ఆయన ఓ తత్వజ్ఞాని. ఆయన ప్రసంగం వినడానికి ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చిపోతుండేవారు. వాటిని ఆధారంగా చేసుకుని తమ ఆధ్యాత్మిక చింతనను పెంచుకునే వారు. ఆయనను ప్రశంసించే వారనేకం. ఆయన ప్రసంగాలలో ఆధ్యాత్మిక చింతనే కాకుండా రోజువారీ మామూలు విషయాలు కూడా ఉపయోగపడేవిగా ఉంటూ ఉండేవి. బుద్ధుడు, మహావీరుడు తదితర పెద్దల మాటలను కూడా ఆయన తన ప్రసంగాలలో ఉదహరిస్తూ వచ్చేవారు. ఓరోజు ఆయన వీధిలో నడచుకుంటూ పోతున్నారు. ఇంతలో అనుకోకుండా ఆయన చెప్పులు తెగిపోయాయి. ఆయన మెల్లగా కాళ్ళీడుస్తూ రోడ్డుపక్కనున్న చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు చేరుకున్నారు.
‘‘ఇదిగో, ఈ చెప్పులు బాగు చేసివ్వు. తెగిపోయాయి’’ అన్నారాయన చెప్పులు కుట్టే వ్యక్తికి రెండు చెప్పులూ ఇస్తూ. చెప్పులు కుట్టే వ్యక్తి వాటిని అటూ ఇటూ తిప్పి చూసాడు. అవి బాగా అరిగిపోయున్నాయి. ‘‘ఇక్కడ వదిలేసి వెళ్ళండి, సరిచేసి పెడతాను. రేపొచ్చి తీసుకుపోగలరు’’ అన్నాడతను. ‘‘ఏంటీ, రేపా‘‘ అన్నారు జ్ఞాని. ‘‘అవునయ్యా, ఇప్పటికే చేతి నిండా బోలెడంత పని ఉంది. ఆ పనంతా పూర్తి చేస్తే తప్ప మీ చెప్పుల విషయానికి రాలేను. పైగా ఈ చెప్పులు బాగు చేయడానికి చాలా సమయం పడుతుంది‘‘ అన్నాడు. అప్పుడు జ్ఞాని ‘‘ఓ రోజంతా చెప్పులు లేకుండా ఎలా గడపాలి‘‘ అని అడిగారు జ్ఞాని.
‘‘ఒక్క రోజే కదండీ, వీటికి బదులు నా దగ్గరున్న మరో జత చెప్పులు ఇస్తాను. వాటితో గడపండి‘‘ అన్నాడు ఆ పనివాడు. ‘‘ఏంటీ‘‘ అని స్వరం పెంచారు జ్ఞాని. ‘‘మరొకరి చెప్పులను నా కాళ్ళు మోయాలా, నీకలా చెప్పడానికి ఎలా మనసొచ్చింది‘‘ అని జ్ఞాని ఆవేశంగా అన్నారు. చెప్పులు కుట్టే వ్యక్తి ఓ నవ్వు నవ్వాడు. అనంతరం అతను ఆయనను చూసి ‘‘ఇతరులు చెప్పిన అభిప్రాయాలన్నింటినీ మీ బుర్రలో పెట్టుకుని మోస్తూ తిరుగుతుంటారు. వాటిని అందరికీ చెప్తుంటారు... అలాంటిది మీరు ఒక్కరోజుమాత్రమే మరొకరి చెప్పులు వేసుకుని వాటిని మోయడంలో మీకొచ్చిన కష్టమేమిటండీ‘‘ అని అడిగాడు. ఆ మాటలతో జ్ఞాని ‘‘సరే రేపు వస్తాను.... ‘‘ అని అక్కడి నుంచి మరొక్క మాటమాట్లాడకుండా వెళ్ళిపోయారు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment