అహంకారమనే మూడు తలల పాము.. బ్రహ్మానందమనే నీ సొత్తును.. | An Inspiring Story Written By M Maruti Shastri Sakshi Guest Column Story | Sakshi
Sakshi News home page

అహంకారమనే మూడు తలల పాము.. బ్రహ్మానందమనే నీ సొత్తును..

Published Tue, Jul 30 2024 9:53 AM | Last Updated on Tue, Jul 30 2024 10:26 AM

An Inspiring Story Written By M Maruti Shastri Sakshi Guest Column Story

‘గురువర్యా! మీరు అవధిలేని ఆనందం నాలోనే ఉందంటారు. అది నా స్వభావమూ, సొత్తూ అంటారు. కానీ నేను మాత్రం దాన్ని అనుభవించలేక పోతున్నాను. ఏం చేయాలి?’ ‘శిష్యా! ముందు, అలా అనుభవించలేక పోవడానికి కారణమేమిటో తెలుసుకోవాలి. నిత్య, శుద్ధ, బుద్ధ, చైతన్య స్వరూపుడివైన నీకు, ఈ దేహం ఇంద్రియ–మనో–బుద్ధు లతో సంబంధం ఏర్పడి, ఆ శరీరాదులే నేను అనే తాదాత్మ్యతా, భ్రమా ఏర్పడ్డాయి. ఇలా నిన్ను ‘నేను–నాది’ అన్న పరిమితులలో బంధిస్తున్నది ‘అహంకారం’ అనే అజ్ఞానం. అది ఆనందమయ మైన నీ స్వస్వరూపాన్ని కప్పేస్తున్నది.’

‘మరేం చేయాలి?’
‘నీ దగ్గర పెద్ద పెట్టెలో నీ సొంత ధనరాశులు బోలెడున్నాయి. ఒక రోజు తెల్లారి చూసేసరికి, ఒక కాల సర్పం ఆ పెట్టెను చుట్టుకొని విషం చిమ్ముతూ, బుసలు కొడుతున్నది. అప్పుడు నువ్వేం చేయాలి? నిరుపేదనయి పోయానని బిచ్చమెత్తుకుంటూ ఊరంతా తిరుగుతావా? లేక, ఏదో ఒక విధంగా ఆ సర్పాన్ని చంపి నీ సొమ్ము స్వాధీనం చేసుకోవాలా?’

‘ఏదో ఒక ఉపాయంతో సర్పాన్ని చంపడమే తెలివి.’ ‘అదీ విషయం! అహంకారం అనే మూడు తలల పాము, బ్రహ్మానందమనే నీ సొత్తును చుట్టుకొని కూర్చొని ఉంది. దాన్ని వేదాంత జ్ఞానం అనే ఖడ్గంతో నరికివేసి, నీ సొత్తు నువ్వు అనుభవించడం వివేకం!’
‘కానీ ఆ సర్పాన్ని నరకగల సామర్థ్యం నాకెలా వస్తుంది?’

‘చాలాసార్లు చెప్పాను. అది అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా అబ్బుతుంది. ఇంద్రియాలకు నువ్వు లొంగకుండా, వాటిని నువ్వే అదుపు చేసుకొని, ఇంద్రియ సుఖాలవల్ల లాభం స్వల్పం, క్షణికం; నష్టమే అపారం’ అని గ్రహించి, వాటిపట్ల అనాసక్తి పెంచుకోవడం వైరాగ్యం. ఈ నశ్వరమైన దేహాది జడ విషయాలు నీవు కాదనీ, నీవు చైతన్య స్వరూపు డివనీ, శాశ్వతుడివనీ, పరిమితులు లేని సర్వవ్యాపివనే సత్యాన్ని మననం చేస్తూ, ఆ సత్యం మీదే ఏకాగ్రత నిలిపే ప్రయత్నం అభ్యాసం.’ – ఎం. మారుతి శాస్త్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement