స్వజనులకు అక్షర భిక్ష : సిడాం మారూమాస్టారు గురించి తెలుసా? | Interesting Facts About Sidam Maru Master On Death Anniversary | Sakshi
Sakshi News home page

స్వజనులకు అక్షర భిక్ష : సిడాం మారూమాస్టారు గురించి తెలుసా?

Published Thu, Mar 6 2025 12:04 PM | Last Updated on Thu, Mar 6 2025 12:17 PM

Interesting Facts About Sidam Maru Master On Death Anniversary

తాను వెలుగుతూ చుట్టూరా కమ్మిన చీకట్లను తరిమేయడమే దీపం సుగుణం. అలాంటివారే మారూ మాస్టారు. ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి అవసరమైన చైతన్యాన్ని వారిలో నింపారు.  1925 ఫిబ్రవరిలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తిర్యాని మండలంలోని గడల్‌ పల్లి ఏజెన్సీ గూడెంలో జన్మించిన సిడాం మారూ 1962లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తొలి ఆదివాసీ. రాజ్‌ గోండ్‌ తెగకు చెందిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని తమ జాతిలో వెనుక బాటుతనాన్ని పోగొట్టాలంటే కనీస అక్షర జ్ఞానం నింపాలని భావించారు. దీనికి తోడు అప్పటి నైజాం ప్రభుత్వంలో గిరిజన జాతులపై పరిశ ధన చేస్తున్న ఆంత్రొపాలజిస్ట్‌ ప్రొ.హైమండార్ఫ్‌ ప్రోత్సహించడంతో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు. 

చదవండి: మొబైల్‌భూ వాస్తవాల విస్మరణే ప్రమాదానికి కారణం 

బాహ్య ప్రపంచమే తెలియని అదిమ తెగలైన రాజ్‌ గోండ్, పర్దాన్, నాయకపోడు, తోటి, కోయ గిరిజను లను చేరదీసి మాతృభాషలో బోధించేవారు. 1940లో నిజాం సాయుధ దళాలతో జరిగిన జోడె ఘాట్‌ పోరాటంలో క్షత గాత్రులైన తమ వారిని దాచిపెట్టి, అవసరమైన సపర్యలు చేసిన మానవీయుడు, దయా మయుడు. 1983లో ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ పొందిన మారూ మాస్టారు వెనువెంటనే ఉట్నూరులోని సమగ్ర గిరిజనా భివృద్ధి సంస్థ (ఐటీడీఏ) తరఫున ఆదివాసీ అభివృద్ధి నిర్వాహకుడిగా నియమితులయ్యారు. ఐటీడీఏ ప్రవేశ పెట్టిన పలు పథకాలను, ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని గిరిజనులందరూ అభివృద్ధి చెందాలని చైతన్యం కలిగించిన ఘనత ఆయనకే దక్కుతుంది.  గిరిజనులకు అండగా నిలబడి గిరిజనాభివృద్ధిలో ఆదివాసు లను భాగస్వాములుగా చేస్తూ హైమండార్ఫ్‌ స్థాపించిన ‘రాయ్‌ సెంటర్ల’ను పునఃప్రారంభించడానికి తగు కృషి చేశారు మారూ మాస్టారు. తుదకు 2000, మార్చి 6న ప్రకృతి ఒడిలోకి చేరారు. ఆదివాసీల మదిలో మారూ జ్ఞాపకం మరువ లేనిది. 
– గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక రచయిత
  (నేడు మారూ మాస్టారు వర్ధంతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement