డోలీయే దిక్కు..!
► వైద్యం కోసం ‘గిరి’జన కష్టాలు
► రాళ్ల దారులపై నరకయాతన
► అక్కరకురాని 108, 102 వాహన సేవలు
► కిలో మీటర్ల మేర డోలి సాయంతోనే రోగుల తరలింపు
► గాలిలో కలుస్తున్న గిరిజనుల ప్రాణాలు
► పట్టించుకోని పాలకులు, అధికారులు
విమానాలపై మనిషి గుండెను తరలించి రోగులకు అమర్చుతున్న రోజుల్లో.. ఒకేసారి పదుల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించే మేధావులున్న కాలంలో.. అమాయకులైన గిరిజనులు వైద్యం కోసం అర్రులు చాస్తున్నారు. మందుబిళ్లలు అందించేవారు లేక అనారోగ్యం పాలవుతున్నారు. జబ్బుచేస్తే పసర మందులు మింగుతున్నారు. ప్రాణాల మీదకు వస్తే ఆస్పత్రులకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గూడ వాసులందరూ కలిసి డోలీ సహాయంతో కొండలపై నుంచి రోగులను, గర్భిణులను ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు ‘గిరి’జన గూడల్లో నిత్యకృత్యంగా మారినా.. ఆపద సమయంలో వైద్యం అందక గిరిజనుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో నిలదీస్తున్నా.. గిరిజనుల తరఫున గోడు వినిపిస్తున్నా యంత్రాంగంలో ఇసుమంతైనా కదలిక లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
విజయనగరంఫోర్ట్: విజయనగరం జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 11 సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. వీటి పరిధిలో 431 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఏటా వైద్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. గిరిజన గూడలకు వెళ్లి చూస్తే ఈ లెక్కలకు, ఆస్పత్రుల సంఖ్యకు అర్థం ఉండదు. పల్లెల్లో మందుబిళ్లలు ఇచ్చేవారు కానరారు.
రోడ్డు సదుపాయం లేక వాహన సేవలు అక్కరకురావు. 108, 102 సర్వీసులకు ఫోన్ చేసినా.. కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. వర్షమైనా.. ఎండకాస్తున్నా గిరిజన రోగులను డోలీ సహాయంతో కిలోమీటర్ల మేర తరలించాల్సిందే. అత్యవసర వేళ కనీసం ప్రాథమిక వైద్య సేవలు అందించేవారు లేక గిరిజనుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో సుమారు 2.60 వేల మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి వైద్య సేవలు అందించేందుకు 20 పీహెచ్‌సీలు, సుమారు వంద ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో రహదారి లేని గ్రామాలు, కొండ శిఖర గూడలు వందలాది ఉన్నాయి. వీరికి వైద్యం అందని ద్రాక్షగా మారింది. అనారోగ్యం పాలైతే డోలీతోనే నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలకు చేర్చాలి. దీనికోసం సుమారు మూడునాలుగు గంటల పాటు రాళ్లదారిపై ప్రయాణించాల్సిందే. ఆ సమయంలో ఆరోగ్య ఉపకేంద్రాల్లో సిబ్బంది ఉంటే ప్రాథమిక వైద్యం అందుతోంది. లేదంటే.. సమస్య జఠిలంగా మారుతోంది.
ఇటీవల కాలంలో వైద్యం సకాలంలో అందక గిరిజన పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులు తనువుచాలించారు. ఈ ఏడాదిలో ఇలాంటి మరణాలు సుమారు 30 వరకు సంభవించాయని గిరిజన సంఘాల నాయకులు చెబుతున్నారు. నేతలు మారుతున్నా.. దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనులకు వైద్య కష్టాలు వీడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మౌలిక సదుపాయాలకు దూరంగా బతుకుతున్నామంటూ గగ్గోలు పెడుతున్నారు. గిరిజన గూడలకు దగ్గరగా ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని, వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివసించేలా చూడాలని కోరుతున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గిరిజన కష్టాలను శాసనసభలో ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి గిరిజనులకు వైద్య సేవలను చేరువ చేయాలని కోరుతున్నారు.