నేను పుట్టకముందే అమ్మ చంపేద్దామనుకుంది
తాను ఇంకా పుట్టకముందే తన తల్లి తనను చంపేద్దామనుకున్నారని గోవా గవర్నర్ మృదులా సిన్హా తెలిపారు. తన తల్లి 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడంతో.. జనం ఏమనుకుంటారోనని ఆమె అలా చేశారని గవర్నర్ చెప్పారు. పణజిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆడ శిశువులను రక్షించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇస్తున్నప్పుడు తనకీ సంఘటన గుర్తుకొచ్చిందని, తన తండ్రే తన ప్రాణాలు కాపాడారని ఆమె చెప్పారు. అబార్షన్ కోసం తన తల్లి అప్పట్లో ఏవో మాత్రలు మింగారని, అయితే తన తండ్రి సమాజం గురించి భయపడకుండా ఆమెను వెంటనే సమీపంలోని నగరంలో గల ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి.. తనను బతికించారని గవర్నర్ వెల్లడించారు. అంతకుముందున్న సంప్రదాయ బంధనాలను తన తండ్రి ఛేదించి.. తన కాళ్ల మీద తాను నిలబడేలా మంచి చదువు చెప్పించారని అన్నారు.
ఇప్పుడున్న 'బేటీ బచావో, బేటీ పఢావో' అన్న నినాదానికి అదనంగా 'పరివార్ బచావో' అనే నినాదం కూడా ఇవ్వాల్సి ఉందని మృదులా సిన్హా చెప్పారు. ఒకప్పుడు అమ్మాయిలను కూడా అబ్బాయిల్లా పెంచాలని చెప్పేవారని.. ఇప్పుడు అలా చెప్పాల్సిన అవసరం ఇక లేదని, పల్లెటూళ్లలో కూడా చాలామంది తండ్రులు తమ పిల్లలను బాగా చదివిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను పాటించాలని అందరికీ సూచించారు.