ఇది పాట కాదు.. ప్రామిస్
నిద్ర నుంచి ఎవరినైనా లేపొచ్చు.. ఈ పాటనే కాదు గానీ.. వేరే పాట పాడి కూడా లేపొచ్చు.. లేదా అలారం పెట్టి మరీ లేపొచ్చు. మరి.. శాశ్వత నిద్ర నుంచి.. అదేనండి.. చచ్చిపోయాక ఎవరినైనా లేపొచ్చా??
మేం లేపుతాం అని అంటున్నాయి కొన్ని కంపెనీలు..
అంతేకాదు.. తాము చెబుతున్నది అబద్ధం కాదని.. కావాలంటే మీరు చచి్చనంత ఒట్టు అని కొంచెం గట్టిగానే చెబుతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో జనం ఈ ఒట్లను నమ్మారు. చచ్చాక కచి్చతంగా లేపుతారు కదూ అంటూ కంపెనీలతో తిరిగి ఒట్టేయించుకున్నారు కూడా..
వీళ్లంతా ఒట్లు తీసి గట్లు మీద పెట్టేలోపు.. మనం విషయంలోకి వెళ్లిపోదాం...
రేయ్.. ఎవుర్రా వీళ్లంతా
వీళ్లంతా ఎవరంటే.. అల్కార్, టుమారో బయో, సదరన్ క్రయోనిక్స్, క్రియోరస్, క్రయోనిక్స్ ఇన్‌స్టిట్యూట్ అని ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీళ్లేం చెబుతున్నారంటే.. చనిపోయాక మన శరీరాన్ని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. ‘ఫ్రిజ్’లాంటి దాంట్లో పెట్టేసి.. భవిష్యత్తులో అంటే ఏ 2100లోనో.. లేదా కల్కి 2898 ఏడీలోనో.. మరణాన్ని జయించే మందు లేదా ఏ జబ్బుతో చనిపోయారో దానికి చికిత్స వచి్చనప్పుడు మళ్లీ ‘లేపుతారట’!! ఇందుకోసం జస్ట్.. రూ.1.5–1.8 కోట్లు ఇస్తే చాలట.
ఎవరు నమ్ముతారు అని అనుకుంటున్నారా.. చెప్పాంగా.. చాలామంది నమ్మారు. ఏకంగా 6 వేల మంది ఈ సరీ్వసును బుక్ చేసుకున్నారు. అందులో 500 మంది దాకా.. ఆల్రెడీ ‘ఫ్రిజ్’లో శాశ్వత నిద్రలో ఉన్నారు. భవిష్యత్తులో తమను నిద్ర లేపే అలారం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇందులో సదరన్ క్రయోనిక్స్ ఇటీవలే 80 ఏళ్ల సిడ్నీవాసి మరణించాక.. అతడిని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. భద్రపరిచింది. ఇలా భద్రపరిచిన వాటిల్లో పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి.
ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. నాకు తెలియాలి.. అంతా క్రయోప్రిజర్వేషన్ మహిమ. అంటే.. అత్యంత శీతల వాతావరణంలో
మానవ శరీరాన్ని భద్రపరచడం.
1 మనిషి చనిపోయాక.. ఈ కంపెనీల ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగుతాయి. మెదడు ‘చనిపోకుండా’ప్రత్యేక పరికరాల ద్వారా ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేస్తారు.
2 శరీరాన్ని ఐసులో ఉంచుతారు. రక్తం గడ్డకట్టకుండా హెపారిన్ ఇంజెక్షన్ ఇస్తారు..
3 ప్లాంట్‌కు వెళ్లాక.. శరీరంలోని కణాలు ఫ్రీజ్ అయి దెబ్బతినకుండా ఉండటానికి వాటి నుంచి ద్రవాలను తీసేసి.. బదులుగా
గ్లిజరాల్ బేస్డ్ రసాయనాన్ని ఎక్కిస్తారు (ఈ కంపెనీల్లో టుమారో బయో మాత్రం వాహనంలో ప్లాంటుకు తెస్తున్నప్పుడే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతోంది)
4 తర్వాత శరీరాన్ని డ్రై ఐసులో –130 డిగ్రీల ఉష్ణోగ్రతకు వెళ్లేదాకా ఉంచుతారు..
5 అనంతరం లిక్విడ్ నైట్రోజన్ (–196 డిగ్రీలు) ఉన్న మెటల్ కంటైయినర్‌లో తలకిందులుగా వేలాడదీస్తారు. ఎందుకంటే.. ఎప్పుడైనా ప్రమాదవశాత్తూ లిక్విడ్ నైట్రోజన్ లీక్ అయినా సరే.. మన మెదడు భాగం ద్రవాల్లోనే సురక్షితంగా ఉంటుంది.
నమ్మకమే జీవితం..
మనమా.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని.. అలానడుచుకుంటూ వెళ్లిపోదాం.. ఇంత చెబుతున్నారు సరే.. ఇంతకీ ఇది సాధ్యమేనా అంటే.. సినిమాల్లోనే అయితే సాధ్యమే. కానీ బయట అంటే.. ప్రస్తుతానికైతే చాన్సే లేదని నిపుణులు చెబుతున్నారు. వీళ్లను బతికించే టెక్నాలజీయే లేనప్పుడు ఇలా చేయడం మోసపుచ్చడమే అని విమర్శిస్తున్నారు. ఎప్పటికి వస్తుంది అంటే.. చెప్పడం కష్టమేనంటున్నారు.
అయితే.. ఏదో సినిమాలో ‘నమ్మకమే జీవితం’అన్నట్లు ఈ కంపెనీలు మాత్రం భవిష్యత్తుపై ఆశలు చూపుతున్నాయి. ఇటు జనమూ అలాగే డబ్బులు కట్టేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది సంపన్నులే. వీరు తమ సంపదను అనుభవించడానికి.. అలాగే అమరత్వం సాధించడానికి అన్నట్లుగా చేస్తుంటే.. మరికొందరు భవిష్యత్తులో వచ్చే కొత్త టెక్నాలజీలు, అద్భుతాలను వీక్షించేందుకు ఇదో అవకాశమని భావిస్తున్నారు. ఇప్పుడు నయంకాని జబ్బులను నయం చేసే మందులు భవిష్యత్తులో వస్తాయని వాళ్లు నమ్ముతున్నారు. అందుకే ఇలా చేస్తున్నామని అంటున్నారు. ఇంతకీ మనమేం చేద్దాం..
Comments
Please login to add a commentAdd a comment