రాజ్యం ప్రధాన వీధిలోనే అంత పెద్ద బండరాయి ఉండడం రాజు దృష్టికి రాకపోవడం విచిత్రంగా ఉందని, ఏం పాలన చేస్తున్నాడో ఏమిటో అని ప్రజలు కోపావేశాలు వ్యక్తం చేసుకుంటూ పోతున్నారు.
అనగనగా ఓ రాజు. ఆయనకి ఓ రోజు ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే తన రాజ్యంలోని ఓ ప్రధాన వీధి మధ్యలో ఓ పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టడం. అప్పుడు దాన్ని ఎవరైనా పక్కకు జరుపుతారా? లేక పక్కకు తప్పుకుపోతారా? ఈ పరీక్ష వల్ల జనం నాడి పట్టుకోవచ్చన్నది రాజు ఆలోచన. ఓ భటుడితో ఓ రోజు అర్ధరాత్రి తాననుకున్న వీధి మధ్యలో ఓ పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టించాడు. ఓ భటుడిని ఆ దారిన చాటుగా ఉండి వచ్చీపోయే వారందరూ ఆ బండరాయిని చూసి ఏమనుకుంటున్నారో విని తనకు చెప్పాలన్నాడు. తెల్లవారింది.
ఆ దారిన వచ్చీ పోయే వారందరికీ ఆ బండరాయి పెద్ద అడ్డంకిగానే ఉంది. చాలా మంది ఆ రాతికి పక్కనుంచో లేక మరొక దారిలోనో పోతున్నారే తప్ప దాన్ని తప్పించాలనే ఆలోచనలో ఎవరూ లేరు. ఎక్కువ శాతం మంది రాజు పాలనా తీరును నిందించినవారే. రాజ్యం ప్రధాన వీధిలోనే ఇంత పెద్ద బండరాయి ఉండడం రాజు దృష్టికి రాకపోవడం విచిత్రంగా ఉందని, ఏం పాలన చేస్తున్నాడో ఏమిటో అని కోపావేశాలు వ్యక్తం చేసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ ఆ భటుడి చెవిన పడుతూనే ఉన్నాయి. రాజుకి కూడా ఎప్పటికప్పుడు ఈ విమర్శలను చేరవేస్తున్నాడు భటుడు.
ఓ రెండు మూడు గంటలు గడిచాయి. ఇంతలో ఓ కార్మికుడు నెత్తిమీద ఓ పెద్ద బస్తానిండా కాయగూరలు పెట్టుకుని మెల్లగా రొప్పుతూ నడుస్తూ వస్తున్నాడు. అతను వీధి మధ్యలో ఉన్న బండరాయిని చూశాడు. తన నెత్తిమీదున్న మూటను కిందకు దింపాడు. మరెవరి సహాయమూ కోరకుండా తానొక్కడే ఆ బండరాయిని రోడ్డు పక్కగా దొర్లించాడు. అలా దొర్లించిన క్రమంలో అతనికి దాని కింద ఉన్న ఓ సంచి కనిపించింది! దానికున్న ముడి విప్పి చూశాడు. అందులో బంగారు నాణాలు కనిపించాయి! రోడ్డు పక్కనున్న చెట్టుకింద కాసేపు కూర్చుని ఆయాసం తీర్చుకున్న ఆ తర్వాత తన కూరగాయల మూట నెత్తిన పెట్టుకుని ముందుకు నడిచాడు.
తిన్నగా రాజుగారి కోటకు వెళ్లాడు. అక్కడున్న భటుడికి తనకు దొరికిన బంగారు నాణాల సంచీ విషయం చెప్పాడు. భటుడు అతనిని రాజు గారి దగ్గరకు తీసుకుపోయాడు. రాజుకి నమస్కరించిన ఆ కార్మికుడు జరిగినదంతా వివరించి, బంగారు నాణాలున్న సంచిని ఇచ్చిపోదామని వచ్చానని చెప్పాడు. రాజు విషయమంతా విని.. ‘‘సెభాష్.. నువ్వు తప్ప మిగతావాళ్లంతా.. ఆ బండరాయిని పక్కకు దొర్లించాలనే ఆలోచనే లేకుండా నన్ను తిట్టుకుంటూ పోయారు. కానీ నువ్వు మాత్రమే ఒంటరిగా కష్టపడి ఆ బండరాయిని పక్కకు జరిపి ఆ దారిలో ఏ సమస్యా తలెత్తకుండా చేశావు. కనుక నీకే ఆ బంగారు నాణాలు’’ అంటూ అతనికి కానుక ఇచ్చి సత్కరించాడు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment