భీష్ముని జీవితం ఆదర్శప్రాయం
అసలే ఉత్తరాయణం. అందునా పరమ పవిత్రమైన మాఘ మాసం. తత్రాపి, శ్రీమన్నారాయణుడికి ప్రీతి కరమైన శుక్ల ఏకాదశి తిథి. ఫిబ్రవరి 18, గురువారం, భీష్మ ఏకాదశి. విష్ణు పూజకు అత్యంత అనుకూలమైన పవిత్ర పర్వదినం.
భీష్ముడు పాండవ, కౌరవులకు పితామహుడు. యావజ్జీవం తన యావచ్ఛక్తినీ వినియోగించి కురు సామ్రాజ్యాన్ని సంరక్షించిన మహాయోధుడు మాత్రమే కాదు. గొప్ప హరి భక్తుడు. పుట్టిన క్షణం నుంచీ రణ రంగంలో ప్రాణత్యాగం చేసే వరకూ, ఏ ధర్మ విరుద్ధమైన పనీ చేసి ఎరుగని, మచ్చలేని మనీషి భీష్ముడు. ఆయన ఏ అధర్మమైనా చేసినట్టు కనిపిస్తే, అది చూపు దోషమని సోపపత్తికంగా చూపవచ్చు. సకల పాప ప్రక్షాళన క్షమ గల గంగా నదికి స్వయానా పుత్రుడూ, అష్ట వసువులలో ఒకరి అవతార మైన దివ్య పురుషుడూ అధర్మం ఎలా చేస్తాడు? గంగమ్మ తల్లి ఆయనను బృహస్పతి, శుక్రాచార్యుడు, పరశురాముడు వంటి అసమాన ప్రజ్ఞాశాలులైన ఆచార్యుల దగ్గర సర్వ శాస్త్రాలలోను సుశిక్షితుడిని చేసిన తరువాతే తెచ్చి తండ్రి శంతనుడికి అప్పగించింది. ఆయనను మించిన ధర్మజ్ఞుడూ, ధర్మాచరణ తత్పరుడూ లేడని ధర్మరాజు, శ్రీకృష్ణులు గౌరవించిన భీష్మాచార్యుడు ధర్మయోగి.
భీష్ముని పుట్టుక అద్భుతం. ఆయన జీవితం మహాద్భుతం, నిర్యాణం అంతకంటే అద్భుతం. పితృ భక్తితో ఆయన చేసిన యావజ్జీవ బ్రహ్మచర్యాచరణ అనే భీష్మ ప్రతిజ్ఞ న భూతో న భవిష్యతి. చతుర్దశ భువనాల సార్వ భౌమత్వమైనా, ఈ ఆదర్శవంతుడికి కర్తవ్యపాలన ముందు గరికపోచతో సమానం. తనకు ఏ మాత్రమూ ఇష్టం లేని యుద్ధంలో, తను అధర్మపక్షమని భావించే కౌరవుల పక్షాన, తాను ఎంతగానో అభిమానించే పాండు పుత్రులకు విరుద్ధంగా, అపజయం నిశ్చయం అని తెలిసీ, తన యావచ్ఛక్తినీ ఉపయోగించి పాల్గొని, అజేయుడైనా ధర్మబద్ధుడై నేలకొరిగిన ఈ కర్తవ్య పరాయణుడి జీవితచరిత్రలో ప్రతి ఘట్టమూ రోమాంచాన్ని కలిగించేదే.
బాణాలతో శరీరమంతా తూట్లు పడి, అంపశయ్య మీద పరలోక ప్రయాణానికి అనువైన పుణ్య తిథి కోసం ప్రతీక్షిస్తూ ఆయన ధర్మరాజుకు చేసిన సమగ్ర ధర్మ బోధ అసదృశమైంది. ‘విష్ణు సహస్ర నామ స్తోత్రం’ ఆయన మానవాళికి అందించిన మహిమాన్వితమైన మహా మంత్రం. ఆయనను ప్రహ్లాద, నారద, పరాశర పుండరీకాది పరమ భాగవతుల శ్రేణిలో నిలపడానికి ఆ ఒక్కటీ చాలు. భీష్ముడు ప్రాణ ప్రయాణ సమయంలో కూడా, శ్రీకృష్ణుడిని తనివి తీరా స్తుతించి, ఆయన సమక్షంలోనే, ఆయన అనుమతితోనే శరీర త్యాగం చేసే ఉదాత్తమైన ఘట్టం.
భీష్మ ఏకాదశి పర్వదినాన ఆ ఆదర్శ ప్రాయుడినీ, స్ఫూర్తి ప్రదాతనూ, ధర్మయోగినీ మనసారా స్మరించుకొని, భాగవతంలో భీష్ముడు చేసే శ్రీకృష్ణ స్తుతినీ, భారతంలో భీష్ముడు బోధించిన విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించుకోవటం భక్తులకు అవశ్య కర్తవ్యం.
- ఎం. మారుతిశాస్త్రి