నీలా ఉంటే ఎంత బాగుంటుందో! | devotional information by yamijala jagadeesh | Sakshi

నీలా ఉంటే ఎంత బాగుంటుందో!

Published Sun, May 6 2018 12:26 AM | Last Updated on Sun, May 6 2018 12:26 AM

devotional information by yamijala jagadeesh - Sakshi

అదొక పల్లెటూరు. ఆ ఊరికో ప్రత్యేకత ఉంది. ఎలాగంటే ఆ ఊళ్ళో ఓ పండు దొరుకుతుంది. ఆ పండు ఇంకెక్కడా దొరకదు. అంతటి ప్రత్యేకమైన పండది. ఆ పండు తింటే కొన్ని రోజుల వరకూ ఆకలి అనేది ఉండదు. ఈ విషయం ఓ సూఫీ సాధకుడి చెవిన పడింది. ఆ పండేదో తెలుసుకుందామని ఆ సూఫీ సాధకుడు ఆ ఊరుకి వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఉన్న పెద్ద సంతకు వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఆ పండు దొరకలేదు. ఆయన వాలకాన్ని ఓ యువకుడు పసికట్టాడు. ఆయన వద్దకు వచ్చిన యువకుడు ‘‘మీరు దేని కోసమో వెతుకుతున్నట్టు అనిపిస్తోంది. నేనేమైనా మీకు సాయం చేయగలనా‘‘ అని అడిగాడు.

సూఫీ సాధకుడు ‘‘అవును. మీరన్నది నిజమే. ఈ ఊళ్ళో ఓ అపూర్వమైన, అరుదైన పండు ఉందని తెలిసి పొరుగూరి నుంచి వచ్చాను. ఆ పండు తింటే చాలా రోజులవరకూ ఆకలనేదే ఉండదట. ఆ పండు గానీ లేదా ఆ పండు విత్తనం గానీ దొరికితే దాన్ని తీసుకుపోయి ఆకలితో నకనకలాడే ప్రాంతంలోని ప్రజలకు సాయపడాలన్నదే నా ఆశ...’’ అన్నాడు సాధువు.
యువకుడు కాస్సేపు ఆయనను ఉండమని చెప్పి అక్కడినుంచి బయలుదేరాడు.

చెప్పినట్టే కాసేపటికి ఆ యువకుడు వచ్చాడు. అతని చేతిలో ఓ పండు ఉంది. ‘‘మీరడిగిన పండు ఇదేనండి. తీసుకోండి’’ అని ఆ పండుని యువకుడు సాధువుకు అందించాడు. ‘‘ఈ ఊళ్ళో ఈ పండు ఎక్కువగానే లభిస్తుందని ఆ నోటా ఈ నోటా విన్నాను...’’ అని చెప్పాడు సాధువు. ‘‘నిజమే. ఈ ఊళ్ళో ఈ పండు ఎక్కువగానే లభిస్తూ వచ్చింది. కానీ ఈ ఊరి ప్రజలు స్వార్థపరులుగా మారిపోయారు. తాము పొందే ఫలితాన్ని ఇతరులు పొందకూడదనే కారణంగా ఎవరికి వారు అవసరానికి మించి కొని దాచుకుంటున్నారు.

అంతేకాదు, దీన్ని సాగుచేసే పద్ధతిని కూడా గుట్టుగా ఉంచారు. అయితే మా ఇంట ఉన్న ఓ పండుని తీసుకొచ్చి మీకిచ్చాను...ఈ పండుని ఆకలితో మాడుతున్న ప్రజలకు ఉపయోగిస్తానని మీరు చెప్పడం నాకు నచ్చింది. అందుకే మీకీ పండు ఇవ్వాలనిపించింది’’ అన్నాడు యువకుడు. ఆ యువకుడి మాటలు సాధువుని ఆకట్టుకున్నాయి. అతనిని దీవించి ఇలా చెప్పారు ... ‘‘నీలాగా ఇతరులకు సాయం చేయాలనే వారి సంఖ్య గానీ పెరిగితే వారుండే ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి కష్టమూ నష్టమూ కలగదు కదా’’ అన్నాడు.

– యామిజాల జగదీశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement