ప్రాచీన కాలాన్నీ, ప్రస్తుత కాలాన్నీ పోల్చి చూస్తే, ప్రజల జీవన శైలిలో కనబడే ఒక ముఖ్యమైన వ్యత్యాసం నిరాడంబరత. పాత కాలంలో పెద్దలు నిరాడంబరంగా జీవించమని బోధించేవాళ్ళు. శుకమహర్షి నాటి నుంచీ, రమణ మహర్షి నాటి వరకూ తక్కువ అవసరాలతో, వనరులతో జీవనం సాగించే యోగులనూ, త్యాగులనూ సామాజికులు ఎక్కువ గౌరవించేవాళ్ళు. బాహ్యమైన పటాటోపాలనూ, ఆర్భాటాలనూ, వాక్– ఆభరణ – వస్త్రాడంబరాలను వదివేసి, అంతర్ముఖులై ఆత్మనిగ్రహంలో జీవించే వాళ్ళను ఆదర్శప్రాయులుగా భావించేవాళ్ళు.
క్రమంగా ఇది తలకిందులవుతున్నట్టు కనిపిస్తుంది. ఇరవయ్యొకటో శతాబ్దంలో ఎక్కడ చూసినా ఆడంబరాల వెంపర్లాటే! వాడుకకు పనికి రాని పాతిక లక్షల రూపాయల చేతి సంచీలు కొని ధరించేవాళ్ళు ఆదర్శం. సమయం సూచించని యాభై లక్షల రూపాయల చేతి గడియారం ధరించడం మహనీయతకు చిహ్నం.
కోట్ల రూపాయలు విలువ చేసే కార్లలో తిరిగే వాళ్ళను మించిన ఘనులు, వ్యక్తిగతమైన పుష్పక విమానాలలో తిరిగే ఆచంట మల్లన్నలు. బిడ్డ వివాహం నాలుగయిదు దశలుగా చేసి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం శ్రేష్ఠత్వానికి లక్షణం. ఎవరి పిచ్చి వారికి ఆనందమని సమర్థించవచ్చు కానీ, సామాన్య దృష్టికి ఇది కేవలం వెర్రితనంగా, ధనోన్మాదంగా కనిపిస్తుంది.
ఈ ఆడంబర ప్రియత్వం మునుపు లేదని కూడా అనలేం. కానీ ఇటీవలి దశకాలలో ఇది మరింత వెర్రితలలు వేస్తున్నదనటం నిర్వివాదం. సమాజంలో కూడా ఈ ‘అతి’ని గర్హించే ధోరణికంటే, ఎవరికి చేతయినంత వరకు వాళ్ళు ఈ ఆడంబరాలను అనుకరించడమే జీవిత లక్ష్యమని నమ్మే భావజాలం బలపడుతున్నట్టు కనిపిస్తుంది.
ఆడంబరాల మీద వ్యామోహం తీరని దాహం అని తెలిసీ దాని వెంట పరుగెత్తడం ఒక వ్యసనం లాంటిదే. దానివల్ల కలిగే కష్టనష్టాలు కూడా అందరూ ఎరిగినదే. ఎరిగి కూడా ఈ ఆడంబరాల మీది నుంచి దృష్టి మళ్ళించకపోతే ఇహపరాలలో ఉభయభ్రష్టత్వం మిగులుతుందేమో శ్రద్ధగా తర్కించుకోవడం శ్రేయస్కరం. – ఎం. మారుతి శాస్త్రి
ఇవి చదవండి: ఏది వాస్తవ చరిత్ర?
Comments
Please login to add a commentAdd a comment