రాచ మర్యాదలతో గుర్రపు బగ్గీతో సర్వేపల్లిని తీసుకువెళ్లిన రాణి
క్వీన్ ఎలిజబెత్-2 జీవితం.. బ్రిటన్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం గుర్తుంచుకోదగిన ఒక అధ్యాయం. సుదీర్ఘకాలంగా ఒక రాజ్యాన్ని పాలించిన సామ్రాజ్ఞిగా ఆమె తనకంటూ ఓ చెరగని ముద్రవేసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు.. తన హయాంలో పలు దేశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారామె. అందులో భారత్ కూడా ఉండగా.. ఆ ఆదరాభిమానాలకు అద్దం పట్టిన ఘటనే ఇది..
క్వీన్ ఎలిజబెత్-2 ప్రయాణంలో భారత ఆధ్యాయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆమె భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఒకప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లండన్ పర్యటన సందర్భంగా స్వయంగా ఆమె కదిలివచ్చి స్వాగతం పలికారు.
1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1963లో బ్రిటన్‌లో పర్యటించారు. ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, సంస్కరణల వాదిగా ఎంతో పేరున్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మునుపెన్నడూ లేనంతగా బ్రిటన్‌లో రాయల్ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్-2 స్వయంగా విక్టోరియా రైల్వే స్టేషన్‌కు వచ్చి సర్వేపల్లికి స్వాగతం పలికింది. తనతో పాటు ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్‌ను కూడా స్టేషన్‌కు తోడ్కోని వచ్చింది.
ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్‌లను పరిచయం చేసిన రాణి(photo credit : BFI)
రాజకుటుంబ ప్రముఖులతో పాటు, దేశంలోని అత్యున్నత సైన్యాధికారులు వెంట రాగా సర్వేపల్లిని జాతీయ గీతం జనగణమన ఆలాపనతో రాజమర్యాదలు చేసి తన వెంట తీసుకెళ్లారు రాణి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మొత్తం 11 రోజుల పాటు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. బ్రిటన్ సాధనసంపత్తికి అద్దం పట్టే పరిశ్రమలు, భవనాలు, వంతెనలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో సర్వేపల్లి పర్యటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటి బ్రిటన్ సాంప్రదాయ గుర్రపు పందాలను చూడడానికి వచ్చినప్పుడు రాణి ఎలిజబెత్ స్వయంగా వెంట వచ్చారు.
నాటి రాష్ట్రపతి సర్వేపల్లికి రాణి ఎలిజబెత్ ఆహ్వానం(photo credit : BFI)
నాటి వీడియోలో ఎలిజబెత్ ఎంతో హుందాగా, మరెంతో అందంగా కనిపించారు. వీడియోలో మూడు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు బ్రిటీష్ వస్త్రధారణలో రాణి కనిపించగా, చాలా మంది భారతీయ మహిళలు ఆనాటి సంప్రదాయ చీరలో కనిపించారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎలిజబెత్ కన్నుమూసిన సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ వీడియో నాటి చరిత్రను కళ్ల ముందుంచింది.
కర్టెసీ : BFI
(బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నేషనల్ ఆర్కైవ్ నుంచి సేకరించిన వీడియో ఆధారంగా)
Comments
Please login to add a commentAdd a comment