
పుట్టెడు కష్టం వచ్చి శోకసంతాపాల్లో మునిగి ఉన్న వ్యక్తిని, ‘ఊరుకో, దుఃఖించకు!’ అంటే ఊరుకోడు. ఊరుకోలేడు. అనుకోకుండా తీవ్రమైన కష్టాలు ఎదురయినప్పడు మనిషికి సంతాపం, దిగులు, దుఃఖం కలగటం మామూలు విషయమే. కొన్ని పరిమితులలో ఉన్నవరకూ అది మానసిక ఆరోగ్యానికి మంచిది కూడా!
అయితే ఘడియకో, గంటకో, రోజుకో, వారానికో ఎలాగోలా దాన్ని అధిగమించాలి. బాధే సౌఖ్యమనే భావన పట్టుకొని, శోకపు ఊబి నుంచి బయటపడే ప్రయాస చేయని దేవదాసు మనసు మీదా, జీవితం మీదా అదుపు కోల్పోయి మరింత శోకం కొని తెచ్చుకొన్నవాడయ్యాడు. సఫల జీవనం కోరేవాడికి సంతోషం సగం బలం. సంతాపం సగం చేటు.
సందర్భానికి సరిపడని నవ్వులాగా, దీర్ఘకాలం కొనసాగే సంతాపం కూడా నాలుగందాల చేటు అంటుంది మహాభారతం. ‘సంతాపాత్ భ్రశ్యతే రూపం, సంతాపాత్ భ్రశ్యతే బలమ్’... దీర్ఘ శోకం వల్ల శరీరం చిక్కి, ముఖం నిస్తేజమై, ఆకారం వికారమవుతుంది. సంతాపం వల్ల బలం– అటు మనోబలమూ, ఇటు శరీర బలమూ– క్షీణించటం జరుగుతుంది. ‘సంతాపాత్ భ్రశ్యతే జ్ఞానం, సంతాపాత్ వ్యాధిం బుచ్ఛతి’... దుఃఖం వల్ల వివేచనా, జ్ఞానమూ సన్నగిల్లుతాయి. మితిమీరిన సంతాపం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
శోకించటం వల్ల, కోల్పోయింది తిరిగిరాదు. తిరిగి రావాలంటే కావాల్సింది ప్రయాస. ఆ ప్రయాసకు శోకం ప్రతిబంధకం. శోకం వల్ల, శోకించేవాడికి లాభం శూన్యం. అతడి శత్రువులకు మాత్రం అతడి శోకం ఆనందాన్నిస్తుంది అంటాడు విదురుడు. – ఎం. మారుతి శాస్త్రి
ఇవి చదవండి: సంగీతానికి ఆ శక్తి ఉందా?
Comments
Please login to add a commentAdd a comment