Girijana
-
అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఉట్నూర్(ఖానాపూర్): గిరిజన దర్బార్‌కు వచ్చే ప్రతీ అర్జీని ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌కు కలెక్టర్ హాజరై గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం చాందూరి గ్రామానికి చెందిన మేస్రం మారుతి వికలాంగ పింఛన్ అందించాలని విన్నవించగా.. పింఛన్ మంజూరుతో పాటు మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేయాలని డీఆర్డీఏ పీడీ, డీడబ్ల్యూవోను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌పై సమీక్షించారు. ఇటీవల వడగళ్లతో దెబ్బతిన్న పంటలకు పరిహారం విషయమై ఇన్సూరెన్స్ అధికారులతో ఈనెల 21న సమావేశం ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఉపాధి, పింఛ న్ల మంజూరు, భూసమస్యలు, ఎకనామిక్ సపోర్టు స్కీం కింద రుణాలు మంజూరు చేయాలని తదితర సమస్యలపై 310 అర్జీలు రాగా వెంటనే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీటీడీవో పోచం, ఏపీవో నాగోరావు, డీఆర్డీఓ రాజేశ్వర్ రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి, జిల్లా, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. నీటి సమస్య పరిష్కరించాలి మా గ్రామంలో ఏళ్ల తరబడి నీటి సమస్య ఉంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఉన్న చేతి పంపులు పాడైపోయినయ్. తాగునీళ్ల కోసం దూరంగా ఉన్న బోరింగ్ల వద్దకు వెళ్లాల్సి వస్తంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. – నైతం శోభ, హస్నాపూర్ మూడేండ్ల సంది తిరుగుతన్నం.. మేం మూడేండ్ల సంది లోను కోసం తిరుగుతన్నం. ఎడ్లబండ్ల లోను కోసమని దరఖాస్తు ఇచ్చాం. రెండేండ్ల కిందనే బ్యాంకు కన్సల్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే లోను మంజూరు అయినా మాకు సమాచారం అందక ఆగిపోయింది. అధికారులు తొందరగా స్పందించి లోను ఇప్పించేలా చర్యలు తీసుకోవాలె. -ఆదిలాబాద్ మండలం కొలాంగూడ గ్రామస్తులు మేకల లోను మంజూరు చేయాలె మాకు ఉపాధి కోసం మేకల లోను, పంట చేన్లకు నీటి సౌకర్యం కోసం బోర్వెల్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాం. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.. లోను తొందరగా వస్తదని అనుకుంటున్నం. -ఉట్నూర్మండలం చిన్నుగుడ గ్రామ గిరిజనులు -
డోలీయే దిక్కు..!
► వైద్యం కోసం ‘గిరి’జన కష్టాలు ► రాళ్ల దారులపై నరకయాతన ► అక్కరకురాని 108, 102 వాహన సేవలు ► కిలో మీటర్ల మేర డోలి సాయంతోనే రోగుల తరలింపు ► గాలిలో కలుస్తున్న గిరిజనుల ప్రాణాలు ► పట్టించుకోని పాలకులు, అధికారులు విమానాలపై మనిషి గుండెను తరలించి రోగులకు అమర్చుతున్న రోజుల్లో.. ఒకేసారి పదుల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించే మేధావులున్న కాలంలో.. అమాయకులైన గిరిజనులు వైద్యం కోసం అర్రులు చాస్తున్నారు. మందుబిళ్లలు అందించేవారు లేక అనారోగ్యం పాలవుతున్నారు. జబ్బుచేస్తే పసర మందులు మింగుతున్నారు. ప్రాణాల మీదకు వస్తే ఆస్పత్రులకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గూడ వాసులందరూ కలిసి డోలీ సహాయంతో కొండలపై నుంచి రోగులను, గర్భిణులను ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు ‘గిరి’జన గూడల్లో నిత్యకృత్యంగా మారినా.. ఆపద సమయంలో వైద్యం అందక గిరిజనుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో నిలదీస్తున్నా.. గిరిజనుల తరఫున గోడు వినిపిస్తున్నా యంత్రాంగంలో ఇసుమంతైనా కదలిక లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయనగరంఫోర్ట్: విజయనగరం జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 11 సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. వీటి పరిధిలో 431 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఏటా వైద్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. గిరిజన గూడలకు వెళ్లి చూస్తే ఈ లెక్కలకు, ఆస్పత్రుల సంఖ్యకు అర్థం ఉండదు. పల్లెల్లో మందుబిళ్లలు ఇచ్చేవారు కానరారు. రోడ్డు సదుపాయం లేక వాహన సేవలు అక్కరకురావు. 108, 102 సర్వీసులకు ఫోన్ చేసినా.. కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. వర్షమైనా.. ఎండకాస్తున్నా గిరిజన రోగులను డోలీ సహాయంతో కిలోమీటర్ల మేర తరలించాల్సిందే. అత్యవసర వేళ కనీసం ప్రాథమిక వైద్య సేవలు అందించేవారు లేక గిరిజనుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇదీ పరిస్థితి... జిల్లాలో సుమారు 2.60 వేల మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి వైద్య సేవలు అందించేందుకు 20 పీహెచ్‌సీలు, సుమారు వంద ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో రహదారి లేని గ్రామాలు, కొండ శిఖర గూడలు వందలాది ఉన్నాయి. వీరికి వైద్యం అందని ద్రాక్షగా మారింది. అనారోగ్యం పాలైతే డోలీతోనే నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలకు చేర్చాలి. దీనికోసం సుమారు మూడునాలుగు గంటల పాటు రాళ్లదారిపై ప్రయాణించాల్సిందే. ఆ సమయంలో ఆరోగ్య ఉపకేంద్రాల్లో సిబ్బంది ఉంటే ప్రాథమిక వైద్యం అందుతోంది. లేదంటే.. సమస్య జఠిలంగా మారుతోంది. ఇటీవల కాలంలో వైద్యం సకాలంలో అందక గిరిజన పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులు తనువుచాలించారు. ఈ ఏడాదిలో ఇలాంటి మరణాలు సుమారు 30 వరకు సంభవించాయని గిరిజన సంఘాల నాయకులు చెబుతున్నారు. నేతలు మారుతున్నా.. దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనులకు వైద్య కష్టాలు వీడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలకు దూరంగా బతుకుతున్నామంటూ గగ్గోలు పెడుతున్నారు. గిరిజన గూడలకు దగ్గరగా ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని, వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివసించేలా చూడాలని కోరుతున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గిరిజన కష్టాలను శాసనసభలో ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి గిరిజనులకు వైద్య సేవలను చేరువ చేయాలని కోరుతున్నారు. -
హామీల అమలులో బాబు విఫలం
ఆళ్లగడ్డ: హామీలు అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని గిరిజన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్ ఆరోపించారు. పట్టణంలోని ఓ పంక్షన్ హాలులో శుక్రవారం గిరిజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో గిరిజనులకు చంద్రబాబునాయుడు 25 హామీలు ఇచ్చారాన్నరు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ముఖ్యంగా 500 జనాభా దాటిన తండాలను, గూడేలను, గిరిజన గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామన్నాని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణలో సీఎం కెసీఆర్.. ఎన్నికల హామీలను నెరవేర్చే విధంగా ఇప్పటికే ఓ కమిటీ వేశారన్నారు. ఏపీలో చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో గిరిజనులు ఎంత మంది ఉన్నారో ప్రభుత్వం వద్ద లెక్కలు లేవన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు గిరిజన మంత్రిని కాకుండా ఇతర వర్గాలకు చెందిన వారిని చేయడం విచారకరమన్నారు. గిరిజన శాఖకకు చైర్మన్‌ను నియమించాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ నాయకులు నాగు నాయక్, ఆర్వీ ప్రసాద్, బాలాజీ, రవీంద్రనాయక్, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.