అరణ్యంలో ఉన్న ఓ జ్ఞాని దగ్గరకు వెళ్లిన ఒక యువకుడు తనకు నిజమంటే ఏమిటో చెప్పాలని కోరాడు. వెంటనే జ్ఞాని ‘నిజం సంగతి ఇప్పటికి పక్కనపెట్టు. నేనడిగిన దానికి జవాబు చెప్పు. మీ ఊళ్ళో బియ్యం ధర ఎంతో చెప్పు’ అన్నాడు. అందుకు యువకుడు వినమ్రంగా ‘స్వామీ! నన్ను మన్నించండి. మర్యాద మరచి మాట్లాడుతున్నానని అనుకోకండి. ఇటువంటి ప్రశ్నలు ఇక మీదట నన్ను అడక్కండి. ఎందుకంటే నేను గతకాలపు దారులు మరచిపోయాను. గతానికి సంబంధించినంత వరకు నేను ఇప్పుడు మరణించాను. ఇదిగో ఇప్పుడు నడిచొ చ్చిన మార్గాన్ని కూడా నేను మరచిపోయాను’ అన్నాడు. ‘నువ్వు గత కాలపు భారాన్ని ఇంకా మోస్తున్నావా... లేదా అనేది తెలుసుకోవడానికే బియ్యం ధర ఎంతని అడిగాను. నువ్వు దానికి జవాబు చెప్పి ఉంటే వెంటనే నిన్ను ఇక్కడినుంచి పంపించేసేవాడిని. నిజం గురించి మాట్లాడటానికి తిరస్కరించే వాడిని’ అన్నాడు. ‘అయితే ఇపుడు చెప్పండి నిజమంటే ఏమిటో’ అని అడిగాడు యువకుడు.
‘వర్తమానంలో బతకడం తెలీని మనిషిని ఓ తోటలోకి తీసుకు వెళ్ళి ఓ గులాబీ పువ్వుని అతనికి చూపించు. ఈ గులాబీ ఎంత అందమైనదో అని అతనితో అను. వెంటనే అతను దీని వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. సాయంత్రంలోపు వాడి రాలిపోతుంది అంటాడు. యవ్వనం ఎంతటి సుఖమైనదో చెప్పమని అడిగితే అది నిజమే కావచ్చు కానీ ముసలితనం త్వరగా వచ్చేస్తుందిగా అంటాడు. సంతోషం గురించి మాట్లాడితే అదంతా వట్టి మాయ అంటాడు. కానీ వర్తమానంలో బతకడం తెలిసిన వ్యక్తిని ఓ ఉద్యానంలోకి తీసుకు వెళ్తే అక్కడి రంగు రంగుల పువ్వులను చూపిస్తే వాటిని చూసి అతనెంతగా ఆనందిస్తాడో తెలుసా... ఎన్ని కబుర్లు చెప్తాడో తెలుసా! ఇవి చూడటానికి వచ్చిన దారులను గురించి ఆలోచించవలసిన అవసరమేముందంటాడు.
రాలిపోయే పువ్వులైనా సరే ఇప్పుడు ఎంత ఆందంగా ఉన్నాయో అంటాడు. వికసించే పువ్వులు అందమైనవా... రాలిపోయే పువ్వులు అందమైనవా అని అడిగితే గతించిన కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానంలోని నిజాన్ని గ్రహించలేమంటాడు. అది నిజం. ఏది నిజమో అది ఈ క్షణంలో ఉంది. నిజమనేది గతించిన, రానున్న కాలాలకు సంబంధించినది కాదు. వర్తమానమే నిజమైన కాలం’ అని చెప్పాడు జ్ఞాని. యువకుడికి విషయం అర్థమైంది. ఆనందంగా వెనుతిరిగాడు. – యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment