్లి నెలాగైనా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల మధ్య పుత్రత్వం అనేది స్వేచ్ఛ లేనిదిగా ఉంది. నేను ఇద్దరికీ చెందినవాడను. ఈ క్లిష్ట పరిస్థితిలో వీరిద్దరిలో ఎవరిని వదులుకోవాలి? కొడుకు ఏ వయ సులో ఉన్నా తల్లి ప్రేమ, రక్షణ బాధ్యత ఒకే విధంగా ఉంటాయి. తల్లి లేకపోతే లోకం శూన్యమై పోతుంది. ఇంతటి పూజ్యురాలైన తల్లిని వధించటానికి నాకు చేతులెలా వస్తాయి?’ అనుకుంటూ చిరకారి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.
‘మాతృ దేవోభవ’ అనే సూక్తి కూడా తల్లినే ప్రథమ దైవంగా భావించమని బోధించింది. చిరకారి తండ్రి మాట కాదనలేక, తల్లిని చంపలేక కత్తి చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా, మేధాతిథిలో పశ్చా త్తాప భావన మొదలైంది. చిన్న తప్పుకు కోపించి భార్యను చంపమని కొడుకుని ఆజ్ఞాపించాను. చిరకారి ఏ పనైనా దీర్ఘంగా అలోచించి కాని చేయడు. మాతృ వధకు పూనుకోకుండా తన పేరు సార్థకం చేసుకుంటే బాగుండును అనుకుంటూ ఇంటికి వస్తాడు. చిరకారి చేతిలో ఖడ్గాన్ని వదిలి తండ్రి పాదాలకు నమస్కరించాడు. భార్య కూడా ఆయనకు నమస్కరించింది. ఆయన వారిద్దరినీ దీవించాడు. ఏ పనైనా తొందరపడక, ఆలోచించి ధీరత్వంతో చేసేవాడు సమస్త శుభాలు పొందు తాడని మేధాతిథి చెబుతాడు.
ధర్మరాజు కార్యాచరణలో అవసరమైనది బహు దీర్ఘ సమయమా? అత్యల్ప సమయమా అని భీష్ముని అడిగినప్పుడు ఆయన చిరకారి కథ చెప్పి అలా చేయమని చెబుతాడు. ఏ పనినైనా తొందరపాటుతో చేస్తే అనర్థాలు కలుగుతాయి. అలోచించి చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి అని సారాంశం. – డా. చెంగల్వ రామలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment