మునీశ్వరులకు ఎన్నో మాయలూ మంత్రాలూ తెలుసుననే ఉద్దేశంతోనూ నమ్మకంతోనూ ఓ యువకుడు ఒకరి దగ్గరకు వెళ్ళాడు. మునిని చూడడంతోనే ఆయనకు నమస్కరించి ‘‘స్వామీ’’ అంటూ మాటలు సాగించాడు. తాను పోయే దారంతా ఎప్పుడూ వెలుగుతో నిండి ఉండేలా వరం ప్రసాందించాలని కోరాడు. ముని తన మాటలు విని మాయతో వీధి దీపాల్లాంటిది ఇచ్చి తాను చీకట్లో వెళ్ళేటప్పుడల్లా ఉపయోగపడేలా చేస్తాడని అనుకున్నాడు యువకుడు. కానీ అతననుకున్నది వేరు. మునీశ్వరుడు ఇచ్చింది వేరు. మునీశ్వరుడు ఓ లాంతరు ఇచ్చి దీన్ని పుచ్చుకో అన్నాడు. మునీశ్వరుడు తనకున్న శక్తియుక్తులతో అద్భుతమైన ఓ దీపాన్ని ఇస్తాడనుకుంటే ఓ మామూలు లాంతరు ఇవ్వడమేమిటని ఆ యువకుడిలో నిరాశ కలిగింది. దాంతో మనసులోని మాటను చెప్పాడు...
‘‘స్వామీ, మీరు మాయతో కూడిన ఓ విచిత్రమైన దీపాన్ని ఇస్తారనుకున్నాను. కానీ ఓ లాంతరు ఇచ్చారు, ఇది ఓ పది అడుగుల దూరం మించి వెలుగు చూపదు కదండీ’’ అన్నాడు. అప్పుడు మునీశ్వరుడు ‘‘అలాగనుకుంటున్నావా... నేను తలచుకుంటే నాకున్న మాయాశక్తితో నువ్వు వెళ్ళే దారంతా వెలుగు నిండేలా చేయగలను. కానీ అది లాభం లేని పని. అయినా నీ కళ్ళు కూడా దాదాపు పది అడుగుల మేరకే చూడగలదు. కనుక ఆ మేరకు నీకు వెలుగుంటే చాలుగా. ఈ లెక్కన నువ్వు పోయే కొద్దీ తెల్లవారేసరికి అడవి మార్గాన్ని దాటి పొరుగున ఉన్న పల్లెకు చేరుకోగలవు. ఆ ఉద్దేశంతోనే నీకు లాంతరు ఇచ్చాను. కనుక ఏ సమస్యా లేకుండా నువ్వనుకున్న గమ్యస్థానానికి చేరుకోగలవు’’ అని అన్నాడు.
ఓ విధంగా ఇది నిజమేగా... మనలో చాలా మంది ఆ యువకుడిలాంటివారే. ఎంతసేపూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోరు. మన ముందరున్న కాలం ఏమిటో తెలుసుకోరు. ఉన్న కాలం గురించి ఆలోచించరు. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. అందుకే అనుభవజ్ఞులనే మాట ఇదే... ఈరోజు ఈ క్షణంలో చెయ్యవలసిన దానిని ఆచితూచి చెయ్యడంలో చైతన్యవంతులై ఉండాలి.
– యామిజాల జగదీశ్
నేటి ముళ్ళబాటే రేపటి పూలబాట కాదా?
Published Sun, Sep 16 2018 2:11 AM | Last Updated on Sun, Sep 16 2018 2:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment