Bhishma life
-
మహాత్ములకు మహాత్ముడు భీష్ముడు
"సత్యం, పవిత్రత, నిస్వార్థం-ఈ సుగుణాలున్న వాడిని అణగద్రొక్కగల సామర్ధ్యం ముల్లో కాలలో ఎవరికీ లేదు. ఇలాంటి సుగుణ సంపన్నుడు విశ్వమంతా ఏకమైనా ఒంటరిగా ఎదిరించగలుగుతాడు" అని అంటారు స్వామి వివేకానంద. సువర్ణమయం పృథివీం చిన్నంతి పురుషాస్త్రయః । శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుమ్ ॥ ఈ భూతలాన్ని సువర్ణమయం చేయగలగే వారు- శూరులు, జ్ఞానులు, సేవాతత్పరులు. ఈ మూడు తరహాల వారినే 'మహాత్ములు' అంటారు. ధర్మనిరతిలో సాటిలేని రాముడు 'ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు' గా వాసి కెక్కాడు. సత్యనిష్ఠలో మేటి అయిన హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు' గా వినుతికెక్కాడు. దానగుణంలో తిరుగులేని కర్ణుడు 'దానకర్ణుడు' ఖ్యాతిగాంచాడు. ఇలా శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, కర్ణుడు తమ తమ దివ్యగుణాలతోనే అజరామరమైన కీర్తిప్రతిష్ఠలను ఆర్జించారు. అలాగే గంగాదేవి శంతన మహారాజు పుత్రుడు దేవవ్రతుడు తన భీషణ ప్రతిజ్ఞతో 'భీష్ముని' గా ప్రసిద్ధి చెందాడు రాజవంశంలో భోగమయ జీవితాన్ని అనుభవించాల్సిన భీష్ముడు అఖండ బ్రహ్మ చర్య దీక్షతో యోగమయ జీవితాన్ని గడిపి బ్రహ్మనిష్ఠుడయ్యాడు. త్యాగనిరతి, ఇంద్రియ నిగ్రహ శక్తి, ధర్మనిబద్దతల సంగమ క్షేత్రమే ఆయన పవిత్ర జీవనం. ఇలాంటి పావనమూర్తి చరించిన ఈ భారతభూమి బంగారుభూమే! మహాత్ములకు మహాత్ముడు భీష్ముడు. శౌర్యం, సేవాతత్పరత, సత్యనిష్ఠ, పవిత్రత,ఈగుణాలు పుష్టిగావున్నాయి భీష్మునిలో. తండ్రిన సంతోషపరచడమే తనయుని ధర్మమని తలచిన దేవవ్రతుడు తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించడానికి, ఆమె తండ్రి దాశరాజును ఒప్పించడానికి వెళ్ళాడు. అప్పుడు దాశరాజు 'నా కుమార్తెకు పుట్టిన బిడ్డకే పట్టాభిషేకం చేయాలి' అని షరతు పెట్టాడు. అప్పుడు దేవవ్రతుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు."ఇక్కడ సమావేశమై ఉన్న ప్రభువు లందరూ వినండి! నేను తండ్రిగారి ప్రయోజనం కోసం స్థిరమైన ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేమంటే ఈమెకు పుట్టిన కుమారుడే రాజ్యాధిపతి అవడానికి అర్హుడు" అని పెద్దల ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. కాని దాశరాజు ఈ ప్రతిజ్ఞతో సంతోషపడలేదు. ఇలాగన్నాడు. "అది సరే!కాని నీకు పుట్టిన కుమారుడు రాజ్యాన్ని ఆశించకుండా ఉంటాడని ఏమిటి నమ్మకం?"అప్పుడు చిత్తస్తైర్యంగా బ్రహ్మచర్య వ్రతాన్ని చేబడుతున్నాను అని మరో శబధం చేసాడు శంతనుని కుమారుడు. భీష్ముడు అస్త్రశస్త్ర విద్యలో అసమాన ప్రతిభావంతుడు. తన తమ్ముల కొరకు కన్యలు తేవాలని కాశీరాజు కుమార్తెల స్వయంవరానికి వెళ్ళి అక్కడ ఎందరో రాజులను పరాజితులను చేశాడు. గురువైన పరశురాముడంతటి మహాశూరుడ్ని యుద్ధంలో ఓడించాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించాడు. భీష్మునలో రాజ్యకాంక్ష , భోగలాలస ఏమాత్రం లేదు. స్వార్థరహితుడు.కుమారుని సత్యనిష్ఠకు సంతసించి శంతనుడు కుమారునకు ఇచ్ఛామరణ వరాన్ని ప్రసాదినచాడు. కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాల్లో సుప్రతిష్టుడైన కురు వృద్ధుడిని శ్రీకృష్ణుడు "జన్మములిట్టివి యెందుకల్గునే" అని ప్రశంసించాడు. -గుమ్మా ప్రసాద రావు భిలాయి -
ముఖ్యమంత్రికి ‘ఇచ్ఛా మరణ’ వరముంది!
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను మహాభారతంలోని భీష్మ పితామహుడితో పోలుస్తూ ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజయ్ చంద్రకర్ వ్యాఖ్యలు చేశారు. భీష్ముడి తరహాలోనే రమణ్‌సింగ్‌కు ‘ఇచ్ఛా మరణ’ (కోరుకున్నప్పుడే చనిపోయే) వరముందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ముఖ్యమంత్రికి ఇచ్ఛామరణ వరముంది. భీష్మ పితామహుడి తరహాలో ఎప్పుడు ఓడిపోవాలి.. ఎప్పుడు గెలువాలన్నది ఆయనకు తెలుసు. ఛత్తీస్‌గఢ్ పురోగతి సాధించి.. సుసంపన్నమయ్యేవరకు తాను ఎప్పుడు ఓడిపోయేది ఆయన చెప్పబోరు’ అంటూ ఆయన శుక్రవారం ఓ సభలో పేర్కొన్నారు. ఓ పెద్ద పార్టీ నాయకుడు రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారని, ఆ పార్టీ పాలనలో రాష్ట్రం వలసలు, నిరక్షరాస్యత మాత్రమే చవిచూసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు. రమణ్‌సింగ్‌ను భీష్మపితామహుడితో పోలుస్తూ మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భీష్ముని జీవితం ఆదర్శప్రాయం
అసలే ఉత్తరాయణం. అందునా పరమ పవిత్రమైన మాఘ మాసం. తత్రాపి, శ్రీమన్నారాయణుడికి ప్రీతి కరమైన శుక్ల ఏకాదశి తిథి. ఫిబ్రవరి 18, గురువారం, భీష్మ ఏకాదశి. విష్ణు పూజకు అత్యంత అనుకూలమైన పవిత్ర పర్వదినం. భీష్ముడు పాండవ, కౌరవులకు పితామహుడు. యావజ్జీవం తన యావచ్ఛక్తినీ వినియోగించి కురు సామ్రాజ్యాన్ని సంరక్షించిన మహాయోధుడు మాత్రమే కాదు. గొప్ప హరి భక్తుడు. పుట్టిన క్షణం నుంచీ రణ రంగంలో ప్రాణత్యాగం చేసే వరకూ, ఏ ధర్మ విరుద్ధమైన పనీ చేసి ఎరుగని, మచ్చలేని మనీషి భీష్ముడు. ఆయన ఏ అధర్మమైనా చేసినట్టు కనిపిస్తే, అది చూపు దోషమని సోపపత్తికంగా చూపవచ్చు. సకల పాప ప్రక్షాళన క్షమ గల గంగా నదికి స్వయానా పుత్రుడూ, అష్ట వసువులలో ఒకరి అవతార మైన దివ్య పురుషుడూ అధర్మం ఎలా చేస్తాడు? గంగమ్మ తల్లి ఆయనను బృహస్పతి, శుక్రాచార్యుడు, పరశురాముడు వంటి అసమాన ప్రజ్ఞాశాలులైన ఆచార్యుల దగ్గర సర్వ శాస్త్రాలలోను సుశిక్షితుడిని చేసిన తరువాతే తెచ్చి తండ్రి శంతనుడికి అప్పగించింది. ఆయనను మించిన ధర్మజ్ఞుడూ, ధర్మాచరణ తత్పరుడూ లేడని ధర్మరాజు, శ్రీకృష్ణులు గౌరవించిన భీష్మాచార్యుడు ధర్మయోగి. భీష్ముని పుట్టుక అద్భుతం. ఆయన జీవితం మహాద్భుతం, నిర్యాణం అంతకంటే అద్భుతం. పితృ భక్తితో ఆయన చేసిన యావజ్జీవ బ్రహ్మచర్యాచరణ అనే భీష్మ ప్రతిజ్ఞ న భూతో న భవిష్యతి. చతుర్దశ భువనాల సార్వ భౌమత్వమైనా, ఈ ఆదర్శవంతుడికి కర్తవ్యపాలన ముందు గరికపోచతో సమానం. తనకు ఏ మాత్రమూ ఇష్టం లేని యుద్ధంలో, తను అధర్మపక్షమని భావించే కౌరవుల పక్షాన, తాను ఎంతగానో అభిమానించే పాండు పుత్రులకు విరుద్ధంగా, అపజయం నిశ్చయం అని తెలిసీ, తన యావచ్ఛక్తినీ ఉపయోగించి పాల్గొని, అజేయుడైనా ధర్మబద్ధుడై నేలకొరిగిన ఈ కర్తవ్య పరాయణుడి జీవితచరిత్రలో ప్రతి ఘట్టమూ రోమాంచాన్ని కలిగించేదే. బాణాలతో శరీరమంతా తూట్లు పడి, అంపశయ్య మీద పరలోక ప్రయాణానికి అనువైన పుణ్య తిథి కోసం ప్రతీక్షిస్తూ ఆయన ధర్మరాజుకు చేసిన సమగ్ర ధర్మ బోధ అసదృశమైంది. ‘విష్ణు సహస్ర నామ స్తోత్రం’ ఆయన మానవాళికి అందించిన మహిమాన్వితమైన మహా మంత్రం. ఆయనను ప్రహ్లాద, నారద, పరాశర పుండరీకాది పరమ భాగవతుల శ్రేణిలో నిలపడానికి ఆ ఒక్కటీ చాలు. భీష్ముడు ప్రాణ ప్రయాణ సమయంలో కూడా, శ్రీకృష్ణుడిని తనివి తీరా స్తుతించి, ఆయన సమక్షంలోనే, ఆయన అనుమతితోనే శరీర త్యాగం చేసే ఉదాత్తమైన ఘట్టం. భీష్మ ఏకాదశి పర్వదినాన ఆ ఆదర్శ ప్రాయుడినీ, స్ఫూర్తి ప్రదాతనూ, ధర్మయోగినీ మనసారా స్మరించుకొని, భాగవతంలో భీష్ముడు చేసే శ్రీకృష్ణ స్తుతినీ, భారతంలో భీష్ముడు బోధించిన విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించుకోవటం భక్తులకు అవశ్య కర్తవ్యం. - ఎం. మారుతిశాస్త్రి