m maruthi shasthri
-
‘శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే అర్థినామ్...’ అనే మంగళ శ్లోకం?
‘శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే అర్థినామ్...’ అనే మంగళ శ్లోకం, వైష్ణవాలయాల్లో, వైష్ణవుల నిత్య పూజల్లో దేశ విదేశాలలో ప్రతిరోజూ కొన్ని లక్షలసార్లు వినబడుతుంది. శ్రియః కాంతాయ (శ్రీదేవి వల్లభుడైన స్వామికి), కల్యాణ నిధయే (సమస్త కల్యాణ గుణాలకూ నెలవైన స్వామికి), నిధయే అర్థినామ్ (ప్రార్థ నలు చేసే అర్థి జనానికి పెన్నిధి అయిన స్వామికి), శ్రీ వేంకటనివాసాయ (శ్రీ వేంకటాద్రి నివాసుడికి), శ్రీనివాసాయ (లక్ష్మీ నివాసు డైన స్వామికి) మంగళమ్ (మంగళమగుగాక)! వేంకటేశ్వర సుప్ర భాతంతో పాటు రోజూ వినిపించే మంగళ ఆశాసన శ్లోకాల్లో ప్రప్ర థమ శ్లోకం ఇది. ఈ మంగళాశాసన శ్లోకాలు రచించిన ధన్యుడు 14వ శతాబ్దంలో జీవించిన ప్రతివాది భయంకర అన్నంగరాచార్యు లవారు అనే విద్వన్మణి. మనోహరమైన భావా లను, మధురమైన పదాలతో పొదిగి చెప్పే ఈ శ్లోకాలు ఆస్తికులకు సుపరిచితాలు.ఒక శ్లోకం... లక్ష్మీ– సవిభ్రమ – ఆలోక – సుభ్రూ విభ్రమ – చక్షుషే (లక్ష్మీదేవిని సంభ్ర మంతో కుతూహలోత్సాహాలతో రెప్పలారుస్తూ చూస్తున్నప్పుడు ముచ్చట గొలిపే కనుబొమల కదలికలు కలిగిన వాడినిగా వేంకటేశ్వరుడిని వర్ణిస్తే; మరొక శ్లోకం... సర్వావయవ సౌందర్య/ సంపదా, సర్వచేతసామ్/ సదా సమ్మోహనాయ (సకల అవయవ సౌందర్య సంపద చేత, సర్వ ప్రాణులకూ సదా సమ్మో హనకారుడు)గా ఆయనను అభివర్ణిస్తుంది. శ్రీ వేంకటాద్రి శృంగ అగ్రానికి మంగళకరమైన శిరోభూషణంగా నిలిచిన స్వామిని మరొక శ్లోకం కొనియాడింది.వైకుంఠం మీద విరక్తి కలిగి, తిరుమల క్షేత్రంలో స్వామి పుష్క రిణి తీరంలో స్వామి, లక్ష్మీదేవితో విహరిస్తున్నాడని ఒక శ్లోకం చమ త్కరిస్తే, భక్త పురుషులకు తన పాదాల శరణ్యత్వాన్ని, స్వామి స్వయంగా తన దక్షిణ హస్తం ద్వారా చూపుతున్నాడని మరొక శ్లోకం ఉత్ప్రేక్షిస్తుంది. ఈ మంగళాశాసన శ్లోకాల విశేష ప్రాచుర్యా నికి వాటి అసాధారణ సౌందర్యమే కారణం. – ఎం. మారుతి శాస్త్రి -
అహంకారమనే మూడు తలల పాము.. బ్రహ్మానందమనే నీ సొత్తును..
‘గురువర్యా! మీరు అవధిలేని ఆనందం నాలోనే ఉందంటారు. అది నా స్వభావమూ, సొత్తూ అంటారు. కానీ నేను మాత్రం దాన్ని అనుభవించలేక పోతున్నాను. ఏం చేయాలి?’ ‘శిష్యా! ముందు, అలా అనుభవించలేక పోవడానికి కారణమేమిటో తెలుసుకోవాలి. నిత్య, శుద్ధ, బుద్ధ, చైతన్య స్వరూపుడివైన నీకు, ఈ దేహం ఇంద్రియ–మనో–బుద్ధు లతో సంబంధం ఏర్పడి, ఆ శరీరాదులే నేను అనే తాదాత్మ్యతా, భ్రమా ఏర్పడ్డాయి. ఇలా నిన్ను ‘నేను–నాది’ అన్న పరిమితులలో బంధిస్తున్నది ‘అహంకారం’ అనే అజ్ఞానం. అది ఆనందమయ మైన నీ స్వస్వరూపాన్ని కప్పేస్తున్నది.’‘మరేం చేయాలి?’‘నీ దగ్గర పెద్ద పెట్టెలో నీ సొంత ధనరాశులు బోలెడున్నాయి. ఒక రోజు తెల్లారి చూసేసరికి, ఒక కాల సర్పం ఆ పెట్టెను చుట్టుకొని విషం చిమ్ముతూ, బుసలు కొడుతున్నది. అప్పుడు నువ్వేం చేయాలి? నిరుపేదనయి పోయానని బిచ్చమెత్తుకుంటూ ఊరంతా తిరుగుతావా? లేక, ఏదో ఒక విధంగా ఆ సర్పాన్ని చంపి నీ సొమ్ము స్వాధీనం చేసుకోవాలా?’‘ఏదో ఒక ఉపాయంతో సర్పాన్ని చంపడమే తెలివి.’ ‘అదీ విషయం! అహంకారం అనే మూడు తలల పాము, బ్రహ్మానందమనే నీ సొత్తును చుట్టుకొని కూర్చొని ఉంది. దాన్ని వేదాంత జ్ఞానం అనే ఖడ్గంతో నరికివేసి, నీ సొత్తు నువ్వు అనుభవించడం వివేకం!’‘కానీ ఆ సర్పాన్ని నరకగల సామర్థ్యం నాకెలా వస్తుంది?’‘చాలాసార్లు చెప్పాను. అది అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా అబ్బుతుంది. ఇంద్రియాలకు నువ్వు లొంగకుండా, వాటిని నువ్వే అదుపు చేసుకొని, ఇంద్రియ సుఖాలవల్ల లాభం స్వల్పం, క్షణికం; నష్టమే అపారం’ అని గ్రహించి, వాటిపట్ల అనాసక్తి పెంచుకోవడం వైరాగ్యం. ఈ నశ్వరమైన దేహాది జడ విషయాలు నీవు కాదనీ, నీవు చైతన్య స్వరూపు డివనీ, శాశ్వతుడివనీ, పరిమితులు లేని సర్వవ్యాపివనే సత్యాన్ని మననం చేస్తూ, ఆ సత్యం మీదే ఏకాగ్రత నిలిపే ప్రయత్నం అభ్యాసం.’ – ఎం. మారుతి శాస్త్రి -
'ఉపవాసం' అంటే.. అసలు అర్థమేంటో తెలుసా!?
ఉపవాసం అంటే పస్తు ఉండటం, నిరాహారంగా ఉండటం అని వాడుక. కానీ ‘ఉప–వాసం’ అనే పదబంధానికి ఆహారంతో సంబంధం కనిపించదు. ‘ఉప’ అంటే ‘సమీపం’, ‘వాసం’ అంటే ‘నివాసం’. కాబట్టి ‘ఉపవాసం’ అంటే దగ్గరగా ఉండటం. దేనికి దగ్గరగా ఉండటం? ఉపవాసం చేసే సాధకుడు దేనికి దగ్గరగా ఉండాలనుకొంటున్నాడో దానికి!ఉదాహరణకు, ఒక భక్తుడు కొంత సమయం పాటు, ఎప్పటికంటే ఎక్కువగా, మనో–వాక్–కాయ–కర్మల ద్వారా తన ఇష్ట దైవానికి సన్నిహితంగా ఉండాలని సాధన చేస్తే, అది ఉపవాస సాధన అవుతుంది. శరీరాన్ని వీలయినంత ఎక్కువ సమయం భగవన్మూర్తికి దగ్గరగా ఉంచుతూ, ఇతర లౌకిక విషయాలకు దూరంగా ఉంచటం శారీరకమైన ఉపవాసం.వాక్కును కొంతకాలం పాటు భగవత్ స్తోత్రాలకూ, భగవద్వి షయమైన చర్చలకూ పరిమితం చేయటం వాక్కుపరమైన ‘ఉపవాసం’. మనసును ఆహార విహారాల లాంటి ఇంద్రియ విషయాల మీదనుంచి కొంతసేపు మళ్ళించి, దైవం మీద నిలిపి ఉంచటం మానసికమైన ఉపవాసం. అలాగే లౌకికమైన పనులకు కొంతకాలం సెలవిచ్చి, ఆ సమ యాన్ని పూజలకూ, ఆరాధనలకూ, అభిషేకాలకూ, వ్రతాలకూ వెచ్చించడం... కర్మల పరంగా దైవానికి సమీపంగా ఉండే ‘ఉపవాసం’.ఈ దేహమూ, ఇంద్రియాలూ, మనస్సు– ఇవే ‘నేను’ అన్న మిధ్యా భావనలో మునిగిపోయి, వీటికి అతీతంగా వెలుగుతుండే ఆత్మజ్యోతి తన అసలు రూపం అని మరిచిపోయిన జీవుడు, కొంతకాలం పాటన్నా దేహేంద్రియ వ్యవహారాలకు దూరంగా, తన స్వ స్వరూపానికి దగ్గరగా వెళ్ళి దానిని గుర్తించేందుకు చేసే సాధన ‘ఉపవాసం’ అని వేదాంతులు వివరణ ఇచ్చారు.మామూలుగా రోజూ తినే ఆహారం మీద నుంచి దృష్టి మళ్ళించేసి, ఒక్కపూట మరేదయినా ఆహారం పుచ్చుకొంటే ఇహానికీ పరానికీ మంచిదన్న భావనతో, దాని మీద దృష్టి పెట్టడం కూడా ‘ఉపవాసమే’. కానీ అది మనో వాక్ కాయ కర్మలన్నిటి ద్వారా, ఆ కొత్త ఆహారానికి ‘సమీపంగా ఉండటం’ మాత్రమే అవుతుంది. – ఎం. మారుతి శాస్త్రి -
అక్కర్లేని వెంపర్లాట!
ప్రాచీన కాలాన్నీ, ప్రస్తుత కాలాన్నీ పోల్చి చూస్తే, ప్రజల జీవన శైలిలో కనబడే ఒక ముఖ్యమైన వ్యత్యాసం నిరాడంబరత. పాత కాలంలో పెద్దలు నిరాడంబరంగా జీవించమని బోధించేవాళ్ళు. శుకమహర్షి నాటి నుంచీ, రమణ మహర్షి నాటి వరకూ తక్కువ అవసరాలతో, వనరులతో జీవనం సాగించే యోగులనూ, త్యాగులనూ సామాజికులు ఎక్కువ గౌరవించేవాళ్ళు. బాహ్యమైన పటాటోపాలనూ, ఆర్భాటాలనూ, వాక్– ఆభరణ – వస్త్రాడంబరాలను వదివేసి, అంతర్ముఖులై ఆత్మనిగ్రహంలో జీవించే వాళ్ళను ఆదర్శప్రాయులుగా భావించేవాళ్ళు.క్రమంగా ఇది తలకిందులవుతున్నట్టు కనిపిస్తుంది. ఇరవయ్యొకటో శతాబ్దంలో ఎక్కడ చూసినా ఆడంబరాల వెంపర్లాటే! వాడుకకు పనికి రాని పాతిక లక్షల రూపాయల చేతి సంచీలు కొని ధరించేవాళ్ళు ఆదర్శం. సమయం సూచించని యాభై లక్షల రూపాయల చేతి గడియారం ధరించడం మహనీయతకు చిహ్నం.కోట్ల రూపాయలు విలువ చేసే కార్లలో తిరిగే వాళ్ళను మించిన ఘనులు, వ్యక్తిగతమైన పుష్పక విమానాలలో తిరిగే ఆచంట మల్లన్నలు. బిడ్డ వివాహం నాలుగయిదు దశలుగా చేసి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం శ్రేష్ఠత్వానికి లక్షణం. ఎవరి పిచ్చి వారికి ఆనందమని సమర్థించవచ్చు కానీ, సామాన్య దృష్టికి ఇది కేవలం వెర్రితనంగా, ధనోన్మాదంగా కనిపిస్తుంది.ఈ ఆడంబర ప్రియత్వం మునుపు లేదని కూడా అనలేం. కానీ ఇటీవలి దశకాలలో ఇది మరింత వెర్రితలలు వేస్తున్నదనటం నిర్వివాదం. సమాజంలో కూడా ఈ ‘అతి’ని గర్హించే ధోరణికంటే, ఎవరికి చేతయినంత వరకు వాళ్ళు ఈ ఆడంబరాలను అనుకరించడమే జీవిత లక్ష్యమని నమ్మే భావజాలం బలపడుతున్నట్టు కనిపిస్తుంది.ఆడంబరాల మీద వ్యామోహం తీరని దాహం అని తెలిసీ దాని వెంట పరుగెత్తడం ఒక వ్యసనం లాంటిదే. దానివల్ల కలిగే కష్టనష్టాలు కూడా అందరూ ఎరిగినదే. ఎరిగి కూడా ఈ ఆడంబరాల మీది నుంచి దృష్టి మళ్ళించకపోతే ఇహపరాలలో ఉభయభ్రష్టత్వం మిగులుతుందేమో శ్రద్ధగా తర్కించుకోవడం శ్రేయస్కరం. – ఎం. మారుతి శాస్త్రిఇవి చదవండి: ఏది వాస్తవ చరిత్ర? -
సంతాపం.. సగం చేటు!
పుట్టెడు కష్టం వచ్చి శోకసంతాపాల్లో మునిగి ఉన్న వ్యక్తిని, ‘ఊరుకో, దుఃఖించకు!’ అంటే ఊరుకోడు. ఊరుకోలేడు. అనుకోకుండా తీవ్రమైన కష్టాలు ఎదురయినప్పడు మనిషికి సంతాపం, దిగులు, దుఃఖం కలగటం మామూలు విషయమే. కొన్ని పరిమితులలో ఉన్నవరకూ అది మానసిక ఆరోగ్యానికి మంచిది కూడా!అయితే ఘడియకో, గంటకో, రోజుకో, వారానికో ఎలాగోలా దాన్ని అధిగమించాలి. బాధే సౌఖ్యమనే భావన పట్టుకొని, శోకపు ఊబి నుంచి బయటపడే ప్రయాస చేయని దేవదాసు మనసు మీదా, జీవితం మీదా అదుపు కోల్పోయి మరింత శోకం కొని తెచ్చుకొన్నవాడయ్యాడు. సఫల జీవనం కోరేవాడికి సంతోషం సగం బలం. సంతాపం సగం చేటు.సందర్భానికి సరిపడని నవ్వులాగా, దీర్ఘకాలం కొనసాగే సంతాపం కూడా నాలుగందాల చేటు అంటుంది మహాభారతం. ‘సంతాపాత్ భ్రశ్యతే రూపం, సంతాపాత్ భ్రశ్యతే బలమ్’... దీర్ఘ శోకం వల్ల శరీరం చిక్కి, ముఖం నిస్తేజమై, ఆకారం వికారమవుతుంది. సంతాపం వల్ల బలం– అటు మనోబలమూ, ఇటు శరీర బలమూ– క్షీణించటం జరుగుతుంది. ‘సంతాపాత్ భ్రశ్యతే జ్ఞానం, సంతాపాత్ వ్యాధిం బుచ్ఛతి’... దుఃఖం వల్ల వివేచనా, జ్ఞానమూ సన్నగిల్లుతాయి. మితిమీరిన సంతాపం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.శోకించటం వల్ల, కోల్పోయింది తిరిగిరాదు. తిరిగి రావాలంటే కావాల్సింది ప్రయాస. ఆ ప్రయాసకు శోకం ప్రతిబంధకం. శోకం వల్ల, శోకించేవాడికి లాభం శూన్యం. అతడి శత్రువులకు మాత్రం అతడి శోకం ఆనందాన్నిస్తుంది అంటాడు విదురుడు. – ఎం. మారుతి శాస్త్రిఇవి చదవండి: సంగీతానికి ఆ శక్తి ఉందా? -
పొద్దు పోతున్నది...
‘పొద్దు పోయెనే శ్రీరాముని పూని భజింపవే మనసా!’ అని దిగులు పడతారు త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో..‘నిద్దుర చేత కొన్నాళ్ళు,విషయ బుద్ధుల చేత కొన్నాళ్ళు’ అంటూ... జీవితంలో మూడోవంతు కాలం నిద్రలోనూ; ఇంద్రియ విషయాల మీదా, సుఖాల మీదా ఉన్న ఆరాటం తీర్చుకునే ప్రయత్నంలో మరింత కాలం వ్యయమై పోతుండె! అని వాపోయారు."పొద్దున లేచి, త్రితాపములను, నరులపొగడి, పొగడి కొన్నాళ్ళు, వట్టి ఎద్దు రీతి, కన్నతావుల భుజియించి,ఏమి తెలియక కొన్నాళ్ళు, ముద్దుగ తోచు భవసాగరమునమునిగి లేచుచు కొన్నాళ్లు, పద్దుమాలిన పామర జనులతో వెర్రిపలుకులాడుచు కొన్నాళ్ళు, ఓ మనసా!"ఉదయం లేచినప్పట్నుంచి, తాపత్రయ పడుతూ, వాళ్ళకూ వీళ్ళకూ భజన చేస్తూ, కేవలం పశువులా ఎక్కడ ఏది కనిపిస్తే దాన్నంతా భుజిస్తూ, పైపై మెరుగులతో ఆకర్షించే సంసార సాగరంలో మునకలు వేస్తూ ఉండటంలోనూ, సాటి అజ్ఞానులతో సారహీనమైన పోచికోలు చర్చలలోనూ చాలాకాలం నష్టమై పోతుండె!"ముదమున ధన, తనయ, ఆగారముల చూచిమదము చేత కొన్నాళ్ళు, అందు, చెదిరినంత, శోకార్ణవగతుడైజాలి చెందుటయు కొన్నాళ్ళు, ఎదటి పచ్చ చూచి తాళలేక, తానిలను తిరుగుట కొన్నాళ్ళు, ముదిమది తప్పిన ముసలితనమునముందు వెనక తెలియక కొన్నాళ్ళు."కొన్నాళ్ళు ధనమూ, సంతానమూ, ఇల్లూ అనుకుంటూ, వాటిని చూసి మదించటంలో గడిచె. అవి బెడిసికొడితే, మళ్ళీ దుఃఖంలో మునిగి, దైన్యతలో కొన్నాళ్ళు. ఎదుటివాడు పచ్చగా ఉంటే, ఏడుస్తూ కొన్నాళ్ళు. పెద్ద వయసు మీదపడేసరికి, బుద్ధి పనిచేయని స్థితిలో కొన్నాళ్ళు... మొత్తం మీద, బాగుగ నామ కీర్తనములు సేయుటే, భాగ్యమని అనక త్యాగరాజ నుతుడైన శ్రీరాముని తత్త్వము తెలియక కొన్నాళ్ళు. ఎంతో పొద్దు గడిచింది. గమనించుకొని, పొద్దు కొంతయినా మిగిలి ఉండగానే, కోదండ రాముడి మీద మనసు పెట్టి భజించకపోతే, జన్మ వ్యర్థం అని నాదబ్రహ్మ హెచ్చరిక. – ఎం. మారుతి శాస్త్రి -
భీష్ముని జీవితం ఆదర్శప్రాయం
అసలే ఉత్తరాయణం. అందునా పరమ పవిత్రమైన మాఘ మాసం. తత్రాపి, శ్రీమన్నారాయణుడికి ప్రీతి కరమైన శుక్ల ఏకాదశి తిథి. ఫిబ్రవరి 18, గురువారం, భీష్మ ఏకాదశి. విష్ణు పూజకు అత్యంత అనుకూలమైన పవిత్ర పర్వదినం. భీష్ముడు పాండవ, కౌరవులకు పితామహుడు. యావజ్జీవం తన యావచ్ఛక్తినీ వినియోగించి కురు సామ్రాజ్యాన్ని సంరక్షించిన మహాయోధుడు మాత్రమే కాదు. గొప్ప హరి భక్తుడు. పుట్టిన క్షణం నుంచీ రణ రంగంలో ప్రాణత్యాగం చేసే వరకూ, ఏ ధర్మ విరుద్ధమైన పనీ చేసి ఎరుగని, మచ్చలేని మనీషి భీష్ముడు. ఆయన ఏ అధర్మమైనా చేసినట్టు కనిపిస్తే, అది చూపు దోషమని సోపపత్తికంగా చూపవచ్చు. సకల పాప ప్రక్షాళన క్షమ గల గంగా నదికి స్వయానా పుత్రుడూ, అష్ట వసువులలో ఒకరి అవతార మైన దివ్య పురుషుడూ అధర్మం ఎలా చేస్తాడు? గంగమ్మ తల్లి ఆయనను బృహస్పతి, శుక్రాచార్యుడు, పరశురాముడు వంటి అసమాన ప్రజ్ఞాశాలులైన ఆచార్యుల దగ్గర సర్వ శాస్త్రాలలోను సుశిక్షితుడిని చేసిన తరువాతే తెచ్చి తండ్రి శంతనుడికి అప్పగించింది. ఆయనను మించిన ధర్మజ్ఞుడూ, ధర్మాచరణ తత్పరుడూ లేడని ధర్మరాజు, శ్రీకృష్ణులు గౌరవించిన భీష్మాచార్యుడు ధర్మయోగి. భీష్ముని పుట్టుక అద్భుతం. ఆయన జీవితం మహాద్భుతం, నిర్యాణం అంతకంటే అద్భుతం. పితృ భక్తితో ఆయన చేసిన యావజ్జీవ బ్రహ్మచర్యాచరణ అనే భీష్మ ప్రతిజ్ఞ న భూతో న భవిష్యతి. చతుర్దశ భువనాల సార్వ భౌమత్వమైనా, ఈ ఆదర్శవంతుడికి కర్తవ్యపాలన ముందు గరికపోచతో సమానం. తనకు ఏ మాత్రమూ ఇష్టం లేని యుద్ధంలో, తను అధర్మపక్షమని భావించే కౌరవుల పక్షాన, తాను ఎంతగానో అభిమానించే పాండు పుత్రులకు విరుద్ధంగా, అపజయం నిశ్చయం అని తెలిసీ, తన యావచ్ఛక్తినీ ఉపయోగించి పాల్గొని, అజేయుడైనా ధర్మబద్ధుడై నేలకొరిగిన ఈ కర్తవ్య పరాయణుడి జీవితచరిత్రలో ప్రతి ఘట్టమూ రోమాంచాన్ని కలిగించేదే. బాణాలతో శరీరమంతా తూట్లు పడి, అంపశయ్య మీద పరలోక ప్రయాణానికి అనువైన పుణ్య తిథి కోసం ప్రతీక్షిస్తూ ఆయన ధర్మరాజుకు చేసిన సమగ్ర ధర్మ బోధ అసదృశమైంది. ‘విష్ణు సహస్ర నామ స్తోత్రం’ ఆయన మానవాళికి అందించిన మహిమాన్వితమైన మహా మంత్రం. ఆయనను ప్రహ్లాద, నారద, పరాశర పుండరీకాది పరమ భాగవతుల శ్రేణిలో నిలపడానికి ఆ ఒక్కటీ చాలు. భీష్ముడు ప్రాణ ప్రయాణ సమయంలో కూడా, శ్రీకృష్ణుడిని తనివి తీరా స్తుతించి, ఆయన సమక్షంలోనే, ఆయన అనుమతితోనే శరీర త్యాగం చేసే ఉదాత్తమైన ఘట్టం. భీష్మ ఏకాదశి పర్వదినాన ఆ ఆదర్శ ప్రాయుడినీ, స్ఫూర్తి ప్రదాతనూ, ధర్మయోగినీ మనసారా స్మరించుకొని, భాగవతంలో భీష్ముడు చేసే శ్రీకృష్ణ స్తుతినీ, భారతంలో భీష్ముడు బోధించిన విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించుకోవటం భక్తులకు అవశ్య కర్తవ్యం. - ఎం. మారుతిశాస్త్రి