Nostalgia Marketing Childhood Memories Business Trends Cover Story In Telugu - Sakshi
Sakshi News home page

Nostalgia Marketing: జ్ఞాపకాల అంగడి

Published Sun, Feb 19 2023 12:49 PM | Last Updated on Sun, Feb 19 2023 3:26 PM

Nostalgia Marketing Childhood Memories Business Trends Cover Story - Sakshi

వీటిలో ఎన్నిటిని గుర్తుపట్టారు? ఓ మై గుడ్‌నెస్‌ అన్నిటినా? 
అయితే మీరు పలు బ్రాండ్లకు మంచి బిజినెస్‌ ఇస్తున్నట్టే!
వాట్‌ ఆర్‌ యూ టాకింగ్‌? ఇవి నా చిన్నప్పటి.. లేదా నా యూత్‌ మెమొరీస్‌.. 
వాటిని బ్రాండ్స్‌ ఏం చేసుకుంటాయి? 
బిజినెస్‌ చేసుకుంటాయి! ఎస్‌.. ఇప్పుడు వినియోగదారుల చిన్ననాటి.. 
టీనేజ్‌ జ్ఞాపకాలే పలు వ్యాపార సంస్థలకు పెద్ద బిజినెస్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. 
ఈ జ్ఞాపకాలే కొత్త బిజినెస్‌కు ఆలోచన పడేలా చేస్తున్నాయి..
నోస్టాల్జియాకున్న పవర్‌ అది! అందుకే దీన్ని నోస్టాల్జియా మార్కెట్‌ అంటున్నారు. 
ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌ తిరుగుతోంది ఈ ఇరుసు మీదే! 

ఇంట్లో.. బయటా.. ఎక్కడ ఏ వస్తువు కనపడినా.. ఏ పరిసరంలో తిరుగాడినా.. ఏ మాటలు.. పాటలు విన్నా.. అవన్నీ ఏదోరకంగా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నవే అయ్యుంటాయి! లేదంటే గతంలోని ఏదో ఒక సందర్భాన్ని.. అపూర్వ క్షణాలను.. వ్యక్తులను గుర్తుచేసేవే ఉంటాయి! 


గమ్మత్తయిన ఓ వర్ణం.. అమ్మకు తను కట్టుకున్న తొలి చీరను గుర్తుచేయొచ్చు. మనవరాలో.. మనవడో.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకుని మరీ కొనుక్కున్న ఓ స్టీల్‌ గిన్నె.. నానమ్మకు తన కాపురాన్ని జ్ఞాపకంలోకి తేవచ్చు. స్పాటిఫైలో పాట.. నాన్నకు తన బాల్యంలోని సినిమా థియేటర్‌ని అతని కళ్లముందు ఉంచొచ్చు. పఫ్‌తో హెయిర్‌ స్టయిల్‌ అత్తను తన యవ్వనపు రోజుల్లోకి తీసుకెళ్లొచ్చు. ఓటీటీ సిరీస్‌లోని ఓ సన్నివేశంతో తన చిన్నప్పుడు దొంగతనంగా కాల్చిన సిగరెట్‌ దమ్ము.. తాతయ్య మది అట్టడుగు పొరల్లోంచి బయటకు రావచ్చు! 



ఇలా జ్ఞాపకల్లేని జీవితం ఉంటుందా? పైగా పాతవన్నీ మధురాలే! అందుకే కదా అన్నారు ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అని! ఈ మాటనే వ్యాపార మంత్రంగా పట్టేసుకున్నాయి పలు వ్యాపార సంస్థలు. 



ఎలాగంటే..
‘ఆరోజుల్లో... ’ అని మొదలుపెట్టే సంభాషణతో చుట్టూ ఉన్న వాళ్లు చిరాకు పడుతుండొచ్చు.  విసుగు చెందుతుండొచ్చు. కానీ.. వ్యాపార సంస్థలు మాత్రం ఆ మాటల ప్రవాహాన్ని పట్టుకుని అందులో ఈది.. ఆ జ్ఞాపకాల్లో తమ బ్రాండ్స్‌ను దొరకబుచ్చుకుని పాత కొత్తల కలయికతో రీమేక్‌ చేసి యాడ్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ ‘యాది’ అనే టెక్నిక్‌ను బిజినెస్‌ ట్రిక్‌గా మలచుకుంటున్నాయి. 

ఈ స్క్రిప్ట్‌కి లీడ్‌ అందింది ఎప్పుడు?
ఇంకెప్పుడూ.. కరోనా టైమ్‌లోనే! భలేవారే.. అన్నిటికీ కరోనాతో ముడిపెడితే ఎలా? అంటే పెట్టాల్సిందే మరి! కరోనాతో కరెంట్‌ ఎరా.. కరోనాకు ముందు.. తర్వాత అని చీలిపోతుందని లాక్‌డౌన్‌లో జోస్యం చెప్పుకున్నాం! నెమ్మదిగా అదిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మార్కెట్‌లో లాభాలు సృష్టిస్తోంది. అంటే  కాలం ఆ విభజనను స్పష్టం చేసిందన్నట్టే కదా! లాక్‌డౌన్‌లో చాలా మంది.. నాటి దూరదర్శన్‌ సీరియళ్లు, పాత సినిమాలు, పాటలతోనే కాలక్షేపం చేశారుట.

ఆ కాలక్షేపంలో పల్లీ బఠాణీలు, పాప్‌కార్న్‌ని కాకుండా ఆ సీరియళ్లతో సమానంగా ఆస్వాదించిన నాటి ప్రకటనలను.. ప్రొడక్ట్స్‌ను.. వాటి తాలూకు తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారని పలు అధ్యయనాల సారాంశం. ఆ సారాన్ని పట్టుకునే వ్యాపార సంస్థలు నోస్టాల్జియాలో మార్కెట్‌ను వెదుక్కున్నాయి. మిలెనీయల్స్‌కీ.. జెన్‌జెడ్‌కీ.. ఆ తరపు మెమోరీస్‌ని కొత్త ర్యాపర్‌లో చుట్టి ప్రకటనల గిఫ్ట్స్‌ని అందిస్తున్నాయి. ఈ జాబితాలో క్రెడ్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నుంచి క్యాడ్‌బరీ దాకా పలు ప్రముఖ బ్రాండ్స్‌ చాలానే ఉన్నాయి.

ఇవి ఇలా కొత్త ర్యాపర్‌లో పాత యాడ్స్‌ను చుట్టి స్క్రీన్‌ మీద పరుస్తున్నాయి. ఆ మధురాలు పాత తరపు వినియోగదారుల భావోద్వేగాలతో కనెక్ట్‌ అయ్యి నాటి ఆనందానుభూతులను తాజా చేసి ఆ బ్రాండ్స్‌ పట్ల వాళ్ల లాయల్టీని పెంచుతున్నాయి. ఈ తరమేమో ఆ గిమ్మిక్‌కి పడిపోయి.. ఆ బ్రాండ్స్‌కి కొత్త కన్జూమర్స్‌గా రిజిస్టర్‌ అవుతోంది. ఇలా ఒకే ఇంట్లో ఆబాలగోపాలన్ని అలరించి.. మెప్పించి తమ ఖాతాను స్థిరపరచుకుంటున్నాయి. 

ఇదే కాక క్రెడ్‌ ఓజీ (OG) పేరుతో రాహుల్‌ ద్రవిడ్, వెంకటేశ్‌ ప్రసాద్, జావగల్‌ శ్రీనాథ్, మనీందర్‌ సింగ్, సబా కరీమ్‌ లాంటి నాటి మేటి క్రికెటర్స్‌తోనూ యాడ్స్‌ రూపొందించింది. ఇలా రిలీజ్‌ అయిన వెంటనే అలా వైరల్‌ అయ్యాయి ఆ ప్రకటనలు. 

ఆ యాడ్స్‌లో కొన్ని..

క్యాడ్‌బరీ..  కుఛ్‌∙ఖాస్‌ హై

90ల్లో.. 
ఒక  క్రికెటర్‌ బ్యాటింగ్‌ చేస్తుంటాడు.. సెంచరీకి చివరి బంతి అన్నమాట. బంతి గాల్లో లేచి.. క్యాచ్‌ అవుతుందా అన్న ఉత్కంఠలో క్యాచ్‌ మిస్‌ అయ్యి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్‌బరీ చాక్‌లెట్‌ తింటూ టెన్షన్‌ పడ్డ అతని గర్ల్‌ఫ్రెండ్‌ ఆనందానికి అవధులుండవు. అలాగే చాక్‌లెట్‌ తింటూ డాన్స్‌ చేస్తూ స్టేడియంలోకి వస్తుంది.. సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని!

ఇప్పుడు
క్రికెట్‌ స్టేడియం.. లేడీ క్రికెటర్‌ బ్యాటింగ్‌ చేస్తుంటుంది. సెంచరీకి ఒక రన్‌ తక్కువగా ఉంటుంది ఆమె స్కోర్‌. ఓ షాట్‌ కొడుతుంది. అది గాల్లో లేచి.. బౌండరీ దగ్గరున్న ఫీల్డర్‌ దోసిట్లో పడబోయి.. మిస్‌ అయి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్‌బరీ తింటూ టెన్షన్‌ పడిన ఆ క్రికెటర్‌ బాయ్‌ఫ్రెండ్‌ సంతోషానికి ఆకాశమే హద్దవుతుంది. అలాగే చాక్‌లెట్‌ తింటూ డాన్స్‌ చేసుకుంటూ స్టేడియంలోకి వస్తాడు సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! 

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌.. ఫైవ్‌స్టార్‌తో కలసి

అప్పుడు.. ఫైవ్‌స్టార్‌
ఇద్దరు యువకులు.. ఓ ప్యాంట్‌ను దర్జీకిస్తూ ‘నాన్నగారి ప్యాంట్‌.. ఒక అంగుళం పొడవు తగ్గించాలి’  అని చెప్పి వాళ్ల వాళ్ల షర్ట్‌ జేబుల్లోంచి ఫైవ్‌ స్టార్‌ చాక్‌లెట్స్‌ తీసి ఓ బైట్‌ తిని .. ఆ ఇద్దరూ మొహాలు చూసుకుని అప్పుడే ఒకరినొకరు గుర్తుపట్టినట్టు.. ‘రమేశ్‌.. సురేశ్‌’ అని పిలుచుకుంటారు. ఇలా చాక్‌లెట్‌ తింటూ.. మైమరిచిపోయి.. దర్జీకి పదేపదే ఆ ప్యాంట్‌ను అంగుళం చిన్నది చేయమని పురమాయిస్తూంటారు. ఈలోపు ఆ ప్యాంట్‌ కాస్త నిక్కర్‌ అయిపోతుంది. 

ఇప్పుడు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌
ఇందులోనూ రమేశ్, సురేశ్‌ ఇద్దరూ ఓ ప్యాంట్‌ తీసుకుని దర్జీ దగ్గరకు వస్తారు. ఆ ప్యాంట్‌ పొడవు తగ్గించాలని పురమాయించి.. ఫైవ్‌స్టార్‌ కోసం జేబులు వెదుక్కుంటూంటారు.. ఖాళీ అయిపోయిన ర్యాపర్స్‌ తప్ప చాక్‌లెట్స్‌ దొరకవు. అప్పుడు వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంటుంది.. ‘ఇప్పటికిప్పుడు చాక్‌లెట్స్‌ కావాలా? స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్‌ చేయండి.. నిమిషాల్లో చాక్‌లెట్స్‌ మీ ముందుంటాయి’ అంటూ! అప్పుడు రమేశ్‌.. సురేశ్‌ పక్కకు చూడగానే చాక్‌లెట్స్‌ పట్టుకుని నిలబడ్డ స్విగ్గీ ఇన్‌స్టామర్ట్‌ డెవలరీ పర్సన్‌ కనపడుతుంది. 

క్రెడ్‌.. (క్రెడిట్‌ కార్డ్స్‌ పేమెంట్‌ యాప్‌)

నాడు..  దీపికాజీ (నిర్మా వాషింగ్‌ బార్‌)
దీపికా చిఖలియా (నాటి టీవీ రామాయణంలో సీత పాత్రధారి) కిరాణా షాప్‌లోకి వెళ్లి.. నిర్మా బట్టల సబ్బు ఇవ్వమని షాప్‌ అతన్ని అడుగుతుంది. ‘దీపికాజీ.. మీరెప్పుడూ సాధారణ సబ్బే కదా తీసుకునేది.. మరిప్పుడూ?’ అంటూ ఆగిపోతాడు. ‘సాధారణ సబ్బు ధరకే నిర్మా బార్‌ వస్తుంటే ఎందుకు కాదనుకుంటాను’ అంటుంది దీపికా. 

నేడు .. కరిష్మాజీ (క్రెడ్‌ పేమెంట్‌ యాప్‌ కోసం)
షాప్‌లోకి వెళ్తుంది కరిష్మా కపూర్‌ సెల్‌ఫోన్‌ చార్జర్‌ కోసం. సాధారణమైన చార్జర్‌ కాక స్టాండర్డ్‌ చార్జర్‌ అడుగుతుంది. ‘కారిష్మాజీ.. మీరు సాధారణంగా మామూలు చార్జరే అడుగుతారు కదా.. మరిప్పుడు?’ అని ఆగుతాడు. సాధారణ చార్జర్‌ ధరకే క్రెడ్‌ బౌంటీ స్టాండర్డ్‌ చార్జర్‌ ఇస్తుండగా ఎందుకు కాదంటాను!’ అంటుంది. 

పార్లే జీ.. భారత్‌ కా అప్‌ నా బిస్కట్‌ (ఈ దేశపు సొంత బిస్కట్‌ )
 

నిరుటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లే జీ ‘ భారత్‌ కా అప్నా బిస్కట్‌ (ఈ దేశపు సొంత బిస్కట్‌)’ పేరుతో నోస్టాల్జియా క్యాంపెయిన్‌ యాడ్‌ను విడుదల చేసింది. ‘స్వాతంత్య్ర సమర ప్రయాణంలో మేమూ కలసి నడిచాం! చాయ్‌ తీపిని.. స్వాతంత్య్ర సాధన సంతోషాన్నీ రెట్టింపు చేశాం! దేశం సాధించిన ప్రతి విజయంలో భాగస్వాములమయ్యాం..’ అంటూ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు దేశం సాధించిన ప్రగతిని చూపిస్తూ.. అప్పటి నుంచీ ఉన్న తన ఉనికినీ ప్రస్తావిస్తూ .. నాటి జ్ఞాపకాల వరుసలో తనను ముందు నెలబెట్టుకుని.. ఇప్పటికీ అంతే తాజాగా ఉన్నానని చెబుతూ తన ప్రొడక్ట్‌ అయిన బిస్కట్స్‌ను మిలెనీయల్స్‌ చేతుల్లో ఉన్న చాయ్‌ కప్పుల్లో.. పాల గ్లాసుల్లోనూ డిప్‌ చేసింది.   

టాటా సాల్ట్‌ కూడా బాక్సర్‌ మేరీ కోమ్‌ను పెట్టి.. ‘దేశ్‌ కా నమక్‌’ పేరుతో నోస్టాల్జియా, సెంటిమెంట్‌ను కలిపి కొట్టి కమర్షియల్‌ యాడ్‌ను రూపొందించింది. అది వర్కవుట్‌ అయింది. మదర్స్‌ రెసిపీ కూడా తన పచ్చళ్ల వ్యాపార ప్రమోషన్‌కు జ్ఞాపకాల ఊటనే వాడుకుంది. దిన పత్రికలూ నోస్టాల్జియా ప్రకటనలనే నమ్ముకున్నాయి. అందుకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ‘హ్యాకీ చాంపియన్‌’ యాడే ఉదాహరణ. ఇవేకాక పేపర్‌ బోట్, గూగుల్‌ వంటి న్యూజనరేషన్‌ కంపెనీలూ నోస్టాల్జియాను ప్లే చేశాయి. 

రీలాంచ్‌ కూడా
నోస్టాల్జియాతో ప్రొడక్ట్‌ ప్రకటలనే కాదు ప్రొడక్షన్‌ ఆగిపోయిన వస్తువులనూ తిరిగి ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాటిల్లో పార్లే వాళ్ల రోలా కోలా ఒకటి. 80లు, 90ల్లో పిల్లలకు ఈ క్యాండీ సుపరిచితం. పదమూడేళ్లుగా ఇది ఆగిపోయింది. కానీ దీనితో ముడిపడున్న తీపి జ్ఞాపకాలు మాత్రం 80, 90ల్లోని పిల్లలతో పాటే పెరిగి స్థిరపడ్డాయి.

అందుకే నాలుగేళ్ల కిందట.. కేరళకు చెందిన 29 ఏళ్ల సిద్ధార్థ్‌ సాయి గోపినాథ్‌ అనే యువకుడు రోలా కోలా ఫొటో పెట్టి.. దాన్ని పార్లేకి ట్యాగ్‌ చేస్తూ ఇది మళ్లీ మార్కెట్లోకి రావాలంటే ఎన్ని రీట్వీట్స్‌ కావాలంటూ ట్వీట్‌ చేశాడు. అతని ట్వీట్‌కి పార్లే స్పందించింది. కనీసం పదివేల రీట్వీట్స్‌ కావాలని బదులిచ్చింది. అయిదారు నెలలకు సిద్ధార్థ కోరిక నెరవేరింది. ‘మంచి ఫలితానికి నిరీక్షణ తప్పదు..

కానీ నిరీక్షణ ఫలితమెప్పుడూ తీయగానే ఉంటుంది.. రోలా కోలా ఈజ్‌ కమింగ్‌ బ్యాక్‌’ అంటూ పార్లే ప్రకటించింది. సిద్ధార్థ్‌ ఈ రోలా కోలా కోసం ట్యాగ్‌ చేయని సెలబ్రిటీల్లేరు.. మెగా బ్రాండ్స్‌ లేవు. ఆఖరకు నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏవియేషన్‌ కంపెనీలనూ వదల్లేదు. 

కాంపా కోలా..
1970, 80ల్లో తన టేస్ట్‌తో మార్కెట్‌ను రిఫ్రెష్‌ చేసిన సాఫ్ట్‌డ్రింక్‌ ఇది. గ్లోబలైజేషన్‌తో మన అంగట్లోకి వచ్చిన పెప్సీ, రీ ఎంటర్‌ అయిన కోకా కోలా థండర్‌ వేవ్స్‌కి తట్టుకోలేక దేశీ సాఫ్ట్‌డ్రింక్‌ కాంపా కోలా కనుమరుగైపోయింది. దీన్నిప్పుడు రిలయెన్స్‌ కొనుగోలు చేసింది.. దేశీ డ్రింక్‌గా నాటి జ్ఞాపకాల చల్లదనంతో వినియోగదారులను సేదతీర్చడానికి సిద్ధమైంది. 


మ్యాగీ ఏమైనా తక్కువ తిందా?    
నిర్ధారిత పరిమాణం కన్నా సీసం పాళ్లు ఎక్కువున్నాయన్న కంప్లయింట్‌తో నెస్లే ప్రొడక్ట్‌ మ్యాగీ మన వంటింటి కప్‌బోర్డులను ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళ్లింది వెళ్లినట్టు ఊరుకుందా? లేదు! పిల్లల ఆకలి తీర్చిన ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ జ్ఞాపకాలను రెచ్చగొట్టింది.. మిస్‌ యూ.. కబ్‌ వాపస్‌ ఆయేగా యార్‌ (తిరిగి ఎప్పుడొస్తున్నావ్‌) అంటూ! ప్రకటనలు, నలుమూలలా హోర్డింగ్‌లతో హోరెత్తించింది. ఈ ఉత్సాహం, స్ఫూర్తితో చాలా కంపెనీలు.. షటర్‌ మూసుకున్న తమ ప్రొడక్ట్స్‌ని కొత్తగా ముస్తాబు చేసి తిరిగి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. 

కొత్తేం కాదు..
నోస్టాల్జియాతో మార్కెట్‌ను ఏలడం కొత్త అనుకుంటున్నాం కానీ.. కాదు. ఫ్యాషన్‌ ప్రపంచం ఫాలో అయ్యేది ఈ సూత్రాన్నే! బ్లాక్‌ అండ్‌ వైట్, ఈస్ట్‌మన్‌ కలర్‌ కాలం నాటి ట్రెండ్స్‌ని రెట్రో స్టయిల్‌ పేరుతో ఎప్పటికప్పుడు మార్కెట్‌ చేయట్లేదూ..! అలా బెల్‌బాటమ్, త్రీ ఫోర్‌ హ్యాండ్స్‌ బ్లౌజెస్, పోల్కా డాట్స్‌ డిజైన్స్, ఫ్రెంచ్‌ కట్‌ బియర్డ్స్, పఫ్‌ కొప్పులు ఎట్‌సెట్రా లేటెస్ట్‌ ఫ్యాషన్‌గా ఎన్ని యూత్‌ని ఆకట్టుకోవడం లేదు!
ఆధునిక సాంకేతికతకు కవల జంటలైన ‘ఈ’ జెనరేషన్‌కూ త్రోబ్యాక్‌ సుపరిచితమే సోషల్‌ మీడియా సాక్షిగా. నిజానికి ప్రస్తుతం పలు బ్రాండ్స్‌ చేస్తున్న ఈ నోస్టాల్జియా మార్కెట్‌కి ప్రేరణ సోషల్‌ మీడియా త్రోబ్యాక్‌ థర్స్‌డేతోపాటు అది పోస్ట్‌ అయిన పాస్ట్‌ ఈవెంట్స్‌.. ఇన్సిడెంట్స్‌లను తడవ తడవకు గుర్తుచేసే తీరే అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఈ స్ట్రాటెజీ వల్ల పలు బ్రాండ్ల అమ్మకాలూ పెరిగాయనీ చెప్తున్నారు. 

‘జ్ఞాపకాలనేవి భలే గిరాకీ బేరం. నాటి సంగతులను మంచి ఫీల్‌తో జత చేసుకుని వస్తాయి. ఎన్నటికీ ఇంకిపోని భావోద్వేగాల తడిని కలిగుంటాయి. కాబట్టే అవి మార్కెట్‌లో సేల్‌ అవుతున్నాయి’ అంటున్నారు ‘22ఫీట్‌ ట్రైబల్‌ వరల్డ్‌వైడ్‌’ నేషనల్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ దేబాశీష్‌ ఘోష్‌. ‘టీబీడబ్ల్యూఏ ఇండియా’ సీసీఓ పరీక్షిత్‌ భట్టాచార్యేమో ‘నోస్టాల్జియా అనేది టైమ్‌ మెషిన్‌ లాంటిది. నడుస్తున్న కాలానికి అందులో యాక్సెస్‌ ఉండదు. మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలనుకున్న క్షణాల్లోకి అది మనల్ని తీసుకెళ్తుంది.. మళ్లీ జీవించేలా చేస్తుంది. ఆ బలహీనతనే కంపెనీలు ఎన్‌క్యాష్‌ చేసుకుంటున్నాయి’ అంటున్నారు. 

అయితే ఈ ప్రహసనంలో కొన్ని బ్రాండ్స్‌.. పాత ప్రకటన లేదా జ్ఞాపకానికి సమకాలీనతను జోడించే ప్రయత్నంలో వాటికున్న ఎసెన్స్‌ను కాపాడుతూ ఆధునికతను అద్దడంలో విఫలమవు తున్నాయి.  పాత యాడ్స్‌.. ఆ కాలంలో అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అంతే అద్భుతమైన ఫలితాలనూ రాబట్టి ఉండొచ్చు. కాని వాటి విలువ  సామాజికంగా కానీ.. కల్చర్‌ పరంగా కానీ ప్రాసంగికతను కలిగి ఉందా? దాన్ని నేటి తరం గ్రహించగలుగుతున్నదా?

ఆ ప్రకటనల సారం నేటికీ సరిపోలనున్నదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి కొన్ని యాడ్స్‌ను ఇప్పుడు చూస్తే అంటే పరిణతి చెందిన ఆలోచనాతీరుతో.. ఇప్పుడు నెలకొని ఉన్న సున్నిత వాతావరణంలో పరికిస్తే అవి వివాదాస్పదంగా కనిపించవచ్చు. పురుషాధిపత్య ధోరణినీ చూపిస్తూండవచ్చు. కాబట్టి.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని పాత ప్రకటనలకు ఆ సెన్స్‌ను జోడించాకే నోస్టాల్జియా స్ట్రాటెజీని మార్కెట్‌ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement