Nostalgia
-
ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!
ముంబై మహానగరంలో ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులు ఇక కనిపించవు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో రానున్న 9 నెలల్లో సిటీట్రాఫిక్ సిస్టమ్‌లో 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేనుంది. మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) కొత్త డబుల్ డెక్కర్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (బెస్ట్) చివరి నడుస్తున్న డబుల్ డెక్కర్ బస్సును స్వాధీనం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై వాసులు భావోద్వేగంతో వీటికి వీడ్కోలు పలకడం వైరల్‌గా మారింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన "అత్యంత ముఖ్యమైన చిన్ననాటి జ్ఞాపకాల" దొంగతనం చేశారంటూ ముంబై పోలీసుల అధికారిక ఎక్స్(ట్విటర్) ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. (మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్‌రావు) We’ve received a 'nostalgic heist' report from @anandmahindra Sir! We can clearly see the theft, but we cannot take possession of it. Those B.E.S.T cherished memories are safely kept in your heart, and among all Mumbaikars.#DoubleDecker #MumbaiMemories #BestMemories https://t.co/32L2nmzXiQ — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) September 15, 2023 “హలో, ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదానిని దొంగిలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటూ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. దీనికి ముంబై పోలీసులు కూడా స్పందించారు. డిపార్ట్మెంట్ దొంగతనం గురించి స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానిని స్వాధీనం చేసుకోలేం అంటూ బదులిచ్చారు. ఆనంద్ మహీంద్రా సర్ నుండి 'నోస్టాల్జిక్ హీస్ట్' నివేదికను అందుకున్నాం, కానీ దానిని స్వాధీనం చేసుకోలేం ఆ B.E.S.T ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు మీతోపాటు ముంబైవాసులందరి హృదయాల్లో భద్రంగా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర మీరు చాలా డిఫరెంట్ అంటూ వారిని అభినందిస్తూ తిరిగి ట్వీట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) కాగా 1997లో86 ఏళ్ల క్రితం నగర వీధుల్లో ప్రవేశపెట్టారు. వీటి ప్లేస్‌లో మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) డబుల్ డెక్కర్లు రోడ్డెక్కాయి. రెడ్ డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ల యుగం సెప్టెంబర్ 15, శుక్రవారంతో ముగిపోయిన నేపథ్యంలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులకు వందలాది మంది ముంబైకర్లు వీడ్కోలు పలికారు. పూల దండలు, బెలూన్లతో అలంకరించి మరీ చివరిగా డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్లకు బై బై చెప్పారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. -
జ్ఞాపకాల అంగడి
వీటిలో ఎన్నిటిని గుర్తుపట్టారు? ఓ మై గుడ్నెస్ అన్నిటినా? అయితే మీరు పలు బ్రాండ్లకు మంచి బిజినెస్ ఇస్తున్నట్టే! వాట్ ఆర్ యూ టాకింగ్? ఇవి నా చిన్నప్పటి.. లేదా నా యూత్ మెమొరీస్.. వాటిని బ్రాండ్స్ ఏం చేసుకుంటాయి? బిజినెస్ చేసుకుంటాయి! ఎస్.. ఇప్పుడు వినియోగదారుల చిన్ననాటి.. టీనేజ్ జ్ఞాపకాలే పలు వ్యాపార సంస్థలకు పెద్ద బిజినెస్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ జ్ఞాపకాలే కొత్త బిజినెస్‌కు ఆలోచన పడేలా చేస్తున్నాయి.. నోస్టాల్జియాకున్న పవర్ అది! అందుకే దీన్ని నోస్టాల్జియా మార్కెట్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ తిరుగుతోంది ఈ ఇరుసు మీదే! ఇంట్లో.. బయటా.. ఎక్కడ ఏ వస్తువు కనపడినా.. ఏ పరిసరంలో తిరుగాడినా.. ఏ మాటలు.. పాటలు విన్నా.. అవన్నీ ఏదోరకంగా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నవే అయ్యుంటాయి! లేదంటే గతంలోని ఏదో ఒక సందర్భాన్ని.. అపూర్వ క్షణాలను.. వ్యక్తులను గుర్తుచేసేవే ఉంటాయి! గమ్మత్తయిన ఓ వర్ణం.. అమ్మకు తను కట్టుకున్న తొలి చీరను గుర్తుచేయొచ్చు. మనవరాలో.. మనవడో.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ కొనుక్కున్న ఓ స్టీల్ గిన్నె.. నానమ్మకు తన కాపురాన్ని జ్ఞాపకంలోకి తేవచ్చు. స్పాటిఫైలో పాట.. నాన్నకు తన బాల్యంలోని సినిమా థియేటర్ని అతని కళ్లముందు ఉంచొచ్చు. పఫ్‌తో హెయిర్ స్టయిల్ అత్తను తన యవ్వనపు రోజుల్లోకి తీసుకెళ్లొచ్చు. ఓటీటీ సిరీస్‌లోని ఓ సన్నివేశంతో తన చిన్నప్పుడు దొంగతనంగా కాల్చిన సిగరెట్ దమ్ము.. తాతయ్య మది అట్టడుగు పొరల్లోంచి బయటకు రావచ్చు! ఇలా జ్ఞాపకల్లేని జీవితం ఉంటుందా? పైగా పాతవన్నీ మధురాలే! అందుకే కదా అన్నారు ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని! ఈ మాటనే వ్యాపార మంత్రంగా పట్టేసుకున్నాయి పలు వ్యాపార సంస్థలు. ఎలాగంటే.. ‘ఆరోజుల్లో... ’ అని మొదలుపెట్టే సంభాషణతో చుట్టూ ఉన్న వాళ్లు చిరాకు పడుతుండొచ్చు. విసుగు చెందుతుండొచ్చు. కానీ.. వ్యాపార సంస్థలు మాత్రం ఆ మాటల ప్రవాహాన్ని పట్టుకుని అందులో ఈది.. ఆ జ్ఞాపకాల్లో తమ బ్రాండ్స్‌ను దొరకబుచ్చుకుని పాత కొత్తల కలయికతో రీమేక్ చేసి యాడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ ‘యాది’ అనే టెక్నిక్‌ను బిజినెస్ ట్రిక్‌గా మలచుకుంటున్నాయి. ఈ స్క్రిప్ట్‌కి లీడ్ అందింది ఎప్పుడు? ఇంకెప్పుడూ.. కరోనా టైమ్‌లోనే! భలేవారే.. అన్నిటికీ కరోనాతో ముడిపెడితే ఎలా? అంటే పెట్టాల్సిందే మరి! కరోనాతో కరెంట్ ఎరా.. కరోనాకు ముందు.. తర్వాత అని చీలిపోతుందని లాక్డౌన్లో జోస్యం చెప్పుకున్నాం! నెమ్మదిగా అదిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మార్కెట్లో లాభాలు సృష్టిస్తోంది. అంటే కాలం ఆ విభజనను స్పష్టం చేసిందన్నట్టే కదా! లాక్డౌన్లో చాలా మంది.. నాటి దూరదర్శన్ సీరియళ్లు, పాత సినిమాలు, పాటలతోనే కాలక్షేపం చేశారుట. ఆ కాలక్షేపంలో పల్లీ బఠాణీలు, పాప్‌కార్న్‌ని కాకుండా ఆ సీరియళ్లతో సమానంగా ఆస్వాదించిన నాటి ప్రకటనలను.. ప్రొడక్ట్స్‌ను.. వాటి తాలూకు తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారని పలు అధ్యయనాల సారాంశం. ఆ సారాన్ని పట్టుకునే వ్యాపార సంస్థలు నోస్టాల్జియాలో మార్కెట్‌ను వెదుక్కున్నాయి. మిలెనీయల్స్కీ.. జెన్జెడ్కీ.. ఆ తరపు మెమోరీస్‌ని కొత్త ర్యాపర్లో చుట్టి ప్రకటనల గిఫ్ట్స్‌ని అందిస్తున్నాయి. ఈ జాబితాలో క్రెడ్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి క్యాడ్బరీ దాకా పలు ప్రముఖ బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఇలా కొత్త ర్యాపర్లో పాత యాడ్స్‌ను చుట్టి స్క్రీన్ మీద పరుస్తున్నాయి. ఆ మధురాలు పాత తరపు వినియోగదారుల భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యి నాటి ఆనందానుభూతులను తాజా చేసి ఆ బ్రాండ్స్ పట్ల వాళ్ల లాయల్టీని పెంచుతున్నాయి. ఈ తరమేమో ఆ గిమ్మిక్కి పడిపోయి.. ఆ బ్రాండ్స్‌కి కొత్త కన్జూమర్స్గా రిజిస్టర్ అవుతోంది. ఇలా ఒకే ఇంట్లో ఆబాలగోపాలన్ని అలరించి.. మెప్పించి తమ ఖాతాను స్థిరపరచుకుంటున్నాయి. ఇదే కాక క్రెడ్ ఓజీ (OG) పేరుతో రాహుల్ ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్, జావగల్ శ్రీనాథ్, మనీందర్ సింగ్, సబా కరీమ్ లాంటి నాటి మేటి క్రికెటర్స్తోనూ యాడ్స్ రూపొందించింది. ఇలా రిలీజ్ అయిన వెంటనే అలా వైరల్ అయ్యాయి ఆ ప్రకటనలు. ఆ యాడ్స్‌లో కొన్ని.. క్యాడ్బరీ.. కుఛ్∙ఖాస్ హై 90ల్లో.. ఒక క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటాడు.. సెంచరీకి చివరి బంతి అన్నమాట. బంతి గాల్లో లేచి.. క్యాచ్ అవుతుందా అన్న ఉత్కంఠలో క్యాచ్ మిస్ అయ్యి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ చాక్లెట్ తింటూ టెన్షన్ పడ్డ అతని గర్ల్‌ఫ్రెండ్ ఆనందానికి అవధులుండవు. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేస్తూ స్టేడియంలోకి వస్తుంది.. సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! ఇప్పుడు క్రికెట్ స్టేడియం.. లేడీ క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటుంది. సెంచరీకి ఒక రన్ తక్కువగా ఉంటుంది ఆమె స్కోర్. ఓ షాట్ కొడుతుంది. అది గాల్లో లేచి.. బౌండరీ దగ్గరున్న ఫీల్డర్ దోసిట్లో పడబోయి.. మిస్ అయి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ తింటూ టెన్షన్ పడిన ఆ క్రికెటర్ బాయ్‌ఫ్రెండ్ సంతోషానికి ఆకాశమే హద్దవుతుంది. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేసుకుంటూ స్టేడియంలోకి వస్తాడు సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. ఫైవ్స్టార్తో కలసి అప్పుడు.. ఫైవ్‌స్టార్ ఇద్దరు యువకులు.. ఓ ప్యాంట్‌ను దర్జీకిస్తూ ‘నాన్నగారి ప్యాంట్.. ఒక అంగుళం పొడవు తగ్గించాలి’ అని చెప్పి వాళ్ల వాళ్ల షర్ట్ జేబుల్లోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసి ఓ బైట్ తిని .. ఆ ఇద్దరూ మొహాలు చూసుకుని అప్పుడే ఒకరినొకరు గుర్తుపట్టినట్టు.. ‘రమేశ్.. సురేశ్’ అని పిలుచుకుంటారు. ఇలా చాక్లెట్ తింటూ.. మైమరిచిపోయి.. దర్జీకి పదేపదే ఆ ప్యాంట్‌ను అంగుళం చిన్నది చేయమని పురమాయిస్తూంటారు. ఈలోపు ఆ ప్యాంట్ కాస్త నిక్కర్ అయిపోతుంది. ఇప్పుడు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇందులోనూ రమేశ్, సురేశ్ ఇద్దరూ ఓ ప్యాంట్ తీసుకుని దర్జీ దగ్గరకు వస్తారు. ఆ ప్యాంట్ పొడవు తగ్గించాలని పురమాయించి.. ఫైవ్‌స్టార్ కోసం జేబులు వెదుక్కుంటూంటారు.. ఖాళీ అయిపోయిన ర్యాపర్స్ తప్ప చాక్లెట్స్ దొరకవు. అప్పుడు వాయిస్ ఓవర్ వినిపిస్తుంటుంది.. ‘ఇప్పటికిప్పుడు చాక్లెట్స్ కావాలా? స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి.. నిమిషాల్లో చాక్లెట్స్ మీ ముందుంటాయి’ అంటూ! అప్పుడు రమేశ్.. సురేశ్ పక్కకు చూడగానే చాక్లెట్స్ పట్టుకుని నిలబడ్డ స్విగ్గీ ఇన్స్టామర్ట్ డెవలరీ పర్సన్ కనపడుతుంది. క్రెడ్.. (క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ యాప్) నాడు.. దీపికాజీ (నిర్మా వాషింగ్ బార్) దీపికా చిఖలియా (నాటి టీవీ రామాయణంలో సీత పాత్రధారి) కిరాణా షాప్‌లోకి వెళ్లి.. నిర్మా బట్టల సబ్బు ఇవ్వమని షాప్ అతన్ని అడుగుతుంది. ‘దీపికాజీ.. మీరెప్పుడూ సాధారణ సబ్బే కదా తీసుకునేది.. మరిప్పుడూ?’ అంటూ ఆగిపోతాడు. ‘సాధారణ సబ్బు ధరకే నిర్మా బార్ వస్తుంటే ఎందుకు కాదనుకుంటాను’ అంటుంది దీపికా. నేడు .. కరిష్మాజీ (క్రెడ్ పేమెంట్ యాప్ కోసం) షాప్‌లోకి వెళ్తుంది కరిష్మా కపూర్ సెల్‌ఫోన్ చార్జర్ కోసం. సాధారణమైన చార్జర్ కాక స్టాండర్డ్ చార్జర్ అడుగుతుంది. ‘కారిష్మాజీ.. మీరు సాధారణంగా మామూలు చార్జరే అడుగుతారు కదా.. మరిప్పుడు?’ అని ఆగుతాడు. సాధారణ చార్జర్ ధరకే క్రెడ్ బౌంటీ స్టాండర్డ్ చార్జర్ ఇస్తుండగా ఎందుకు కాదంటాను!’ అంటుంది. పార్లే జీ.. భారత్ కా అప్ నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్ ) నిరుటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లే జీ ‘ భారత్ కా అప్నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్)’ పేరుతో నోస్టాల్జియా క్యాంపెయిన్ యాడ్‌ను విడుదల చేసింది. ‘స్వాతంత్య్ర సమర ప్రయాణంలో మేమూ కలసి నడిచాం! చాయ్ తీపిని.. స్వాతంత్య్ర సాధన సంతోషాన్నీ రెట్టింపు చేశాం! దేశం సాధించిన ప్రతి విజయంలో భాగస్వాములమయ్యాం..’ అంటూ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు దేశం సాధించిన ప్రగతిని చూపిస్తూ.. అప్పటి నుంచీ ఉన్న తన ఉనికినీ ప్రస్తావిస్తూ .. నాటి జ్ఞాపకాల వరుసలో తనను ముందు నెలబెట్టుకుని.. ఇప్పటికీ అంతే తాజాగా ఉన్నానని చెబుతూ తన ప్రొడక్ట్ అయిన బిస్కట్స్‌ను మిలెనీయల్స్ చేతుల్లో ఉన్న చాయ్ కప్పుల్లో.. పాల గ్లాసుల్లోనూ డిప్ చేసింది. టాటా సాల్ట్ కూడా బాక్సర్ మేరీ కోమ్‌ను పెట్టి.. ‘దేశ్ కా నమక్’ పేరుతో నోస్టాల్జియా, సెంటిమెంట్‌ను కలిపి కొట్టి కమర్షియల్ యాడ్‌ను రూపొందించింది. అది వర్కవుట్ అయింది. మదర్స్ రెసిపీ కూడా తన పచ్చళ్ల వ్యాపార ప్రమోషన్‌కు జ్ఞాపకాల ఊటనే వాడుకుంది. దిన పత్రికలూ నోస్టాల్జియా ప్రకటనలనే నమ్ముకున్నాయి. అందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా ‘హ్యాకీ చాంపియన్’ యాడే ఉదాహరణ. ఇవేకాక పేపర్ బోట్, గూగుల్ వంటి న్యూజనరేషన్ కంపెనీలూ నోస్టాల్జియాను ప్లే చేశాయి. రీలాంచ్ కూడా నోస్టాల్జియాతో ప్రొడక్ట్ ప్రకటలనే కాదు ప్రొడక్షన్ ఆగిపోయిన వస్తువులనూ తిరిగి ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాటిల్లో పార్లే వాళ్ల రోలా కోలా ఒకటి. 80లు, 90ల్లో పిల్లలకు ఈ క్యాండీ సుపరిచితం. పదమూడేళ్లుగా ఇది ఆగిపోయింది. కానీ దీనితో ముడిపడున్న తీపి జ్ఞాపకాలు మాత్రం 80, 90ల్లోని పిల్లలతో పాటే పెరిగి స్థిరపడ్డాయి. అందుకే నాలుగేళ్ల కిందట.. కేరళకు చెందిన 29 ఏళ్ల సిద్ధార్థ్ సాయి గోపినాథ్ అనే యువకుడు రోలా కోలా ఫొటో పెట్టి.. దాన్ని పార్లేకి ట్యాగ్ చేస్తూ ఇది మళ్లీ మార్కెట్లోకి రావాలంటే ఎన్ని రీట్వీట్స్ కావాలంటూ ట్వీట్ చేశాడు. అతని ట్వీట్‌కి పార్లే స్పందించింది. కనీసం పదివేల రీట్వీట్స్ కావాలని బదులిచ్చింది. అయిదారు నెలలకు సిద్ధార్థ కోరిక నెరవేరింది. ‘మంచి ఫలితానికి నిరీక్షణ తప్పదు.. కానీ నిరీక్షణ ఫలితమెప్పుడూ తీయగానే ఉంటుంది.. రోలా కోలా ఈజ్ కమింగ్ బ్యాక్’ అంటూ పార్లే ప్రకటించింది. సిద్ధార్థ్ ఈ రోలా కోలా కోసం ట్యాగ్ చేయని సెలబ్రిటీల్లేరు.. మెగా బ్రాండ్స్ లేవు. ఆఖరకు నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏవియేషన్ కంపెనీలనూ వదల్లేదు. కాంపా కోలా.. 1970, 80ల్లో తన టేస్ట్‌తో మార్కెట్‌ను రిఫ్రెష్ చేసిన సాఫ్ట్‌డ్రింక్ ఇది. గ్లోబలైజేషన్‌తో మన అంగట్లోకి వచ్చిన పెప్సీ, రీ ఎంటర్ అయిన కోకా కోలా థండర్ వేవ్స్‌కి తట్టుకోలేక దేశీ సాఫ్ట్‌డ్రింక్ కాంపా కోలా కనుమరుగైపోయింది. దీన్నిప్పుడు రిలయెన్స్ కొనుగోలు చేసింది.. దేశీ డ్రింక్‌గా నాటి జ్ఞాపకాల చల్లదనంతో వినియోగదారులను సేదతీర్చడానికి సిద్ధమైంది. మ్యాగీ ఏమైనా తక్కువ తిందా? నిర్ధారిత పరిమాణం కన్నా సీసం పాళ్లు ఎక్కువున్నాయన్న కంప్లయింట్‌తో నెస్లే ప్రొడక్ట్ మ్యాగీ మన వంటింటి కప్‌బోర్డులను ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళ్లింది వెళ్లినట్టు ఊరుకుందా? లేదు! పిల్లల ఆకలి తీర్చిన ఇన్స్టంట్ ఫుడ్ జ్ఞాపకాలను రెచ్చగొట్టింది.. మిస్ యూ.. కబ్ వాపస్ ఆయేగా యార్ (తిరిగి ఎప్పుడొస్తున్నావ్) అంటూ! ప్రకటనలు, నలుమూలలా హోర్డింగ్‌లతో హోరెత్తించింది. ఈ ఉత్సాహం, స్ఫూర్తితో చాలా కంపెనీలు.. షటర్ మూసుకున్న తమ ప్రొడక్ట్స్‌ని కొత్తగా ముస్తాబు చేసి తిరిగి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. కొత్తేం కాదు.. నోస్టాల్జియాతో మార్కెట్‌ను ఏలడం కొత్త అనుకుంటున్నాం కానీ.. కాదు. ఫ్యాషన్ ప్రపంచం ఫాలో అయ్యేది ఈ సూత్రాన్నే! బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్‌మన్ కలర్ కాలం నాటి ట్రెండ్స్‌ని రెట్రో స్టయిల్ పేరుతో ఎప్పటికప్పుడు మార్కెట్ చేయట్లేదూ..! అలా బెల్‌బాటమ్, త్రీ ఫోర్ హ్యాండ్స్ బ్లౌజెస్, పోల్కా డాట్స్ డిజైన్స్, ఫ్రెంచ్ కట్ బియర్డ్స్, పఫ్ కొప్పులు ఎట్సెట్రా లేటెస్ట్ ఫ్యాషన్‌గా ఎన్ని యూత్‌ని ఆకట్టుకోవడం లేదు! ఆధునిక సాంకేతికతకు కవల జంటలైన ‘ఈ’ జెనరేషన్కూ త్రోబ్యాక్ సుపరిచితమే సోషల్ మీడియా సాక్షిగా. నిజానికి ప్రస్తుతం పలు బ్రాండ్స్ చేస్తున్న ఈ నోస్టాల్జియా మార్కెట్‌కి ప్రేరణ సోషల్ మీడియా త్రోబ్యాక్ థర్స్డేతోపాటు అది పోస్ట్ అయిన పాస్ట్ ఈవెంట్స్.. ఇన్సిడెంట్స్లను తడవ తడవకు గుర్తుచేసే తీరే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్ట్రాటెజీ వల్ల పలు బ్రాండ్ల అమ్మకాలూ పెరిగాయనీ చెప్తున్నారు. ‘జ్ఞాపకాలనేవి భలే గిరాకీ బేరం. నాటి సంగతులను మంచి ఫీల్‌తో జత చేసుకుని వస్తాయి. ఎన్నటికీ ఇంకిపోని భావోద్వేగాల తడిని కలిగుంటాయి. కాబట్టే అవి మార్కెట్లో సేల్ అవుతున్నాయి’ అంటున్నారు ‘22ఫీట్ ట్రైబల్ వరల్డ్‌వైడ్’ నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ దేబాశీష్ ఘోష్. ‘టీబీడబ్ల్యూఏ ఇండియా’ సీసీఓ పరీక్షిత్ భట్టాచార్యేమో ‘నోస్టాల్జియా అనేది టైమ్ మెషిన్ లాంటిది. నడుస్తున్న కాలానికి అందులో యాక్సెస్ ఉండదు. మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలనుకున్న క్షణాల్లోకి అది మనల్ని తీసుకెళ్తుంది.. మళ్లీ జీవించేలా చేస్తుంది. ఆ బలహీనతనే కంపెనీలు ఎన్‌క్యాష్ చేసుకుంటున్నాయి’ అంటున్నారు. అయితే ఈ ప్రహసనంలో కొన్ని బ్రాండ్స్.. పాత ప్రకటన లేదా జ్ఞాపకానికి సమకాలీనతను జోడించే ప్రయత్నంలో వాటికున్న ఎసెన్స్‌ను కాపాడుతూ ఆధునికతను అద్దడంలో విఫలమవు తున్నాయి. పాత యాడ్స్.. ఆ కాలంలో అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అంతే అద్భుతమైన ఫలితాలనూ రాబట్టి ఉండొచ్చు. కాని వాటి విలువ సామాజికంగా కానీ.. కల్చర్ పరంగా కానీ ప్రాసంగికతను కలిగి ఉందా? దాన్ని నేటి తరం గ్రహించగలుగుతున్నదా? ఆ ప్రకటనల సారం నేటికీ సరిపోలనున్నదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి కొన్ని యాడ్స్‌ను ఇప్పుడు చూస్తే అంటే పరిణతి చెందిన ఆలోచనాతీరుతో.. ఇప్పుడు నెలకొని ఉన్న సున్నిత వాతావరణంలో పరికిస్తే అవి వివాదాస్పదంగా కనిపించవచ్చు. పురుషాధిపత్య ధోరణినీ చూపిస్తూండవచ్చు. కాబట్టి.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని పాత ప్రకటనలకు ఆ సెన్స్‌ను జోడించాకే నోస్టాల్జియా స్ట్రాటెజీని మార్కెట్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
సెకనున్నర మాత్రమే శిష్యరికం చేశా.. చల్తాహై!
నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగారు ఒక కుటుంబం. ఆ ఇంట్లోని అబ్బాయే రాము. నా వయసు వాడే. మాటా మాటా కలిశాకా తెలిసింది తనూ ఆర్టిస్ట్ అని, బొమ్మలు వేస్తాడని. చూపించాడు కూడా. బోలెడంత పద్దతైన ప్రాక్టీసు, పోస్టర్ కలర్స్ తో వేసిన చక్కని పెయింటింగ్స్. నేను థ్రిల్లై పోయా ఆ బొమ్మలు చూసి. నన్ను నేనూ ఆర్టిస్ట్ అని చెప్పుకునే వాణ్ణే కానీ, రామూలా నా దగ్గర వేసిన బొమ్మల ఆధారాలు ఏమీ ఉండేవి. ఊరికే హృదయం ఆర్టిస్ట్ అని ఉన్నదంటే ఉన్నది అంతే. అప్పుడే కాదూ. ఇప్పుడూ అంతే. మరప్పుడయితే రామూని అడిగా ఇంత బాగా బొమ్మలు ఎట్లా వేస్తావు రామూ అని. నంద్యాలలో గుడిపాటి గడ్డ వీధిలో గణేష్ బాబు అనే ఆర్ట్ టీచర్ ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్నా అన్నాడు. సరేని నేను మా ఇంకో ప్రెండ్ వీర శేఖర్ ఇద్దరం కలిసి గురువు గణేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళామో, లేదా రామూనే తీసుకెళ్ళాడో కూడా నాకిప్పుడు గుర్తు లేదు. ఆ ఇంట్లో బొమ్మలు నేర్చుకునే నిమిత్తం ఇంకా మావంటి వాళ్ళు బొలెడు మంది ఉన్నారు. ఆయన మా ఇద్దర్ని ఒక మూలలో కూర్చోపెట్టి మా నోట్ పుస్తకంలో ఒక ఏనుగు బొమ్మ గీసి ఇచ్చి దాన్ని దిద్దమన్నాడు. నేను దాన్ని దిద్దనవసరం లేకుండా ఆ పక్క పేజీలో మరో ఏనుగు బొమ్మని సెకనున్నరలో వేసి ఆయనకు చూపించా. ఆయన అరే! భలే! అని నన్ను మెచ్చుకోకుండా, అలా స్వంతంగా బొమ్మలు వేయకూడదు. ఒక వారం పాటు నేను గీసి ఇచ్చిన బొమ్మ మీదే దిద్దుతూ ఉండాలి అని చెప్పాడు. నేను ఊరికే సరేనని ఆయన వేపు తల ఊపి ఆ ఇంటి గుమ్మం వేపుగా బయటికి వచ్చేసా. అప్పుడు లోపల శేఖర్ ఏమయ్యాడో తెలియదు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మేమిద్దరం ఆ క్రాష్ కోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ సెకనున్నర శిష్యరికం తరువాత నేనెవరిని ఇక నా గురువుగా అపాయింట్ చేసుకోలేదు. అనగననగ -తినగ తినగ పథకం కింద నా బొమ్మలు నేనే వేసుకుంటూ, వాటిని దిద్దుకుంటూ చల్తాహై. ఆ విధంగా రుద్దుడూ దిద్దుడూ అనేది బొమ్మల్లోనే కాదు. కుట్టు పని అనే టైలరింగ్ లో కూడా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకనో, బడి మీద, చదువు మీద ఆసక్తి లేకనోఉండే పిల్లలు ఖాళీగా ఉండి నాశనం పట్టకూడదని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలని ఏ టైలర్ దగ్గరో పని నేర్చుకోవడానికో పెడతారు. కొంతమంది పిల్లలయితే రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసి జీవిత వృద్దిలోకి వద్దామనే పూనికతో కూడా వాళ్లకై వాళ్ళే ఏ టైలర్ మాస్టర్ దగ్గరో కుదురుకుంటారు. ముఫై రోజుల్లో మిషిన్ కుట్టుడు నేర్చెసుకుని, తమ కాలి క్రింద తిరిగే మిషిను చక్రం అలా తిరుగుతూ తిరుగుతూ అంబాసిడర్ కారు చక్రంలా మారి తమ గుడిసే ముందు బ్రేకు వేసి ఆగుతుందనే తెలుగు సినిమా భ్రమలో ఉంటారు. తెలుగు సినిమా కాదు కదా కనీస తెలుగు కథల్లో మాదిరిగానైనా దర్జి జోగారావు దగ్గర శిష్యరికం చేసిన బాబిగాడు తన గాళ్ ప్రెండు పోలికి చాలని జాకెట్టు మాదిరి తుంట రవిక కుట్టడం కూడా వారికి కుదరదు. ఎందుకంటే టైలరింగ్ నేర్చుకోడానికి నువ్వు అందరికంటే ముందుగా పొద్దున్నే షాపు దగ్గరికి చేరాలా, మూలనున్న చీపురు పట్టి అంగడి లోపలా ఆపై బయట చీలికలు పీలికలైన గుడ్డ ముక్కలన్నీ శుభ్రంగా ఊడ్చేసి ఆపై వంగిన నడుముని అమ్మాయ్యా అని పట్టు దొరికించుకునేలోగా కటింగ్ మాష్టరు వస్తాడు. ఓనామహా శివాయహా అనే ఒక పాత బట్ట ముక్కకి కత్తిరతో ఒక గాటు పెట్టి దానిని నీ చేతిలో పెట్టి కాజాలు ప్రాక్టీస్ చెయ్యమంటాడు. కాజాలు కుట్టి కుట్టి వేలికి కన్నాలు వేసుకోవడం ఎలాగూ ప్రాక్టీస్ అయ్యేలోగా మళ్ళీ గుడ్డ ముక్కల చీలికలు పీలికలు షాపు నిండా చేరుతాయి. వాటిని చీపురు పట్టి శుభ్రం చేసి మళ్ళీ నువ్వు కాజాలకు కూచోవాలా! అనగనగా ఆ కాలానికి గడియారంలో రెండే ముల్లులు. ఒకటి పీలికలు- రెండు కాజాలు. గడియారం అలా గడిచి గడిచి నీకు ఎప్పుడో ఒకప్పుడు, ఒక మంచి కాలం వచ్చే వరకు నువ్వు గురువుగారి దగ్గరే ఓపిగ్గా పడి ఉంటే అప్పుడు గడియారంలో సెకన్ల ముల్లు కూడా చేరి అంగీలకు, ప్యాంట్లకు, నిక్కర్లకు గుండీలు కుట్టే పని దగ్గరకు నెట్టబడతావు . అయితే నే చెప్పబోయేది ఇదంతా బొమ్మలు వేయడం, కాజాలు కుట్టడం గురించి కథలూ, గాథలు కబుర్లు కావు. ఇంటి గోడమీద వేలాడే క్యాలెండర్ కు గుచ్చబడి ఉండే ఒక సూది పుల్ల కథ. ఈ రోజుల సంగతి నాకు తెలీదు. నా చిన్ననాటి రోజులలో కుట్టు మిషన్ షాపు దాక నడక పడకుండానే చిరుగులు పడ్డ బట్టలపై చిన్నా చితక కుట్టు సంగతులు వేసేంత జ్ఞానం ఇంట్లో ఆడవాళ్లందరికీ వచ్చి ఉండేది. మగవాళ్ళకు కూడా తెలిసి ఉండేది. అయితే ఈ పనులన్నీ ఎక్కువగా ఇళ్ళల్లో ఉండే అమ్మమ్మలో, నాయనమ్మలో చక్కగా ముచ్చటలు చెప్పుకుంటూ సాగించేవారు. పని నడిపించడం సులువే! అయితే వారి కష్టమంతా సూదిలోకి దారం ఎక్కించడమే కష్టంగా ఉండేది. పెరిగిన వయసులో కంటి చూపుకు, సూది బెజ్జానికి, దారపుమొనకు ఎక్కడా సామరస్యం కుదిరేది కాదు. ఎప్పుడెప్పుడు సూదిలో దారం ఎక్కించమని జేజి అడిగేనా, దారం ఎక్కించేందుకు పిల్లలు పోటా పోటీగా సిద్దం. దారం ఎక్కిద్దామని సూది దారం తీసుకున్న అన్నకో చెల్లాయికో ఒక నిముషమన్నా సమయమివ్వాలా? వాడి గురి కాస్త తప్పితే చాలు ఇలా తేని మరొకడు ఆ సూద్దారం లాక్కుని ఎంగిలితో దారం తడి చేసుకుని, నోట్లో నాలుక మొన బయటపెట్టి, ఒక కన్ను మూసి మరో కన్నుతో చెట్టుమీద పిట్టకన్ను దీక్షతో చూసే అర్జునుడయ్యేవాడు. నాలుక మొన అంటే గుర్తుకు వస్తుంది పిల్లలని చక్కగా తమ ముందు కూర్చో పెట్టుకుని నోట్లో నాలుకని చాపి తమ సూది ముక్కుల అంచులకు తాకించి నీకు చాతనవునా ఇలా తగిలించడం అని గేలి చేసే మేనత్తల సంతతి ఇంకా ఎక్కడైనా మిగిలే ఉందా? మొబైల్ ఫోన్ ల కేలండర్ ఆప్ లకు గుచ్చ జాలని సూదులని ఏ గడ్డి వాములోనో వెతికి పట్టుకుని ఆ సూది తొర్ర గూండా చూపు పోనిస్తే బెజ్జానికి ఆవల సెలవంటూ వెళ్ళి పోయిన వేలాది అమ్మమ్మా నానమ్మల తమ మనవ సంతానంతో పకపకల వికవికల వివశమవుతు కనపడుతున్నారు. పిల్లల చేతుల్లో మొబైలు గేముల పలకలు కాదు. తెల్లని సూదులు చురుక్కుమని మెరుస్తున్నాయి. వేలాది దారపు ఉండలు రంగు రంగుల గాలి పటాల వలే గాలిలోకి ఎగురుతున్నాయి. జ్ఞాపకం ఎంత విలువైనది. జీవితం ఎంత అందమైనది. -
భారత రాష్ట్రపతి స్వాగతం కోసం స్వయంగా బ్రిటన్ రాణి
క్వీన్ ఎలిజబెత్-2 జీవితం.. బ్రిటన్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం గుర్తుంచుకోదగిన ఒక అధ్యాయం. సుదీర్ఘకాలంగా ఒక రాజ్యాన్ని పాలించిన సామ్రాజ్ఞిగా ఆమె తనకంటూ ఓ చెరగని ముద్రవేసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు.. తన హయాంలో పలు దేశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారామె. అందులో భారత్ కూడా ఉండగా.. ఆ ఆదరాభిమానాలకు అద్దం పట్టిన ఘటనే ఇది.. క్వీన్ ఎలిజబెత్-2 ప్రయాణంలో భారత ఆధ్యాయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆమె భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఒకప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లండన్ పర్యటన సందర్భంగా స్వయంగా ఆమె కదిలివచ్చి స్వాగతం పలికారు. 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1963లో బ్రిటన్‌లో పర్యటించారు. ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, సంస్కరణల వాదిగా ఎంతో పేరున్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మునుపెన్నడూ లేనంతగా బ్రిటన్‌లో రాయల్ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్-2 స్వయంగా విక్టోరియా రైల్వే స్టేషన్‌కు వచ్చి సర్వేపల్లికి స్వాగతం పలికింది. తనతో పాటు ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్‌ను కూడా స్టేషన్‌కు తోడ్కోని వచ్చింది. ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్లను పరిచయం చేసిన రాణి(photo credit : BFI) రాజకుటుంబ ప్రముఖులతో పాటు, దేశంలోని అత్యున్నత సైన్యాధికారులు వెంట రాగా సర్వేపల్లిని జాతీయ గీతం జనగణమన ఆలాపనతో రాజమర్యాదలు చేసి తన వెంట తీసుకెళ్లారు రాణి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మొత్తం 11 రోజుల పాటు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. బ్రిటన్ సాధనసంపత్తికి అద్దం పట్టే పరిశ్రమలు, భవనాలు, వంతెనలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో సర్వేపల్లి పర్యటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటి బ్రిటన్ సాంప్రదాయ గుర్రపు పందాలను చూడడానికి వచ్చినప్పుడు రాణి ఎలిజబెత్ స్వయంగా వెంట వచ్చారు. నాటి రాష్ట్రపతి సర్వేపల్లికి రాణి ఎలిజబెత్ ఆహ్వానం(photo credit : BFI) నాటి వీడియోలో ఎలిజబెత్ ఎంతో హుందాగా, మరెంతో అందంగా కనిపించారు. వీడియోలో మూడు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు బ్రిటీష్ వస్త్రధారణలో రాణి కనిపించగా, చాలా మంది భారతీయ మహిళలు ఆనాటి సంప్రదాయ చీరలో కనిపించారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎలిజబెత్ కన్నుమూసిన సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వీడియో నాటి చరిత్రను కళ్ల ముందుంచింది. కర్టెసీ : BFI (బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఆర్కైవ్ నుంచి సేకరించిన వీడియో ఆధారంగా) -
ఈ బిజినెస్‌మేన్‌ని గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి యాక్టర్ కావాలని బిజినెస్‌మేన్ అయ్యారు. టీనేజీలో ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమాలంటే చెవి కోసుకునేవారు. నచ్చిన సినిమాలో సీన్లను తలపించేలా రియల్ లైఫ్‌లో ఎడ్వెంచర్లు చేశారు. అక్కడితో ఆగిపోలేదు. సినిమా కెరీర్ లక్ష్యంగా హర్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అక్కడే బిల్‌గేట్స్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. ఇంకేముంది యాక్టర్ కావాల్సిన వ్యక్తి మళ్లీ బిజినెస్ రూట్లోకి వచ్చారు. వ్యాపారంలో అనేక రికార్డులు సృష్టించారు. Remembering the best weekends of my youth. In ‘72 -I was 17-a friend & I used to often hitchhike from ‘Bombay’ to ‘Poona’ taking rides on trucks. That’s probably when I developed my love for the open road..The movie ‘Parichay’ had come out & we would sing “Musafir hoon Yaaron’😊 pic.twitter.com/VuTvMTyivd — anand mahindra (@anandmahindra) November 13, 2021 సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. జీన్స్ టీషర్ట్‌లో ఉన్న ఆ వ్యక్తి ట్రక్‌లో కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతనెవరా ? అని మనం ఆలోచించేలోగా.. ఆయనే అన్ని వివరాలు చెప్పారు. 1972లో ఆనంద్ మహీంద్రా 17 ఏళ్ల టీనేజీ కుర్రాడిగా ఉన్నప్పుడు అప్పుడే బాలీవుడ్లో దుమ్మరేపిన పరిచయ్ సినిమా చూశారు. అంతే ఆ సినిమాలో ముసాఫిర్ హుం యారో అని పాట పాడుతూ తన స్నేహితుడితో కలిసి బాంబే నుంచి పూనాకి ట్రక్కులో ప్రయాణం చేశారు. ఆ సందర్భంగా తీసుకున్న తన ఫోటోను ఆనంద్మహీంద్రా ట్వీట్టర్లో పంచుకున్నారు. -
క్రియేటివిటీ అంటే ఇది..
Old TV Advertisements: అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్.. బిజినెస్‌కి అవసరమైన ప్రధాన సూత్రం. ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు, జనాలకు దగ్గరిదాకా తీసుకెళ్లేందుకు వీటికి మించిన పవర్ఫుల్ మార్గం మరొకటి ఉండదు. అందుకే వెరైటీ కాన్సెప్ట్‌లు, రకరకాల స్క్రిప్లతో తమలోని క్రియేటివిటీ మొత్తాన్ని చూపిస్తుంటారు యాడ్ మేకర్స్, డైరెక్టర్స్. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న యాడ్స్ ట్రెండ్.. పోను పోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఒకానొక టైంలో వచ్చిన యూనివర్సల్ యాడ్స్ మాత్రం జనాలకు బాగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా నైంటీస్, మిలీనియంలో బుల్లితెర ద్వారా ఇంటింటికీ చేరిన ఈ యాడ్స్.. ఇప్పటికీ తలుచుకున్నా ఆహ్లాదకరమైన ఓ అనుభూతి కలుగుతుంది. పిల్లలతో పాటు పెద్దల పెదవులపై చిరునవ్వు పూయిస్తుంది. విశేషం ఏంటంటే.. వీటిలో చాలావరకు క్రికెట్ మ్యాచ్‌ల మధ్యల్లో రిపీట్‌గా టెలికాస్ట్ కావడం వల్ల చాలామందికి బహుశా ఇవి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అతుక్కుపోయే గుణం ఉన్న ఫెవికిక్ను చేపల వేటను ఉపయోగించే ఈ ఫన్నీ యాడ్.. చివర్లో ఆ వ్యక్తి నవ్వే నవ్వు. ప్రాణం కన్నా డబ్బు మిన్న అనుకునే ఓ వ్యక్తికి నీటి బొట్టు ఇచ్చే భారీ షాక్.. ఎమ్‌సీల్ యాడ్ కోసం రూపొందించింది. జంతువుల్లో ఉన్న సెన్సిబుల్ ప్రేమను.. ఆడ పక్షి- దత్తత తాబేలు పిల్ల, ఆ పిల్లను యాక్సెప్ట్ చేసే మిగతా పక్షి పిల్లల ద్వారా చూపించిన సరదా యాడ్. చిన్నప్పుడు చదివిన కాకి-దాహం కథ.. రాళ్లకు బదులు ముక్కుతో పొడిచే కాకి.. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే సాంగ్(తెలుగు వెర్షన్ కూడా ఉంటుంది) కరెంట్ లేని ప్యాలెస్‌లో దీపం పెట్టే కూలీల కథ.. చివరిదాకా అర్థం కానీ ట్విస్ట్.. హ్యాపీడెంట్ చూయింగ్‌గమ్ యాడ్ మూకీ యాడ్లలో కొత్త ఒరవడి.. మిరిండా యాడ్ దురదృష్టంలోనూ సరదాను ఆస్వాదించొచ్చని చూపించిన సరదా పెప్సీ యాడ్.. మేరా నెంబర్ కబ్ ఆయేగా(నా నెంబర్ ఎప్పుడు వస్తుంది) పగిలిపోని గుడ్డు.. జుట్టు పీక్కునే వంటగాడు. ఫెవికల్ డబ్బాలో దాణా తినే కోడి.. ఉల్లాసంగా సాగే లిరిల్ సోప్ యాడ్.. జలపాతం, అందమైన లొకేషన్లో వయ్యారి చిందులు కుటుంబ ఆప్యాయతలకు అడ్డొచ్చే గోడను బద్ధలు కొట్టాలని ప్రయత్నించే కవల అన్నదమ్ములు. బాంబులతో పేల్చిన బద్ధలు కానీ అంబూజా సిమెంట్‌తో కట్టిన గోడ.. ఇలా చెప్తూ పోతే బోలెడన్ని యాడ్లు. వాటిలో కొన్ని మాత్రం ఇవి. -
వందేళ్లనాటి అడవి కథ.. ఇప్పటికీ చూడాల్సిందే!
అదో దట్టమైన అడవి, అందులో.. మోగ్లీ అనే కుర్రాడి సాహసాలు చూసి ‘శెభాష్’ అనుకుంటాం షేర్ ఖాన్ క్రూరత్వం చూసి ‘కోపం’తో రగిలిపోతాం. తోడేలు తల్లి బాధకి గుండె కరిగిపోతుంది. భగీర గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. భల్లూ అల్లరి వేషాలకు నవ్వకుండా ఉండలేం. చివరికి అడవిని కాపాడటానికి ఏనుగులు చేసే ప్రయత్నం అదుర్స్ అనిపించకమానదు. పిల్లల నుంచి పెద్దల దాకా.. ముఖ్యంగా నైంటీస్ జనరేషన్‌కి అదొక ఫేవరెట్ సబ్జెక్ట్.. అదే జంగిల్ బుక్. ఆదివారం వచ్చిందంటే దిగ్గజ రచయిత గుల్జార్ రాసిన ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై..’ లౌడ్ సౌండ్‌తో మారుమోగేది. అంతలా ఆదరించబట్టే.. ఈ కల్పిత గాథకి రూపం ఏదైనా ఆదరణ మాత్రం తగ్గట్లేదు. సాక్షి, వెబ్‌డెస్క్: చిన్నతనంలో పెద్దపులి దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అవుతాడు ఓ చిన్నారి. ఆ పెద్దపులి బారినపడకుండా తోడేళ్లు ఆ పిల్లాడిని కాపాడుతుంటాయి. చివరికి ఆ పిల్లాడే పులిని చంపడంతో కథ సుఖాంతం అవుతుంది. సింపుల్‌గా ఇది రుడ్యార్డ్ కిప్లింగ్ కథ. ఈ కథ మొత్తం జంతువుల ప్రవర్తన నేపథ్యంలో సాగుతుంది. అయితే, అంతర్లీనంగా ఉన్న థీమ్ వేరు. డార్విన్ ‘మనుగడ’ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ.. మనిషి–జంతువుల మధ్య సంబంధాలను చూపించాడు. అదే విధంగా చట్టం–న్యాయం, అధికారానికి గౌరవం ఇవ్వడం, విధేయత, శాంతి స్థాపన, అడవుల నరికివేత, అడవి– ఊరు అనే రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య సంఘర్షణ... ఇలాంటి విషయాలెన్నో చర్చించాడు. ప్రకృతిపై మనిషి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడో అనే పాయింట్ విమర్శకులకు సైతం బాగా నచ్చింది. అసలు కథ... షేర్ ఖాన్ అనే పెద్దపులి ఆ అడవికి రాజు. ఒకరోజు ఫారెస్ట్ అధికారుల క్యాంపెయిన్‌పై దాడిచేసి అధికారిని, అతని భార్యను చంపేస్తుంది. ఆపై అధికారి కొడుకుని చంపే ప్రయత్నం చేస్తుంది. కానీ, తోడేళ్ల రాజు ఆ పిల్లాడిని రక్షిస్తుంది. మోగ్లీ అని పేరు పెట్టి తోడేళ్ల మందలో కలిపేస్తుంది. అంతే కాకుండా తమ సరిహద్దుల్లో ఉన్నప్పుడు మోగ్లీపై దాడి చేయకూడదని షేర్ ఖాన్‌కి నిబంధన పెడతాయి. చిన్నతనంలో ఓ రోజు ఆడుకుంటూ మోగ్లీ సరిహద్దు దాటుతాడు. షేర్ ఖాన్ మోగ్లీని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, తోడేలు రాజు తన ప్రాణాలు పణంగా పెట్టి మోగ్లీని కాపాడుతుంది. తర్వాత రక్ష(ఆడ తోడేలు) మోగ్లీ తల్లిగా తన పిల్లలతో పెంచుకుంటుంది. భగీర(నల్ల చిరుత) మోగ్లీకి చెట్లు ఎక్కడం, వేటాడటంపై శిక్షణ ఇస్తుంది. భల్లు(ఎలుగు బంటి) తోడేళ్లకు విద్యాబుద్ధులు, అడవి చట్టాల్ని బోధిస్తుంటుంది. ఈ ఇద్దరి శిక్షణలో మోగ్లీ రాటు దేలతాడు. తర్వాత కొన్నేళ్లకు అనివార్య పరిస్థితుల్లో మోగ్లీ అడవి దాటాల్సి వస్తుంది. అప్పుడు షేర్ ఖాన్ మోగ్లీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, నిప్పుని ఆయుధంగా చేసుకుని మోగ్లీ తప్పించుకుంటాడు. పొరుగున ఉన్న ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ ఓ జంట మోగ్లీని దత్తత తీసుకుంటుంది. చిన్నతనంలో ఆ జంట బిడ్డని కూడా పులి ఎత్తుకుపోతుంది. మోగ్లీ పశువుల్ని కాస్తుంటాడు. అయితే, ఈ విషయం షేర్ ఖాన్‌కి తెలుస్తుంది. తోడేళ్ల మందలోని వేగుల సాయంతో మోగ్లీ చంపాలని ప్రయత్నిస్తుంది. కానీ, మోగ్లీ అగ్గి సాయంతో షేర్ ఖాన్ని చంపేస్తాడు. అయితే ఊళ్లోవాళ్లు మాత్రం మోగ్లీని మంత్రగాడిగా అనుమానించి.. వెళ్లగొడతారు. దీంతో మోగ్లీ తిరిగి అడవికి చేరి తన తోడేలు కుటుంబంతో హాయిగా నివసిస్తుంటాడు. ఇది మొదటి పుస్తకం కథ. రెండో పుస్తకంలో జంగిల్ బుక్ సీక్వెల్. అప్పటికే ఆ ఊరి గ్రామస్తులు అడవిని నాశనం చేస్తుంటారు. అదే సమయంలో కరువుతో గ్రామస్తులు చనిపోతుంటారు. అయితే, మోగ్లీ చేతబడి చేయటంతోనే తమ ప్రాణాలు పోతున్నాయని ప్రజలంతా నమ్ముతారు. మోగ్లీ్కి ఆశ్రయం ఇచ్చారన్న కారణంతో ఆ జంటను చంపేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తుంటారు. ఈ విషయం స్నేహితురాలి ద్వారా మోగ్లీ తెలుసుకుంటాడు. వెంటనే మోగ్లీ జంతువులతో ఊరిపై దాడి చేయించి వారిని రక్షిస్తాడు. ఇది ఆసరాగా చేసుకుని ఎర్ర తోడేళ్లు మనుషులపై దాడి చేయాలనుకుంటాయి. కానీ, మోగ్లీ తన తోడేలు కుటుంబం సాయంతో ప్రజల్ని రక్షిస్తాడు. మోగ్లీ మానవత్వానికి కరిగిపోయిన అతని తల్లి.. మనుషులతో ఉండాలా? జంతువులతో అడవిలోనే నివసించాలా? అన్న నిర్ణయాన్ని మోగ్లీకే వదిలేస్తుంది. అలా మోగ్లీ ఆలోచిస్తుండగానే కథ ముగుస్తుంది. అయితే తర్వాత రుడ్ యార్డ్ కిప్లింగ్ రాసిన ‘ది స్పింగ్ రన్నింగ్’ పుస్తకంలోనూ మోగ్లీ సంఘర్షణకు ముగింపు ఇవ్వకపోవటం విశేషం. జంగిల్ బుక్ పుట్టుక నిజానికి జంగిల్ బుక్ కథ కంటే ముందే కీలక పాత్ర మోగ్లీ పుట్టింది. ఇంగ్లండ్ ఆర్టిస్ట్ జాన్ లాక్వుడ్ కిప్లింగ్. భారత దేశ చరిత్రపై కొన్నాళ్ల పాటు అధ్యయనం చేశాడు. ఆ సమయంలో భారత్‌లో పర్యటించిన ఆయన.. మోగ్లీ, మరికొన్ని పాత్రలను స్కెచ్ వేశాడు. మోగ్లీ అంటే కప్ప అని అర్థం. ఆ తర్వాత లాక్వుడ్ కొడుకు రుడ్యార్డ్ కిప్లింగ్ ఆ క్యారెక్టర్లతోనే జంగిల్ బుక్ రచన మొదలుపెట్టాడు. రుడ్యార్డ్ ముంబైలో పుట్టాడు. మధ్యప్రదేశ్(అప్పుడు మధ్యభారతం)లోని సియోని ప్రాంతంలోని ‘పెంచ్’ అడవి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఓ ఇంగ్లిష్ ఫారెస్ట్ అధికారికి సహకరించే గిరిజన చిన్నారే మోగ్లీ. అలా చిన్న చిన్న కథలు రాశాడు. ఆ కథలన్నింటినీ సంపుటిగా చేసి ‘ఇన్ ది రుఖ్’ పేరిట సంకలనం చేశాడు. ఆ మరుసటి ఏడాది అంటే 1894లో ది జంగిల్ బుక్‌గా పుస్తకం అచ్చయ్యింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మోగ్లీ–షేర్ ఖాన్ కథ ఆ పుస్తకంలోనిదే. ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంతో ముడిపెట్టి రెండో పుస్తకం రాశాడు రుడ్యార్డ్. ఈ రెండు పుస్తకాల్ని కలిపి 1907లో ఒకే పుస్తకంగా అచ్చేయించాడు. 1933లో అది కాస్త ‘ఆల్ ది మోగ్లీ స్టోరీస్’ పేరుతో ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎంతో మంది రచయితలు, దర్శకులు తమ వర్షన్లను జంగిల్ బుక్కి అన్వయించారు. ఎన్ని కథలోచ్చినా ఆ క్రెడిట్ మాత్రం కిప్లింగ్కే కట్టబెడుతుంటారు. తెరపై భారీ విజయాలు జంగిల్ బుక్ మీద యానిమేటెడ్ సిరీస్‌లు.. చిత్రాలు బోలెడన్ని వచ్చాయి. అవన్నీ బంపర్ హిట్లే. జపాన్‌కు చెందిన నిప్పోన్, డోరో టీవీ మర్చండైజింగ్ స్టూడియోలు సంయుక్తంగా జంగిల్ బుక్–షోనెన్ మోగ్లీని 52 ఎపిసోడ్లతో కార్టూన్‌గా తెరకెక్కించాయి. దానిని భారత్‌లో ది జంగిల్ బుక్: ది అడ్వెంచర్స్ ఆఫ్ మోగ్లీ గా అనువదించారు. భారత్‌లో 90వ దశకంలో ఊపు ఊపిన యానిమేటెడ్ సిరీస్ అదే. తర్వాత వీడియో గేమ్‌గా జంగిల్ బుక్ ఆదరణ పొందింది. ఇవన్నీ ఒక ఎత్తయితే జాన్ ఫావ్రూ డైరెక్షన్లో 2016లో రిలీజ్ అయిన ది జంగిల్ బుక్ చిత్రం. వాల్ట్ డిస్నీ బ్యానర్లో 3డీ లైవ్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం యానిమేటెడ్ చిత్రాల చరిత్రను తిరగరాసింది. ఈ సినిమాలో ఒకే ఒక్క హ్యుమన్ క్యారెక్టర్. ‘మోగ్లీ’ పాత్రలో ఏషియన్–అమెరికన్ సంతతికి చెందిన నీల్ సేథి నటించాడు. సంకల్ప్ వాయుపుత్ర అనే కుర్రాడు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో మోగ్లీ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. బిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. భారత్‌లోనూ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. -
పది వేలకే బజాజ్ చేతక్ ... ఎప్పుడంటే ..
హెడ్డింగ్ చూసి నమ్మలేకపోతున్నారా ? కానీ ఇది నిజం ! ఒక్క బజాజే కాదు రాయల్ ఎన్ఫీల్డ్, రాజ్‌దూత్, షెవర్లెట్, అంబాసిడర్ అన్ని కార్ల ధరలు అగ్గువే !?. బైకులైతే పది వేలకు అటు ఇటు కార్లయితే ఇరవై నుంచి ముప్పే వేల రూపాయలు. అయితే ఈ ధరలన్నీ ఇప్పటి కావు. ఆర్థిక సంస్కరణలు దేశంలో అడుగు పెట్టడానికి ముందు స్వాతంత్రం తర్వాత కాలానికి చెందినవి. ఆ రోజుల్లో వాహనాల ధరలు ఎలా ఉన్నాయి. వాటిని ఆయా కంపెనీలు ఎలా ప్రమోట్ చేశాయి, అప్పటి పన్నుల వివరాలు సరదాగా ఓ సారి చూద్దాం. సాక్షి, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బజాజ్‌ది ప్రత్యేక స్థానం. నైన్టీస్లో బజాజ్ అమ్మకాల్లో చేతక్ స్కూటరే నంబర్ వన్. అయితే బైక్‌ల క్రేజ్ పెరగడంతో క్రమంగా స్కూటర్ల మార్కెట్ డౌన్ అయ్యింది. చేతక్ కూడా వెనుకపడి పోయింది. అయితే ఇప్పుడు కొంగొత్తగా బజాల్ చేతక్ ఈవీ అంటూ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. అయితే 1987లో బజాజ్ చేతక్ మార్కెటోకి వచ్చినప్పుడు దాని ధర రూ. 10,652 మాత్రమే. స్కూటర్ ధర తక్కువగా చూపించేందుకు పన్ను తక్కువగా ఉండే పాండిచ్చేరి ఎక్స్‌షోరూం ధరను పేర్కొంది బజాజ్. బజాజ్ వెస్పా స్కూటర్ అన్ని పన్నులతో కలుపుకుని కేవలం 2,129 మనకు వచ్చేది. ఆ ధరకు కొనాలంటే మనం టైం మిషన్‌లో 1961కి వెళ్లాలి. ఇక ఇదే స్కూటర్‌కి వెనుక సీటు, స్పేర్ వీల్ , ట్యూబ్ కావాలంటే అదనంగా మరో రూ. 114 చెల్లిస్తే సరి. ఇప్పుడంటే డౌన్‌పేమెంట్ కట్టి ఈఎంఐలకి వెళ్లడం సాధారణ విషయంగా మారింది. కానీ 80ల్లో అదేంతో కష్టమైన పని. 80వ దశకంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా వచ్చిన రాజ్‌దూత్ తన అమ్మకాలు పెంచుకునేందుకు ఈఎంఐని ప్రవేశపెట్టింది. కేవలం రూ. 3,500 కడితే చాలు బండి మీ సొంతం అంటూ ప్రకటనలు గుప్పించింది. మైలేజీ రావాలంటే 100 సీసీ నుంచి 125 సీసీ, పవర్ కావాలంటే 150 సీసీ నుంచి 350 సీసీ బైకులు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. కానీ 1963లోనే ఏకంగా 750 సీసీ ఇంజన్‌తో బైకును మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ పేరుతో వచ్చిన బైక్ ఆ రోజుల్లో ఓ సంచలనం. దేశీ వాహన తయారీ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రాని ప్రత్యేక స్థానం. పదిహేనేళ్ల కిందటి వరకు కూడా రూరల్ ఇండియా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో మహీంద్రా జీపులది ప్రత్యేక స్థానం. అయితే 1960 మహీంద్రా జీపు ధర కేవలం రూ. 12,421 మాత్రమే. అంతేకాదు ఆ రోజుల్లో అమ్మకాలు పెంచేందుకు రూ. 200 డిస్కౌంట్ కూడా ప్రకటించింది. జనరల్ మోటార్స్ వారి షెవర్లేట్ కారుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందరికీ సుపరిచితమైన బ్రాండ్. స్వాతంత్రానికి పూర్వం షెవర్లెట్ కారును కలిగి ఉండటం స్టేటస్ సింబల్‌గా ఉండేది. ఈ రోజుల్లో రచయితలు తమ కథనాయకుడు, నాయికల ఎంత ధనవంతులో వర్ణించేందుకు షెవర్లెట్ పేరును తరచుగా ఉపయోగించేవారు. 1936లో షెవర్లెట్ కారు ధర రూ.3,675. ఈ ధరకు ఇప్పుడు కారు టైరు కూడా రావడం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అత్యధికంగా ఉపయోగించిన కారు అంబాసిడర్. ఆ తర్వాత పద్మినీ ప్రీమియర్, స్టాండర్డ్ హెరాల్డ్‌లు. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ మోటార్స్ తయారు చేసిన ఈ కార్లు ఇంచుమించు 2000 వరకు ఇండియా రోడ్లపై తమ ఆధిపత్యం చూపించాయి. 1972లో ఆ కార్ల ధరలు ఎలా ఉన్నాయో ఈ లుక్కేయ్యండి. కార్లకు ఇప్పుడైతే ఎక్సైజ్ డ్యూటీ కారు ఇంజన్ కెపాసిటీని బట్టి 12.50 శాతం నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నారు. 1963లో స్టాండర్డ్ కంపానియన్ కారు ధర రూ. 12,635 అయితే ఎక్సైజ్ డ్యూటీ కేవలం రూ. 333 మాత్రమే. ఇప్పుడీ పాత జ్ఙాపకాలన్నీ ఎందుకు తెరపైకి వచ్చాయంటే.... ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫియట్ కారుకు సంబంధించిన పేపర్ యాడ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ యాడ్‌లో ఫియట్ కారు ధర రూ.9,800లుగా ఉంది. ఆహ్ ! ద గుడ్ ఓల్డ్ డేస్ అంటూ కామెంట్ పెట్టారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. తమ అనుభవాలను కూడా షేర్ చేసుకున్నారు. Ah the good old days… pic.twitter.com/SNH3Cwirki — anand mahindra (@anandmahindra) July 14, 2021 -
World Cycling Day: సైకిల్ తొక్కగలవా ఓ నరహరి !
వెబ్‌డెస్క్: ఇప్పుడంటే కార్లు, బైకుల జమానా నడుస్తోంది కానీ, ఆర్థిక సంస్కరణలు అమలు కాకముందు 90వ దశకం వరకు సైకిల్ అనేది మనదేశంలో ఓ ప్రీమియం వస్తువు. ఇప్పుడు దేశంలో పెద్ద బ్యూరోక్రాట్లుగా, రాజకీయ నాయకులుగా పేరు తెచ్చుకున్న ఎందరో తమ జీవితంలో తొలి అభివృద్ధి పథాన్ని సైకిల్ తొక్కడంతోనే మొదలెట్టారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన సైకిల్ క్రమంగా సైడయి పోతోంది. మగమహరాజులకు ప్రత్యేకం 90వ దశకం వరకు పల్లె, పట్నం తేడా లేకుండా పెళ్లి సంబంధాలు మాట్లాడేప్పుడు సైకిల్ పెట్టడం అనేది ఘనతకు చిహ్నంగా ఉండేది. సైకిల్ విషయం తేలిన తర్వాతే మిగిలిన మాట ముచ్చట నడిచేవి. ఇక పిల్లలు స్కూల్‌కి వెళ్లడం దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్లు పొలం పనులకు వరకు అన్నింటా సైకిల్‌కి ప్రత్యేక స్థానం ఉండేది. పాలు, పేపర్ బాయ్‌లకు సైకిలే జీవనాధారం. అద్దెకు సైకిళ్లు ఇచ్చే సెంటర్లు ప్రతీ టౌనులో ఉండేవి. సినిమా థియేటర్లు, స్కూళ్లలో సైకిల్ స్టాండులే ఉండేవి.... ఎక్కడో ఒక చోట వెహికల్ పార్కింగ్లు ఉండేవి. ఆరోజుల్లో కుర్రకారు ప్రేమ సందేశాలు పంపేదుకు సైకిలెక్కి అమ్మాయిల చుట్టూ శాటిలైట్లలాగా చక్కర్లు కొట్టేవారు. అప్‌కమింగ్ స్టార్‌గా చిరంజీవి ‘నీ దారి పూల దారి’ అంటూ ఎనిమిది రోజుల పాటు నాన్ స్టాప్‌గా సైకిల్ తొక్కి మగ మహరాజుల వెండితెర బాక్సాఫీస్‌ని ఏలితే... అంతకంటే ముందే సైకిల్ ఎక్కిన ఎన్టీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనుడయ్యాడు. అంతటి ఘన చరిత్ర కలిగి సైకిల్‌కు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది ఐక్యరాజ్య సమితి. ప్రతీ ఏడు జూన్ 3వ తేదిన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుతోంది. ఇలా వచ్చింది ప్రతీ ఏటా జూన్ 3 ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా పాటిస్తున్నారు. పోలాండ్‌కి చెందిన లెస్జెక్ సిబిల్స్కి అనే సామాజికవేత్త చేసిన కృషి కారణంగా సైకిల్ డే ఆవిర్భవించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రకటించాలంటూ సైకిల్ వేసుకుని తిరుగుతూ 57 ఇతర దేశాల మద్దతు కూడగట్టారు. సైకిల్ పెడల్స్ అరిగేలా ఐక్యరాజ్యసమితి కార్యాలయం చుట్టూ సైకిల్‌పై తిరిగారు. చివరకు ఆయన శ్రమ ఫలించి 2018లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 03ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించారు. కాలుష్య రహితం కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న ఒకే ఒక్క అంశం గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ సమతుల్యత కాపాడటం. కాలుష్యం విడుదల చేయకుండా రవాణా సౌకర్యం కల్పించడం సైకిల్ ప్రత్యేకత. అంతేకాదు సైకిల్ తొక్కడం వల్ల శారీరక వ్యాయమం కూడా కలుగుతుంది. మెయింటనెన్స్ ఖర్చు అతి తక్కువ. ఇలా సైకిల్‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సూచనలతో కాలుష్యం తగ్గించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సైక్లింగ్‌ను ప్రోత్సహించాలంటూ సభ్య దేశాలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తోంది. అనేక దేశాలు ఈ సూచనలు పాటిస్తున్నాయి. మన దగ్గర రోడ్లపై సైక్లింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో సంజీవయ్య పార్కు, వరంగల్‌లో నిట్ దగ్గర ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. -
అర్బన్ నోస్టాల్జిస్ట్లు
పాత మేడ.. ఇల్లు.. ఏదైనా సరే.. ఓ జ్ఞాపకం. మన పెద్దల కష్టానికి, మన బాల్యానికి, కుటుంబ అనుబంధాలకు! ఆలాంటి ఆస్తి చెమ్మపట్టి మెత్తగా జారిపోతుంటే.. పొడి రాలి చూరు కూలిపోతుంటే.. ప్రాణం పోయినంత పనవుతుంది. దాని కోసమే అమ్మానాన్నతో గొడవలు.. అన్నదమ్ములతో యుద్ధాలు.. అక్కాచెల్లెళ్లతో మాటపట్టింపులూ జాస్తే. అది వేరే విషయం. పట్టణాల్లో ఉన్న అలాంటి ప్రాపర్టీని రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌కు ఇచ్చి అపార్ట్మెంట్స్లా మార్చకుండా.. కమర్షియల్ కాంపెక్స్‌లు కట్టకుండా.. ఆ పాత ఇంటి శోభ పెరిగేలా.. జ్ఞాపకాల ఊటను పదిలంగా కాపాడే మార్గం ఏమైనా ఉంటే? ఆ తలుపు తట్టకుండా ఉంటామా? వెంటనే చిరునామా వెదకమూ! అయితే కోల్‌కత్తాలోని అర్బన్ నోస్టాల్జిస్ట్ల గురించి తెలుసుకోవాల్సిందే! కోల్‌కత్తాలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఆర్కిటెక్ట్స్, సౌందర్యాభిరుచి ఉన్న వ్యక్తులు కొందరు.. దాదాపు నలభై మంది కలిసి ఈ పని చేస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలే రుజువులు. బ్రిటిష్ విక్టోరియన్ నిర్మాణ శైలికి లోకల్ ఈస్తటిక్స్‌ను మేళవించి కట్టిన, అమ్మకానికి ఉన్న వందేళ్ల నాటి భవంతులు, ఇళ్లను ఈ అర్బన్ నోస్టాల్జిస్ట్లు తీసుకుంటున్నారు. పెద్ద హాళ్లు.. విశాలమైన వరండాలు.. ఎత్తయిన పైకప్పులు.. పొడుగు కిటికీలు.. మొజాయిక్ ఫ్లోరింగ్‌లు.. ఇలా ఆ భవనాల యాంటిక్, యూనిక్నెస్లను అంగుళం కూడా డిస్టర్బ్ చేయకుండా.. వాటిని అలాగే ఉపయోగించుకుని కొత్తగా మారుస్తున్నారు. ఆ ఇళ్ల ప్రత్యేకతను బట్టి బోటిక్ కమ్ హోటల్స్‌గా, ఆర్ట్ స్టూడియో, గ్యాలరీస్గా, రెస్టారెంట్ కమ్ లైబ్రరీగా, మీటింగ్ ప్లేసెస్‌గా, డ్రామా థియేటర్స్‌గా.. అంటే కొత్త ఆసామి ఆస్తకులు, అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ‘‘కొందరేమో అమ్మకుండా.. ఆధునిక హంగులను జోడిస్తూ రెనోవేషన్ కోరుకుంటున్నార’’ ని చెప్పారు ఈ నలభై మందిలో ఒకరైన మాళవికా బెనర్జీ. మొత్తానికి కోల్కత్తా నగరానికి ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌ను కాపాడుకోవాలనుకునే యజమానులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా ఈ అర్బన్ నోస్టాల్జిస్ట్లనే సంప్రదిస్తున్నారట.. ఆస్తిని అమ్ముకున్నా.. అదొక జ్ఞాపకంలా మదిలో మాత్రమే మిగలకుండా.. కంటిముందూ కనబడుతూండడంతో ఒకింత తృప్తి.. ఇంకెంతో నిశ్చింత అనుకుంటూ! ప్రస్తుతం కోల్‌కత్తాలో ఇలాంటి వాటికే డిమాండ్ పెరిగి. ఓ ట్రెండ్‌లా సాగుతోంది.. అర్బన్ నోస్టాల్జిస్ట్స్ అనే కొత్త పేరూ యాడ్ అయింది. వాళ్ల వెబ్‌సైట్స్‌కు ట్రాఫిక్ ఎక్కువైంది. ఇది కోల్కత్తా తీరం వెంట వైజాగ్కూ చేరి.. వయా విజయవాడ హైదరాబాద్‌కు రావడానికి ఇంకెంతో కాలం పట్టకపోవచ్చేమో! మంచిదే.. శుభ పరిణామమే! -
అప్పట్లో ఇంతే..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి కాజోల్ సోషల్ మీడియాలో తరచూ పోస్ట్‌లు, ఫోటోలతో అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారు. తాజాగా ఆమె 1990ల నాటి ఫోటోను పోస్ట్ చేసి అభిమానులకు పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చారు. ఫోటోతో పాటు అప్పటి ఫోన్లు ఇంత పెద్దగా ఉండేవని..షూస్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయని, వాటిని ఇప్పుడు తాను మిస్ అవుతున్నానని రాసుకొచ్చారు. ఈ ఫోటోలో కాజోల్ లెమన్ కలర్ డ్రెస్ ధరించి, భారీ సైజ్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌తో కనిపించారు. ఈ ఫోటోను చూసిన అభిమానులంతా 1990ల్లో అలరించిన బాజీగర్ రోజుల్లోకి వెళ్లామని చెబుతున్నారు. ఇక కాజోల్ త్వరలో ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో నటిస్తారు. ఆనంద్ గాంధీ గుజరాతీ నాటకం బేటా కగ్డో ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. -
కలహాల జంటకు నెలకే విడాకులు
సాక్షి, బెంగళూరు: జీరోసైజ్, స్లిమ్ ఫిట్‌లపై వ్యామోహం కొత్త దంపతుల మధ్య విడాకులకు దారి తీసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ భర్త అర్జీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరంలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న వ్యక్తికి నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతితో వివాహమైంది. ఆమె కొద్దిగా లావుగా ఉండడంతో మొదట యువకుడు వివాహానికి అంగీకరించలేదు. అయితే అతని తల్లి ఒత్తిడితో కాదనలేక సుమారు నెలకిందట ఆ యువతికి మూడుముళ్లు వేశాడు. లావుగా ఉన్న తాను నాజూగ్గా మారాలనే తాపత్రయంతో చాలాకాలంగా డైట్ చేస్తున్న యువతి అత్తవారింట్లోనూ అనుసరించేది. కేవలం ఆకు కూరలు, పచ్చి కూరగాయలు మాత్రమే తీసుకునేది. తనతో పాటు భర్తకు, అత్తకు కూడా వాటినే ఆహారంగా తీసుకోవాలంటూ కొత్త కోడలు ఒత్తిడి చేసేది. ఇవి తమకు పడవని తమ కోసం ప్రత్యేకంగా వంట చేయాలంటూ భర్త చెప్పేవాడు. యువతి మాత్రం ఇవే తినాలంటూ ఇరువురిని బలవంతపెట్టేది, వినకపోతే భర్త, అత్తను ఇష్టమొచ్చినట్లు కొట్టేది. ఇదే క్రమంలో ఒకసారి అత్తపై దాడికి పాల్పడగా ఆమె చెయ్యి కూడా విరిగింది. ఇంట్లో ప్రతి చిన్న విషయానికీ భర్తతో గొడవ పడుతుండేవారు. వేరు కాపురం పెట్టాలని పోరుపెట్టేది, దీనికి భర్త ససేమిరా అనేవాడు. తట్టుకోలేనంటూ.. కోర్టుకెక్కిన భర్త భార్య వేధింపులు శృతి మించాయంటూ ఆ భర్త విడాకులు కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమయ్యాడు. అందులో భాగంగా న్యాయవాది చేతన్ పటేల్‌ను కలిసి విషయాన్ని తెలిపారు. అయితే వివాహం జరిగి నెల రోజులు మాత్రమే కావడంతో విడాకులకు నిబంధనలు ఒప్పుకోవని న్యాయవాది తేల్చిచెప్పారు. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లి బలవంతం మేర వివాహం చేసుకోవాల్సి వచ్చిందని, మరుసటి రోజు నుంచే భార్య వేధింపులు మొదలయ్యాని భర్త ఆ వకీల్కు మొరపెట్టుకోగా, ఆ అంశాల ప్రకారం భార్య, భర్తకు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టులో అర్జీ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు భార్య అభిప్రాయాన్ని కోరగా తమకు కూడా ఈ వివాహం ఇష్టం లేదని తల్లితండ్రులు బలవంతం మేరకే వివాహానికి అంగీకరించినట్లు తెలిపారు.దీంతో ఇరువురి సమ్మతం మేరకు కుటుంబ న్యాయస్థానం కలహాల దంపతులకు విడాకులు మంజూరు చేసింది. -
నేను పుట్టకముందే అమ్మ చంపేద్దామనుకుంది
తాను ఇంకా పుట్టకముందే తన తల్లి తనను చంపేద్దామనుకున్నారని గోవా గవర్నర్ మృదులా సిన్హా తెలిపారు. తన తల్లి 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడంతో.. జనం ఏమనుకుంటారోనని ఆమె అలా చేశారని గవర్నర్ చెప్పారు. పణజిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆడ శిశువులను రక్షించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇస్తున్నప్పుడు తనకీ సంఘటన గుర్తుకొచ్చిందని, తన తండ్రే తన ప్రాణాలు కాపాడారని ఆమె చెప్పారు. అబార్షన్ కోసం తన తల్లి అప్పట్లో ఏవో మాత్రలు మింగారని, అయితే తన తండ్రి సమాజం గురించి భయపడకుండా ఆమెను వెంటనే సమీపంలోని నగరంలో గల ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి.. తనను బతికించారని గవర్నర్ వెల్లడించారు. అంతకుముందున్న సంప్రదాయ బంధనాలను తన తండ్రి ఛేదించి.. తన కాళ్ల మీద తాను నిలబడేలా మంచి చదువు చెప్పించారని అన్నారు. ఇప్పుడున్న 'బేటీ బచావో, బేటీ పఢావో' అన్న నినాదానికి అదనంగా 'పరివార్ బచావో' అనే నినాదం కూడా ఇవ్వాల్సి ఉందని మృదులా సిన్హా చెప్పారు. ఒకప్పుడు అమ్మాయిలను కూడా అబ్బాయిల్లా పెంచాలని చెప్పేవారని.. ఇప్పుడు అలా చెప్పాల్సిన అవసరం ఇక లేదని, పల్లెటూళ్లలో కూడా చాలామంది తండ్రులు తమ పిల్లలను బాగా చదివిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను పాటించాలని అందరికీ సూచించారు. -
వీసాల్జియా...
మెడిక్షనరీ నాస్టాల్జియాలా వినిపిస్తోంది కదూ! మందెక్కువైన స్థితిలో చాలామంది నాస్టాల్జియాలోకే వెళతారు. కిక్కు తలకెక్కిన దశలో గతాన్నంతా తవ్వి తలకెత్తుకుంటారు. మర్నాడు నిద్రలేవడంతోనే తలదిమ్ముగా, కళ్లు మంటలుగా, కడుపులో వికారంగా ఉంటుంది. పక్క మీద నుంచి లేవడమే కష్టంగా ఉంటుంది. ఎలాగోలా కాలకృత్యాదికాలు కానిచ్చుకుని, రొటీన్లో పడ్డా... రోజంతా నిస్సత్తువగా, ఒళ్లంతా భారంగా అనిపిస్తుంది. డోసెక్కువైతే ఇలాగే ఉంటుంది మరి. దీన్నే మామూలు భాషలో హ్యాంగోవర్ అంటారని తెలిసిందే. దీనినే వైద్య పరిభాషలో ‘వీస్టాల్జియా’ అంటారు. నార్వేజియన్ పదం ‘వీస్టా’ అంటే తప్పతాగడం వల్ల తలెత్తే ఇబ్బంది అని అర్థం. గ్రీకు భాషలో ‘ఆల్జియా’ అంటే నొప్పి అని అర్థం. ఈ రెండు పదాలను మిక్స్ చేసి ఈ పదాన్ని కనిపెట్టారు వైద్యులు. -
అందమైన సూర్యకాంతం....
వ్యాంప్ నాస్టాల్జియా సూర్యకాంతం ఎప్పుడూ నాజుగ్గా ఉండాలనుకోలేదు. గయ్యాళితనానికి ఆ పాటి శరీర పుష్టి ఉండాలనుకొని ఉండొచ్చు. కాని నాదిరా అలా కాదు. చివరి వరకూ గ్లామర్ మెయింటెయిన్ చేసింది. గయ్యాళి పాత్రలు చేస్తే ఏమి? అందగత్తెలు గయ్యాళులు కాకూడదా? నాదిరా అనగానే అందరికీ శ్రీ 420లో ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ పాట గుర్తుకు వస్తుంది. తొలి సినిమా మహబూబ్ ఖాన్ ‘ఆన్’ అయితే ఆ తర్వాత ‘వారిస్’, ‘దిల్ అప్నా ప్రీత్ పరాయ్’ వంటి సినిమాలో ఆమె ప్రేక్షకులు గట్టిగా జ్ఞాపకం ఉంచుకునే పాత్రలు చేసింది. ఆంగ్లో ఇండియన్స్ మీద మన తెలుగు నిర్మాత బి.నాగిరెడ్డి నిర్మించిన హిట్ చిత్రం ‘జూలీ’లో నాదిరా పోషించిన తల్లి పాత్ర ఎవరూ మర్చిపోలేరు. దయా కనికరం లేనట్టుగా కనిపించే ముఖం, మాటలతో నాదిరా పాత్రలను రక్తి కట్టించేది. అయితే ఆమె నటించాల్సినన్ని సినిమాల్లో నటించలేదనే చెప్పాలి. తెర మీద కనిపించినట్టుగానే తెర వెనుక కూడా ఆమె చాలా డైనమిక్‌గా ఉండేది. పార్టీలు... స్నేహితులు... ప్రతి రోజూ ఒక ఉత్సవమే. బాగ్దాద్‌కు చెందిన యూదుల కుటుంబంలో పుట్టిన నాదిరా (అసలు పేరు ఫ్లోరెన్స్ నజకిల్ నాదిరా) ముంబై ఇండస్ట్రీనే తన కుటుంబం అనుకుంది. ఇద్దరు సోదరులు ఉండేవారని, వాళ్లు ఇజ్రాయిల్లోనో అమెరికాలోనో స్థిరపడ్డారని అంటారు. ‘మహల్’ సినిమాలో ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’... వంటి సూపర్‌హిట్ పాటలు రాసిన ‘నక్షబ్’ అనే కవిని ఆమె పెళ్లాడింది. అయితే కాపురం రెండేళ్లే. విడాకులు తీసుకున్నాక అతడు పాకిస్తాన్ వెళ్లిపోయి చిన్న వయసులోనే మరణించారు. ఇంకెవరో ముక్కూముఖం తెలియనివాణ్ణి రెండో పెళ్లి చేసుకుని వారం రోజుల్లోనే తరిమి కొట్టింది. ఆమె టాలెంట్, స్క్రీన్ మీద ఇతరులు డామినేట్ చేసే సామర్థ్యమే ఆమె పాలిట శత్రువులయ్యాయేమో తెలియదు. నాదిరాకు గొప్ప సాహితీ పరిజ్ఞానం ఉంది. రాజకీయాలు కొట్టిన పిండి. మూడు నాలుగు భాషల్లో అద్భుత పాండిత్యం ఉంది. ఇంత ఉన్నా సాయంత్రమైతే పిలవని బాలీవుడ్ పార్టీలకు కూడా వెళ్లి తాగుతూ కూచునేది. కొన్నాళ్లు దీనిని పరిశ్రమ భరించినా ఆ తర్వాత విసుక్కోవడం ప్రారంభించింది. ముంబై మహలక్ష్మి టెంపుల్ సమీపంలోని చిన్న ఫ్లాట్‌లో ఒక్కత్తే జీవించిన నాదిరా చివరి రోజుల్లో సయాటికా వల్ల ఒకటి రెండేళ్లు మంచానికే పరిమితమైంది. దీప్తి నావెల్ వంటి ఒకరిద్దరు తప్ప ఆమెకు స్నేహితులు మిగల్లేదు. దిలీప్ కుమార్, రాజ్‌కపూర్ వంటి నటులతో ఢీ అంటే ఢీ అన్నట్టు నటించిన ఆ ప్రతిభావంతమైన నటి 2006లో తన 73వ ఏట మరణించింది. -
ఆ 60 నిమిషాలు...
నైన్టీ మినిట్ క్యాసెట్ ఎప్పుడూ కొనొద్దని చెబుతారు. టేప్‌రికార్డర్ లోడ్ లాగలేదట. సిక్స్టీ ఓకే. అటు తర్టీ మినిట్స్. ఇటు తర్టీ మినిట్స్. అటు ఎనిమిది.. ఇటు ఎనిమిది.. మొత్తం పదహారు పాటలు. ఇష్టమైన పాటలు. మన కోసం మనం సెలెక్ట్ చేసుకొని మేడ మీద సన్నజాజుల పొద దగ్గర చాప పరుచుకుని నెత్తిన చంద్రుణ్ణి చూస్తూ ఆ దాపు నుంచి వచ్చే సముద్రపు గాలికి ‘ఏ రాతే.. ఏ మౌసమ్.. నదీకా కినారా’... వినిపిస్తూ...షావుల్ భాయ్ ఒక పట్టాన ఇవ్వడు. సిక్స్టి మినిట్స్ క్యాసెట్‌కు పది రూపాయలు తీసుకుంటాడు. మనం వెళ్లి క్యాసెట్ సెలెక్ట్ చేసుకోగానే సొరుగులో నుంచి పసుప్పచ్చ, నీలం, పింక్ కలర్ చార్ట్ బుక్కులను ముందు పడేస్తాడు. స్కెచ్ పెన్లతో చేత్తో రాసిన పాటల క్యాటలాగులు. సంకీర్తన, అభినందన, గీతాంజలి... ఎప్పుడు షాపుకెళ్లినా స్టూల్ మీద నిలబెట్టిన రెండడుగుల స్పీకర్ బాక్సుల్లో అదే పనిగా రికార్డయ్యే పాట ఒకటి వినిపించేది. హృదయమనే కోవెలలో... నిను కొలిచానే దేవతగా.... ఇంకో పాట కూడా. ఒక లైలా కోసం... తిరిగాను లోకం... కోళ్లదిన్నె, తుమ్మలపెంట వైపు నుంచి వచ్చే బెస్తవాళ్లకు ఇవన్నీ పట్టవు. పుట్టింటోళ్లు తరిమేశారు... దీనిని ఎక్కించాక యమగోల, అత్తమడుగు వాగులోనా... లారీ డ్రైవర్లు, ట్రాక్టర్ కూలీలూ, హెయిర్ కటింగ్ సెలూన్ ఓనర్లూ... షావూల్ భాయ్ ఎంతమందికని జవాబు చెప్తాడు? అందరికీ పాటల క్యాసెట్లు కావాలి. వాళ్లు ఎంచుకున్న పాటలతో నిండిన క్యాసెట్లు. మొగుడు మారడు. పెళ్లాం టేస్ట్ పట్టించుకోడు. ఆమెకు కూడా తనకంటూ ఇష్టమైన పాటల క్యాసెట్ ఒకటి చేయించుకోవాలని ఉంటుంది కదా. మసాలాలో, మిరప్పొడిలో రూపాయి రూపాయి దాచి... షావుల్ భాయ్‌ని బతిమాలి... ఒకవైపు న్యాయం కావాలి... ఒకవైపు పుణ్యస్త్రీ.... ఈ రోజే ఆదివారము... అందాకా పడుచువారము... చాలాస్నేహాలు సర్వనాశనం అయిపోయాయి. వాడా... ఇళయరాజా క్యాసెట్ అడిగితే ఇవ్వనన్నాడు... అరిగిపోతాడా... కరిగిపోతాడా.... అవును. అరిగిపోతాడు. తెగిన క్యాసెట్లను అతికించి ఇమ్మని ఇచ్చినవి ఒక వైపు గుట్టగా పడి ఉంటాయి షావుల్ భాయ్ షాపులో. మనం అతికించలేము. పెన్ను పెట్టి రివైండ్ చేసి ప్లాస్టిక్ టేపుతో సరిగ్గా ఈ అంచునూ ఆ అంచునూ జతచేయలేము.కాకపోతే కొంచెం జంపవుతుంది. పల్లవిలో ఒక తుంటపోతుంది. లేకుంటే చరణంలో. గాలివానలో... వాన... కర్రరర్... తెలియదు పాపం... ఉంగరాలు, బంగారు బొంగరాలు... ఇవి ఉన్నవాడు కాదు ఐశ్వర్యవంతుడు. స్పైన్ మీద మన పేరు ఉన్న క్యాసెట్లు డజన్... అలా అల్మారాలో కనిపిస్తూ... కింద ఎల్లో శాటిన్ క్లాత్ కప్పిన టూ ఇన్ ఒన్ మిడిసిపడుతూ... వాడూ వీధిలో గౌరవనీయుడు. ఎప్పుడైనా సరదా పుడితే రెడ్ కలర్ రికార్డ్ బటన్, బ్లాక్ కలర్ ప్లే బటన్ ఒక్కసారే నొక్కి పిల్లల మాటలు రికార్డ్ చేసి వాళ్ల మాటలు వాళ్లకే వినిపిస్తూ మెరుస్తున్న కళ్లతో వాళ్లు చూస్తుంటే గర్వపడుతూ... అదీ వైభోగం. రేడియో పాత చుట్టం. టేప్ రికార్డర్ కొత్త అతిథి. సోనీ నైన్టీ కొనే డబ్బులు ఎప్పుడూ ఉండవు. సిక్స్టీ కూడా. ఖరీదు ఎక్కువ. టి-సిరీస్ చీపేగాని తొందరగా నలిగిపోతాయని కటింగ్ చేసే మాల్యాద్రన్న చెప్పేవాడు. ఇక మధ్యస్తంగా మిగిలింది టిడికె క్యాసెట్లే. నల్లగా, బరువుగా టి..డి...కె.. అనే అక్షరాలతో ఆకర్షిస్తూ... అలాంటి ఒక క్యాసెట్ కొని... ఇష్టమైన రఫీ పాటలు చేయించుకొని... కాని ఎలా? సంవత్సరమంతా వడగాడ్పులు వీచినా రంజాను నెలలో అత్తరు వానలు కురుస్తాయి. పిల్లల చేతుల్లో కుర్రాళ్ల జేబుల్లో నాలుగు డబ్బులు కదలాడతాయి. షావుల్ భాయ్... ఇక నీ షాప్‌కు వచ్చి ఉత్త చేతులతో తిరిగెళ్లే సమస్యే లేదు. గోడలకు వేళ్లాడగట్టిన శంకరాభరణం, ఆనందభైరవి ఎల్.పి కవర్లను చూస్తూ ఒక టిడికె క్యాసెట్ కొని... రఫీ పాటలు కావాలంటే... ఏ సినిమాల్లోని పాటలు అన్నాడు షావుల్ భాయ్. పేర్లేం తెలుసు. ఆ సినిమాలు చూస్తే కదా. రేడియోలో వినడమే. సరే... నీకు నచ్చిన నాలుగు పాటలు చెప్పు... నీ టేస్ట్ కనిపెట్టి మిలిగిన పాటలు చేసిస్తాను అన్నాడు షావుల్ భాయ్. కౌన్ హై జో సప్నోమే ఆయా... చాహుంగ మై తుజే సాంజ్ సవేరే... లిఖ్ఖేజో ఖత్ తుఝే ఓ తేరి యాద్ మే.... ఆజారే ఆ జరా... చాలు. అర్థమైంది. వారం తర్వాత రా. క్యాసెట్ అందుకుని దానికి ఒక కాగితం చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసి పైన పేరు రాశాడు. వారం వరకూ నిద్రే లేదు. ప్రేమలో పడ్డవాడు కూడా అంత విరహం అనుభవించడు. వారం తర్వాత పాటలను అలంకరించుకున్న ఆ నిరుపమాన సౌందర్యవతి చేతుల్లో పడింది. షావుల్ భాయ్ టేస్ట్ కనిపెడతానన్నాడు. ఎలా కనిపెడతాడు. ప్లే బటన్ నొక్కితే మొదటి పాట- ఏక్ థ గుల్ ఔర్ ఏక్ థి బుల్బుల్... రెండో పాట- తేరే మేరే సప్నే అబ్ ఏక్ రంగ్ హై.... వాటిని వింటూ అనేక రాత్రులు నిద్రపోలేదు. ఆ రోజులు పోయాయి. క్యాసెట్లూ పోయాయి. అమాయక ముఖాలతో మూగే జన సందోహం మాయమయ్యింది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రికార్డులను ఎవరికో ఇచ్చేసి షావుల్భాయ్ నెల్లూరు వెళ్లిపోయాడు.జ్ఞాపకాలు మాత్రం కావలిలో ఉండిపోయాయి.ఈ ఎండల్లో ఎప్పుడైనా నిద్రపట్టకపోతే ఆ తలపులే కాసిని నిద్రమాత్రలు. - ఖదీర్