ఆయన ఓ గొప్ప సాధువు. ఆయనకంటూ ఓ ఆశ్రమం. ఆయన వద్ద ఎందరో శిష్యులున్నారు. ఓరోజు ఓ వ్యాపారి వచ్చాడు. అతను ధనవంతుడు. సాధువుకు నమస్కరించి ‘నేను మీ దగ్గర శిష్యుడిగా ఉండటానికొచ్చాను‘ అన్నాడు. సాధువు అతని వంక చూసి ‘నిన్ను చూస్తుంటే విలాసవంతుడిలా ఉన్నావు. మా ఆశ్రమం లో ఆడంబరాలకు తావు లేదు. చాలా సామాన్యమైనది. మా జీవన పద్ధతులు నీకు సరిపోతాయనిపించడం లేదు. అన్నింటినీ త్యజించి ఓ నిరాడంబర సాధువులాబతగ్గలవా అని అనిపిస్తోంది. నీవల్ల కాదేమో అని నా ప్రశ్న.
నిజంగానే నువ్వు అన్నింటినీ వదులుకోగలవా?’ అడిగారు. ‘తప్పకుండా స్వామీ’ చెప్పాడు ధనవంతుడు. ‘నేనీ క్షణమే పట్టు వస్త్రాలు తీసేసి మామూలు నూలు వస్త్రాలు ధరిస్తాను. మామూలు భోజనం చేస్తాను. నా ధనమంతా ధర్మ కార్యాలకు రాసేస్తాను. మీరెలా చెప్తే అలాగే బతుకుతాను. నాకు జ్ఞానం మాత్రం లభిస్తే చాలు’ అన్నాడు ధనవంతుడు. అప్పటికీ సాధువుకి అతని మాటలు తృప్తి కలిగించలేదు.
‘సరేగానీ, నేను నిన్ను కొన్ని రోజులు పరిశీలిస్తాను. ఆ తర్వాత ఓ నిర్ణయానికొస్తాను‘ చెప్పాడు సాధువు. ఆరోజు నుంచి ఆ ధనవంతుడు సాధువు ఆశ్రమంలోనే ఉంటూ వచ్చాడు. సాధువుకి మాట ఇచ్చినట్లే చాలా నిరాడంబరమైన జీవితాన్నే గడుపుతూ వచ్చాడు. సాధువు అనుకున్న పదిహేనురోజులు ముగిశాయి. ఓరోజు పొద్దున్నే సాధువు అతనిని పిలిచి ‘నీకు ఈ ఆశ్రమ జీవితం సరిపోదు. నువ్విక ఇంటికి వెళ్ళిపోవచ్చు‘ అన్నాడు. ‘ఏమిటి స్వామీ అలా అంటున్నారు? నేను మీకోసం డబ్బుని వదులుకున్నాను. ఆస్తిపాస్తులు వదులుకున్నాను. సకల వసతులూ వదులుకున్నాను. ఇవేవీ సరిపోవా?‘ అడిగాడు ధనవంతుడు.
సాధువు ఓ నవ్వు నవ్వారు.
‘నేను వేరుని నరకమన్నాను. నువ్వు కొన్ని కొమ్మలను మాత్రమే నరికావు. ఆ నరికేసిన కొమ్మల గురించి గొప్పలు చెప్తున్నావు. పైగా నాకోసం వదిలేశాను... నాకోసం వదిలేశాను అంటున్నావు... ఇది సరికాదు. నువ్వు దయ చేయొచ్చు. నీలో ఇంకా నేనూ నాకోసం వంటి ఆలోచనలున్నాయి. అవి నిన్నొదలవు‘ అన్నారు సాధువు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment