ఉపవాసం అంటే పస్తు ఉండటం, నిరాహారంగా ఉండటం అని వాడుక. కానీ ‘ఉప–వాసం’ అనే పదబంధానికి ఆహారంతో సంబంధం కనిపించదు. ‘ఉప’ అంటే ‘సమీపం’, ‘వాసం’ అంటే ‘నివాసం’. కాబట్టి ‘ఉపవాసం’ అంటే దగ్గరగా ఉండటం. దేనికి దగ్గరగా ఉండటం? ఉపవాసం చేసే సాధకుడు దేనికి దగ్గరగా ఉండాలనుకొంటున్నాడో దానికి!
ఉదాహరణకు, ఒక భక్తుడు కొంత సమయం పాటు, ఎప్పటికంటే ఎక్కువగా, మనో–వాక్–కాయ–కర్మల ద్వారా తన ఇష్ట దైవానికి సన్నిహితంగా ఉండాలని సాధన చేస్తే, అది ఉపవాస సాధన అవుతుంది. శరీరాన్ని వీలయినంత ఎక్కువ సమయం భగవన్మూర్తికి దగ్గరగా ఉంచుతూ, ఇతర లౌకిక విషయాలకు దూరంగా ఉంచటం శారీరకమైన ఉపవాసం.
వాక్కును కొంతకాలం పాటు భగవత్ స్తోత్రాలకూ, భగవద్వి షయమైన చర్చలకూ పరిమితం చేయటం వాక్కుపరమైన ‘ఉపవాసం’. మనసును ఆహార విహారాల లాంటి ఇంద్రియ విషయాల మీదనుంచి కొంతసేపు మళ్ళించి, దైవం మీద నిలిపి ఉంచటం మానసికమైన ఉపవాసం. అలాగే లౌకికమైన పనులకు కొంతకాలం సెలవిచ్చి, ఆ సమ యాన్ని పూజలకూ, ఆరాధనలకూ, అభిషేకాలకూ, వ్రతాలకూ వెచ్చించడం... కర్మల పరంగా దైవానికి సమీపంగా ఉండే ‘ఉపవాసం’.
ఈ దేహమూ, ఇంద్రియాలూ, మనస్సు– ఇవే ‘నేను’ అన్న మిధ్యా భావనలో మునిగిపోయి, వీటికి అతీతంగా వెలుగుతుండే ఆత్మజ్యోతి తన అసలు రూపం అని మరిచిపోయిన జీవుడు, కొంతకాలం పాటన్నా దేహేంద్రియ వ్యవహారాలకు దూరంగా, తన స్వ స్వరూపానికి దగ్గరగా వెళ్ళి దానిని గుర్తించేందుకు చేసే సాధన ‘ఉపవాసం’ అని వేదాంతులు వివరణ ఇచ్చారు.
మామూలుగా రోజూ తినే ఆహారం మీద నుంచి దృష్టి మళ్ళించేసి, ఒక్కపూట మరేదయినా ఆహారం పుచ్చుకొంటే ఇహానికీ పరానికీ మంచిదన్న భావనతో, దాని మీద దృష్టి పెట్టడం కూడా ‘ఉపవాసమే’. కానీ అది మనో వాక్ కాయ కర్మలన్నిటి ద్వారా, ఆ కొత్త ఆహారానికి ‘సమీపంగా ఉండటం’ మాత్రమే అవుతుంది. – ఎం. మారుతి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment