
‘నూటా ఏభై ఏళ్ళ క్రితం, నిజాం రాజు మహబూబ్ అలీ ఖాన్ కట్టించిన సికింద్రాబాదు రైల్వే స్టేషన్ భవనం జమీన్ దోస్త్’. పేపర్లో ఈ వార్త చదివి, అనుకోకుండా అర శతాబ్దం వెనక్కెళ్ళాను నేను. ఎలాగా..? పాఠశాల విద్యార్థి దశ రోజులు. వేసవి సెలవులు ఊళ్ళో పూర్తి చేసుకుని బొంబాయికి తిరుగు పయనం ఆ రోజుల్లో సికింద్రాబాదు స్టేషన్ నుండే!
మా ఊరు దాచారం. ఈ స్టేషన్‌కి 115 కి.మీ. దూరం. ఊరినుండి ఒకే ఒక ప్రైవేటు బస్సు ఉదయం 6 గంటలకు బయల్దేరి భువనగిరికీ, అటునుండి ప్యాసింజర్ రైలెక్కితే పగటి పూట ఏ ఒంటిగంటకో సికింద్రాబాదు స్టేషన్‌కూ చేరుకునే వాణ్ణి అమ్మా నాన్నలతో (ఒకో సారి బంధువులతో). రాత్రి 8 గంటలకు బాంబే ఎక్స్‌ప్రెస్. అప్పటి వరకు మా మకాం, ఇప్పుడు నేలమట్ట మవుతున్న ఈ విశాల ప్రాంగణంలోనే. 1వ నంబర్ ప్లాట్‌ఫారంకు ఆనుకుని ఉండే ఈ విశాల భవంతి మూడు ప్లాట్ ఫారాలకు ముఖ్య ద్వారం. వచ్చీ పోయే ప్రయాణికులతో అది హమేషా హడావుడి. హాలుకు కుడివైపు బుకింగ్ కౌంటర్లు, ఎడమ వైపు ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలం మాలాంటి గరీబ్ బాటసారులకు విడిది.
అక్కడే లగేజి దించి, వెంట తెచ్చుకున్న విస్తరిలోని చద్దన్నం తలా ఇంత తినేసి పెద్ద వాళ్ళు అలా లగేజికి ఆనుకుని నడుం వాల్చి పడుకుంటే, నేనేమో ఆ ప్రాంగణం అంతా, దానికి దగ్గరున్న మూడు ప్లాట్ ఫారమ్‌లు కలియ తిరుగుతూ... కనిపించే బుక్ స్టాల్లోని ‘విజయ చిత్ర’, ‘సినిమా రంగం’ లాంటి సినీ పత్రికలు తీసి ఓ రెండు మూడు నిమిషాలు తిరగేసి మళ్ళీ పెట్టేసేవాణ్ణి (డబ్బులు ఉండేవి కాదు మరి కొనటానికి). ప్లాట్‌ఫారం గుమ్మాలకు అతికించిన అలనాటి ‘అంతస్తులు’, ‘ధర్మదాత’, ‘కథానాయకుడు’, ‘అదృష్ట వంతులు’, ‘గూఢచారి 116’, ‘వీరాభి మన్యు’ లాంటి తెలుగు సినిమా పోస్టర్లను... వచ్చినప్పుడల్లా అలాగే చూస్తూ నిలుచోవటం ఇప్పటికీ గుర్తే (అవి ముంబాయి వీధుల్లో కనిపించేవి కాదు).
ఇదీ చదవండి: ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీ
ఇక అడపా దడపా తెలుగు ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళలోని ప్రయాణికుల కోలాహలం, వారి కట్టూ–బొట్టు, మాటల యాస ఆసక్తితో గమనించే వాణ్ణి. అదో తీయని దృశ్యం. బంబయ్యా కా హిందీ లానే మన తెలుగునూ ఇక్కడ మనం మాట్లాడేది. కాని తెలుగునాట ఎన్ని యాసలో, ఆ స్టేషన్‌లోనే విన్నాను! ఆధునీకరణ పేరుతో ఇది ఇప్పుడు జమీన్ దోస్త్ అవుతున్నా... ఈ వయసులోనూ నా మనో ఫలకంపై భద్రంగానే ఉంది.
– జిల్లా గోవర్ధన్, మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై
Comments
Please login to add a commentAdd a comment